Viral News : మగాళ్లకేనా.. మాకూ టాలెంట్ ఉంది..! ఐదుగురిని పెళ్లి చేసుకున్న ‘కిలాడీ’ లేడీ..!
Viral News : అమ్మాయిల్ని, అమాయకపు అబ్బాయిల తల్లిదండ్రుల్ని నమ్మించి వరుస పెళ్లిళ్లతో ముంచేసే 'నిత్య పెళ్లికొడుకుల' గురించి మనం తరచూ వింటూనే ఉంటాం.
marriage scam
Viral News : అమ్మాయిల్ని, అమాయకపు అబ్బాయిల తల్లిదండ్రుల్ని నమ్మించి వరుస పెళ్లిళ్లతో ముంచేసే 'నిత్య పెళ్లికొడుకుల' గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. "మగాళ్లు మాత్రమేనా హిస్టరీ క్రియేట్ చేసేది.. మేం కూడా హిస్టరీని రిపీట్ చేయగలం" అనుకుందో ఏమో ఓ కిలాడీ లేడి. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా ఏకంగా ఐదుగురిని వరుసబెట్టి పెళ్లాడేసింది.. ‘ఐదుగురు భర్తల ముద్దుల భార్య’గా అవతారమెత్తిన ఈ నిత్య పెళ్లికూతురు కథ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పోలీసుల పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది.
మాయలాడి ‘మణి’ మేనేజ్‌మెంట్
తూర్పుగోదావరి జిల్లా దొండపూడికి చెందిన వజ్రపు మణి అనే ఈమెకు పేర్ల మార్పిడిలో పిహెచ్‌డీ ఉందేమో.. ఒకచోట శ్వేతారెడ్డి, మరోచోట కీర్తి.. ఇలా రకరకాల పేర్లతో చలామణీ అయ్యేది. ఈమె 'కళ్యాణ మహోత్సవాల' వెనుక నలుగురు ఘనాపాటి మధ్యవర్తుల పెద్ద నెట్‌వర్కే ఉంది. వీరంతా కలిసి అబ్బాయిల తరపు వారిని నమ్మించి సంబంధాలు కుదిర్చేవారు. ఈ క్రమంలోనే 2025లో అనంతపురం జిల్లాకు చెందిన సుధీర్‌రెడ్డి అనే అమాయక వరుడు ఈమె వలలో చిక్కాడు. ‘నాకసలు కట్నమే వద్దు.. మీరే ఎదురుకట్నం ఇచ్చుకోండి’ అంటూ బ్రోకర్లు వేసిన స్కెచ్‌తో, సదరు వరుడు ఏకంగా రూ.3.8 లక్షలు ఎదురుకట్నం ఇచ్చి మరీ ఈ నిత్య పెళ్లికూతురిని ఇంటికి తెచ్చుకున్నాడు. పాపం.. పెళ్లి కుదిర్చిన బ్రోకర్లు మాత్రం ఈమెకు కేవలం రూ.20-30 వేల చిల్లర ఇచ్చి మిగతాదంతా వారే నొక్కేశారు..
మూడు రోజుల ముచ్చట.. రైల్వే స్టేషన్‌లో ట్విస్ట్
పెళ్లయ్యాక కొత్త పెళ్లికూతురు అత్తగారింట్లో మూడు రోజుల పాటు భలే యాక్టింగ్ చేసింది. తీరా దాంపత్య జీవితం ప్రారంభించే సమయానికి అసలు డ్రామా మొదలుపెట్టింది. "అయ్యో.. నాకు ఒంట్లో అస్సలు బాలేదు, అర్జంట్‌గా పుట్టింటికి వెళ్ళిపోవాలి" అంటూ సెంటిమెంట్ సీన్ పండించింది. కంగారుపడిపోయిన కొత్త భర్త, ఆమెను తీసుకుని రైలెక్కి బయలుదేరాడు. కట్ చేస్తే.. నంద్యాల స్టేషన్‌లో రైలు ఆగడమే ఆలస్యం, మన కీర్తి అలియాస్ శ్వేతారెడ్డి కాస్తా మాయమైపోయింది.. రైల్వే స్టేషన్ అంతా వెతికి వేసారిన భర్తగారికి అప్పుడు గానీ ‘ట్యూబ్ లైట్’ వెలగలేదు.. తాను నిలువునా మోసపోయానని.. వెంటనే బ్రోకర్లకు ఫోన్ చేస్తే.. ఎప్పటిలాగే ‘స్విచ్ఛాఫ్’ అనే మధురమైన వాయిస్ వినిపించింది.
ఒక్కడితో ఆగుతుందా.. ఐదో పెళ్లి పూర్తి
మోసపోయానని గ్రహించిన సుధీర్‌రెడ్డి గుట్టుచప్పుడు కాకుండా రంగంలోకి దిగి ఆరా తీస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఈమెగారికి అప్పటికే ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారనే నిజంతో పాటు.. తనకంటే ముందు నలుగురిని ఇదే తరహాలో ముంచేసిందని తెలిసి అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. వారు 2025 నుంచి ఈమె కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోపు మన నిత్య పెళ్లికూతురు ఏపీ సరిహద్దులు దాటేసి కర్ణాటకకు మకాం మార్చింది. అక్కడ కూడా ఖాళీగా ఉండకుండా మల్లెకుప్పకు చెందిన ఐదో ‘బకరా’ను వెతికి పట్టుకుని పెళ్లి కూడా కానిచ్చేసింది..
చివరకు కర్ణాటక నుండి మదనపల్లెకు వస్తూ పోలీసుల కంటికి చిక్కి, కటకటాల పాలైంది. మొత్తానికి నిత్య పెళ్లికూతురి ఐదు పెళ్లిళ్ల ‘సినిమా’కు పోలీసులు శుభం కార్డ్ వేసేశారు. మిగిలిన నలుగురు బ్రోకర్లకు కూడా త్వరలోనే ‘ఉచిత భోజన వసతి’ కల్పిస్తామని పోలీసులు చెబుతున్నారు. అబ్బాయిలూ.. ఇకనైనా పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త సుమా..




