Acid Accident : వాటర్ అనుకుని యాసిడ్ తాగిన మహిళ.. పరిస్థితి విషమం..?
Acid Accident : ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో ఊహించని విధంగా జరిగిన ఒక ఘోరమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Acid-Accident
Acid Accident : ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో ఊహించని విధంగా జరిగిన ఒక ఘోరమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాహార్తిని తీర్చుకోవడానికి వాటర్ బాటిల్ అనుకుని ఒక మహిళ పొరపాటున యాసిడ్ తాగేసింది. దీంతో ఆమె అంతర్గత అవయవాలు కాలిపోయి, తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అర్జున్ నగర్ ఏరియాలోని ఒక ప్రముఖ జ్యువెలరీ షాపులో జరిగిన ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ మహిళ బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసుకోవడం, మరుసటి క్షణమే మంట తట్టుకోలేక బయటకు పరిగెత్తడం ఆ విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
నగలు కొనడానికి వెళ్లి.. నీళ్లు అడిగితే
పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళ శుక్రవారం సాయంత్రం నగలు కొనుగోలు చేయడం కోసం అర్జున్ నగర్ ఏరియాలోని ఒక జ్యువెలరీ షాపునకు వచ్చింది. షాపులో నగల డిజైన్లు చూస్తున్న సమయంలో ఆమెకు విపరీతంగా దాహం వేసింది. గొంతు ఎండిపోవడంతో తాగడానికి నీళ్లు కావాలని అక్కడి సిబ్బందిని కోరింది. కస్టమర్ నీళ్లు అడగడంతో ఆ జ్యువెలరీ షాపు యజమాని దేను, వెంటనే పక్కనే ఉన్న ఒక కిరాణా షాపు నుండి కొత్త వాటర్ బాటిల్ తీసుకురావాలని తన పనిమనిషిని పంపించాడు. సదరు పనిమనిషి కిరాణా షాపునకు వెళ్లి లీటర్ వాటర్ బాటిల్ అడగ్గా, ఆ షాపు ఓనర్ ఫ్రిజ్‌లో నుండి ఒక ప్యాక్డ్ సీల్డ్ బాటిల్‌ను తీసి ఇచ్చాడు.
సీల్ ఓపెన్ చేసి సిప్ చేయగానే ఘోరం
పనిమనిషి ఆ బాటిల్‌ను తెచ్చి జ్యువెలరీ షాపులో ఉన్న మహిళ చేతికి అందించాడు. అది పూర్తిగా బ్రాండెడ్ వాటర్ బాటిల్ లాగే ప్యాక్ చేసి ఉండటంతో, లోపల ఏముందో తెలియని ఆ మహిళ ఎలాంటి అనుమానం లేకుండా సీల్ ఓపెన్ చేసింది. వెంటనే బాటిల్‌ను పైకెత్తి ఒక పెద్ద గుటక వేసింది. అంతే, మరుసటి క్షణమే ఆమె నోరు, గొంతు పూర్తిగా కాలిపోవడంతో విపరీతమైన మంటతో గట్టిగా అరుస్తూ, షాపు బయటకు పరిగెత్తి ఆ ద్రవాన్ని ఉమ్మేసింది. కానీ అప్పటికే ఆ ద్రవం గొంతు దాటి లోపలికి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ బాటిల్‌లో ఉన్నది నీళ్లు కాదు, పవర్ ఫుల్ యాసిడ్ అని తేలడంతో షాపులోని వారంతా షాక్‌కు గురయ్యారు.
ఐసీయూలో మహిళ.. పరిస్థితి చాలా ఆందోళనకరం
మహిళ ఆరోగ్యం క్షణాల్లో క్షీణించడంతో జ్యువెలరీ షాపు నిర్వాహకులు, స్థానికులు కలిసి ఆమెను వెంటనే దగ్గరలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే యాసిడ్ ప్రభావం వల్ల ఆమె అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో పరిస్థితి చాలా విషమంగా మారింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఒక పెద్ద మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఐసీయూ లో నిరంతర వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె ప్రాణాలు దక్కేలా చూడటం కోసం వైద్యులు శ్రమిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు.. సీల్డ్ బాటిల్‌లోకి యాసిడ్ ఎలా వచ్చింది?
ఈ షాకింగ్ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జ్యువెలరీ షాపు యజమానితో పాటు కిరాణా షాపు ఓనర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. "మా వైపు ఎలాంటి తప్పు లేదు. అది పూర్తిగా సీల్ చేసి ఉన్న కొత్త బాటిల్. పక్క షాపు ఓనర్ ఫ్రిజ్‌లో నుండి తీసి ఎలా ఇచ్చాడో, మేము కస్టమర్‌కు అలాగే అందించాం" అని జ్యువెలరీ షాపు ఓనర్ దేను పోలీసుల విచారణలో తెలిపాడు.
అయితే, పోలీసులు సదరు కిరాణా షాపులో సోదాలు చేయగా మరికొన్ని యాసిడ్ బాటిల్స్ లభ్యమయ్యాయి. అసలు ప్యాక్డ్ వాటర్ బాటిల్‌లోకి యాసిడ్ ఎలా వచ్చింది? ఎవరైనా కావాలనే కిరాణా షాపులో వాటర్ బాటిల్స్ స్థానంలో యాసిడ్ బాటిల్స్ ఉంచారా? లేదా ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు జరిగిన పొరపాటా? లేక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్ల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
#BREAKING - Accused of forcing a young woman to drink acid in Hapur, Uttar Pradesh. When she asked for water, the shopkeeper gave her a bottle of acid. Acid was found in the Bisleri bottle. The young woman is in critical condition after drinking acid. The acid drinking incident… pic.twitter.com/Yl1Tu4blUZ
— NEWS WALA (@NEWSWALApy) July 11, 2026




