Teachers Day 2026: సెప్టెంబర్ 5నే టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక అసలు కారణం ఇదే
Teachers Day 2026: భారతదేశంలో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం, ఉపాధ్యాయ దినోత్సవ విశేషాలు ఇవే.
Teachers Day 2026
Teachers Day 2026: భారతదేశంలో ప్రతేడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాం. విద్యావేత్త, తత్వవేత్త, భారతరత్న, దేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు. తరగతి గది నుంచి దేశ అత్యున్నత పీఠం వరకు ఎదిగిన ఆయన జ్ఞాపకార్థం ఈ ప్రత్యేక దినోత్సవం జరపడం ఒక ఆనవాయితీగా మారింది. 1888 సెప్టెంబర్ 5న జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి కలకత్తా విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పాఠాలు చెప్పారు. 1962లో ఆయన భారతదేశ రెండో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఆయన విద్యార్థులు, అభిమానులు ఆయన పుట్టినరోజును వైభవంగా జరుపుకోవడానికి అనుమతి కోరారు. తన వ్యక్తిగత పుట్టినరోజును జరుపుకోవడం కంటే, ఆ రోజును దేశంలోని ఉపాధ్యాయులందరినీ గౌరవించే రోజుగా పాటిస్తే తనకు ఎంతో సంతోషమని ఆయన వినయంగా సూచించారు. ఆనాటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభమైంది.
విద్యారంగానికి చేసిన అసమాన సేవలు
స్వాతంత్య్రం వచ్చిన వెంటనే 1948లో విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయ విద్య కమిషన్కు సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే భారతదేశంలో ఉన్నత విద్యా విధానాలు రూపుదిద్దుకున్నాయి. విశ్వవిద్యాలయాల స్థాయి, బోధనా ప్రమాణాలు, పరిశోధనలకు ఈ కమిషన్ సిఫార్సులే ప్రాతిపదికగా నిలిచాయి. డీమ్డ్ విశ్వవిద్యాలయం అనే భావన కూడా ఈ కమిషన్ సూచనల నుంచే ఉద్భవించింది. సర్వేపల్లి చూపిన బాటలోనే భారత విద్యా రంగం పురోగమించింది.
దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు
పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పాఠశాలల్లో సీనియర్ విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ తరగతులు నిర్వహించడం ఈ రోజు ప్రత్యేకత. 2026 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 48 మంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను అందజేస్తున్నారు. 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఈ గౌరవం దక్కుతోంది.
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవానికి ఉన్న వ్యత్యాసం
భారతదేశంలో సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకోగా, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ టీచర్స్ డే అక్టోబర్ 5న జరుపుకుంటారు. యునెస్కో, ఐఎల్వో ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల హక్కులు, పనిపరిస్థితులపై 1966లో తీసుకున్న నిర్ణయాలకు గుర్తుగా 1994 నుంచి అంతర్జాతీయంగా అక్టోబర్ 5న నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతిలో మాత్రం గురువును దైవంతో సమానంగా భావిస్తూ సర్వేపల్లి జయంతిని పండగలా జరుపుకోవడం విశేషం.




