Zomato: జొమాటోలో పావ్ భాజీ ఆర్డర్ చేస్తే ఉల్లిపాయల మధ్య ఊహించని వస్తువు
Zomato: ఆకలేసి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ కస్టమర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది.
Zomato
Zomato: ఆకలేసి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ కస్టమర్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. ఉల్లిపాయలు, నిమ్మకాయతో హాయిగా తిందామని ప్యాకెట్ విప్పిన ఆ వ్యక్తికి అందులో కాలిన బీడీ కనిపించడంతో షాకయ్యాడు. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ అసహ్యకర సంఘటన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల క్వాలిటీని ప్రశ్నిస్తోంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తినడం ప్రస్తుతం మన జీవనశైలిలో భాగమైపోయింది. బెంగళూరు నగరానికి చెందిన ప్రియం అనే కస్టమర్ జొమాటో యాప్ ద్వారా పావ్ భాజీ ఆర్డర్ చేశాడు. ప్యాకింగ్ విప్పి చూసేసరికి అతనికి కడుపులో తిప్పేసే దృశ్యం కనిపించింది. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల మధ్య ఒక కాలిన బీడీ స్పష్టంగా కనిపించింది. ప్యాకెట్‌లో నిమ్మకాయతో పాటు ఈ బీడీ కూడా ప్రత్యక్షం కావడంతో తీవ్ర అసహనానికి గురైన సదరు బాధితుడు ఆ దృశ్యాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "పావ్ భాజీ ఆర్డర్ చేస్తే ఉచితంగా బీడీ వచ్చింది" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్రియం షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో నిమిషాల్లోనే విపరీతంగా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లతో విరుచుకుపడ్డారు. "ఇది ఆహారంతో పాటు లభించే సీజనల్ ఆఫర్ కాబోలు" అని ఒకరు కామెంట్ చేయగా, "పావ్ భాజీకి అదనంగా స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికే ఇలా చేశారు" అని మరికొందరు కామెంట్ చేశారు. ఈ పోస్ట్ కాస్తా జొమాటో యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో సంస్థ వెంటనే స్పందించింది. వివరాలు పంపాలని కోరుతూ, తదుపరి ఆర్డర్ కోసం కేవలం 100 రూపాయల కూపన్ అందించడం గమనార్హం.
ఈ సంఘటన మరోసారి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతను, హోటళ్ల పరిశుభ్రత ప్రమాణాలను ఎండగడుతోంది. రెస్టారెంట్లలో ఆహారం ప్యాక్ చేసే సమయంలో కనీస శుభ్రత పాటించడం లేదని కస్టమర్లు మండిపడుతున్నారు. పావ్ భాజీ లాంటి వేడి పదార్థాల ప్యాకింగ్ తయారీలో పనివాళ్లు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫుడ్ సెఫ్టీ అధికారులు ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
బాహ్య ప్రపంచంలో దొరికే ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీలు ఉంటాయో, వంట గదుల్లో ఎంతటి అపరిశుభ్రత రాజ్యమేలుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. జొమాటో కేవలం మీడియేటర్ గా పనిచేస్తున్నప్పటికీ, నాణ్యమైన రెస్టారెంట్లను మాత్రమే తమ వేదికపై కొనసాగించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. బయటి తిండి కంటే ఇంట్లో వండుకునే స్వచ్ఛమైన ఆహారమే ఆరోగ్యానికి మేలని ఈ ఉదంతం మరోసారి గుర్తుచేస్తోంది.




