Viral News : స్తంభానికి కట్టి చిత్రహింసలు.. గొలుసుతోనే 6 కి.మీ నడిచిన మహిళ

Viral News : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో గుండెల్ని పిండేసే ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాగి ఇంటికొచ్చిన భర్త, భార్యను తీవ్రంగా కొట్టడమే..

G Krishna
Published on: 15 Jun 2026 12:22 PM IST
woman walks 6 km with iron chain after domestic violence
X

woman walks 6 km with iron chain after domestic violence

Viral News : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో గుండెల్ని పిండేసే ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాగి ఇంటికొచ్చిన భర్త, భార్యను తీవ్రంగా కొట్టడమే కాకుండా మెడకు ఇనుప గొలుసు వేసి ఇంట్లోని స్తంభానికి తాళం వేశాడు. అంతటితో ఆగకుండా ఒంటిపై కాలిన ఇనుప రాడ్‌తో వాతలు పెట్టాడు. అయితే, ఆ నరకం నుంచి తెలివిగా తప్పించుకున్న ఆ మహిళ.. మెడలో ఆ ఇనుప గొలుసు, తాళం వేలాడుతుండగానే రాత్రి వేళ 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఆమెను చూసి పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.

పోలీసులకు చెప్తానన్నందుకే ఈ నరకం

బాధితురాలు మంగీబాయి తన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 10 సాయంత్రం ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్ తాగి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. ఆమె ఎదురు తిరగడంతో కర్రతో విపరీతంగా కొట్టాడు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఆ రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరింది. కానీ దారిలోనే భర్త ఆమెను పట్టుకుని, ఈడ్చుకుంటూ మళ్లీ ఇంటికి తెచ్చాడు. "ఇప్పుడు వెళ్లు.. పోలీసులకు ఎలా చెప్తావో చూస్తా" అంటూ మెడకు ఇనుప గొలుసు చుట్టి, దానికి తాళం వేసి ఇంట్లోని స్తంభానికి కట్టేసాడు.

ఇనుప రాడ్‌తో కాల్చి వాతలు

గొలుసుతో కట్టేసిన తర్వాత భర్త సర్దార్ సింగ్ మరింత ఘోరానికి ఒడిగట్టాడు. గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్‌ను ఎర్రగా కాల్చి ఆమె నడుము, తొడ భాగాలపై గట్టిగా నొక్కాడు. ఆమె నొప్పితో ఎంత అరిచినా చుట్టుపక్కల వారు ఎవరూ కాపాడటానికి రాలేదు. దాదాపు 24 గంటల పాటు ఆమెను ఆ గదిలోనే బంధించాడు. ఆ తర్వాత ఊరి పెద్దలను పిలిచి పంచాయితీ పెట్టడానికి, ఆమెను భయపెట్టడానికి భర్త ప్లాన్ చేశాడు. దాంతో ఆమె కూడా బయటపడటానికి భర్త చెప్పిన మాటలన్నింటికీ సరేనంటూ నటించింది.

రాయితో తాళం పగలగొట్టి..

పంచాయితీ కోసం ఊరి జనాన్ని పిలవడానికి భర్త బయటకు వెళ్లిన సమయాన్ని ఆమె సరిగ్గా వాడుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మంగీబాయి కంటికి ఒక రాయి కనిపించింది. దాంతో గొలుసుకు ఉన్న తాళాన్ని గట్టిగా బాదడం మొదలుపెట్టింది. ఎన్నిసార్లు కొట్టినా తాళం రాలేదు, కానీ ఆమె పట్టు వదలకుండా కొట్టడంతో చివరకు తాళం విరిగి గొలుసు ఊడింది. వెంటనే ఆమె ఆ ఇనుప గొలుసు మెడలో ఉండగానే ఇల్లు దాటి రోడ్డుపైకి వచ్చేసింది.

చీకట్లో 6 కిలోమీటర్ల ప్రయాణం

రాత్రి వేళ అడవి దారులు, పొలాల గుండా ఆమె కాలినడకన పోలీస్ స్టేషన్ వైపు పరుగెత్తింది. కాళ్లకు ముళ్లు గుచ్చుకుని రక్తం కారుతున్నా ఆగలేదు. మెడలో గొలుసు చూసి దారిలో కొందరు ఆమెను పిచ్చిది అనుకున్నారు కానీ ఎవరూ ఆపలేదు. చివరకు రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టింది. మెడలో గొలుసు, శరీరంపై కాలిన గాయాలతో ఉన్న ఆమెను చూసి పోలీసులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.

బాధితురాలు ఏడుస్తూ తనకు జరిగిన దారుణాన్ని వివరించడంతో పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు గ్రామానికి వెళ్లి నిందితుడైన భర్త సర్దార్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. తన నోరు నొక్కేయడానికి భర్త వాడిన ఆ ఇనుప గొలుసే, ఇప్పుడు అతనికి శిక్ష పడేలా చేసే బలమైన సాక్ష్యంగా మారింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story