7 Forms of Lord Hanuman: ఏడు రూపాల్లో ఆంజనేయుడి దర్శనం... ప్రేమతో ఇలా పిలిస్తే పక్కనే ఉంటాడు
హిందూ సనాతన ధర్మంలో భక్తుల కష్టాలను క్షణాల మీద తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయస్వామి. ఆయన్ను భక్తితో తలచుకుంటే చాలు, ఎంతటి కష్టమైనా దూరం అవుతుంది.
7 Forms of Lord Hanuman: హిందూ సనాతన ధర్మంలో భక్తుల కష్టాలను క్షణాల మీద తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయస్వామి. ఆయన్ను భక్తితో తలచుకుంటే చాలు, ఎంతటి కష్టమైనా దూరం అవుతుంది. అందుకే స్వామిని "సంకటమోచన హనుమాన్" అని పిలుస్తారు. శ్రీమహావిష్ణువుకు దశావతారాలు ఉన్నట్లే, హనుమంతుడు కూడా భక్తుల రక్షణ కోసం, దుష్టశిక్షణ కోసం 7 విశిష్ట రూపాలను ధరించాడు. ఈ ఏడు రూపాల వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకోవడం ప్రతి భక్తునికి ఎంతో శ్రేయస్కరం.
బల హనుమంతుడు
చేతిలో గద పట్టుకుని, నవయవ్వన తేజస్సుతో ఉట్టిపడే రూపమే బల హనుమంతుడు. ఈ రూపం శౌర్యానికి, అపారమైన శారీరక దారుఢ్యానికి ప్రతీక. ఈయన్ను పూజిస్తే శత్రువుల కుతంత్రాల నుండి రక్షణ దొరుకుతుంది.
భక్త హనుమంతుడు
చేతులు జోడించి, కళ్లు మూసుకుని నిరంతరం రామనామ స్మరణలో మునిగిపోయే రూపమిది. భగవంతునిపై అచంచలమైన ప్రేమను, ఆత్మార్పణ భావాన్ని ఇది చూపిస్తుంది. ఈ రూపాన్ని కొలిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
పంచముఖ ఆంజనేయుడు
రామ-లక్ష్మణులను పాతాళ లోకంలో బంధించిన మహిరావణుడిని అంతం చేయడానికి స్వామి 5 ముఖాలతో అవతరించాడు. ఇందులో 5 దివ్య శక్తులు ఉన్నాయి. తూర్పు ముఖం హనుమంతుడు. పాపనాశనం చేస్తుంది. దక్షిణాన ఉండే నరసంహస్వామి ముఖం భయాన్ని నివారిస్తుంది. పశ్చిమ దిశలో ఉండే గరుడుడు దృష్టిదోష నివారణకు, ఉత్తరాన ఉండే వారాహి ముఖం ఐశ్వర్యాన్ని ప్రసాదించేందుకు, ఊర్థ్వ దిశలో హయగ్రీవుడి ముఖం ఉంటుంఆది. ఈ రూపాన్ని ఆరాధిస్తే శనిదోషాలు, నరదృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
శాంత హనుమంతుడు
ప్రశాంత వదనంతో, పద్మాసనంలో కూర్చుని జపం చేసుకునే స్థితిలో స్వామి కనిపిస్తారు. విద్యార్థులకు, మానసిక ఒత్తిడితో బాధపడేవారికి ఈ రూప ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల ఏకాగ్రత, బుద్ధిబలం పెరుగుతాయి.
వీర హనుమంతుడు
యుద్ధరంగంలో శత్రువుల గుండెలను చీల్చి చెండాడే ఉగ్రరూపం ఇది. జీవితంలో అనుకోని ఆటంకాలు ఎదురైనప్పుడు, కోర్టు సమస్యలు లేదా వ్యాపార నష్టాలు ఉన్నప్పుడు వీర హనుమంతుడిని పూజిస్తే కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది.
ఆంజనేయ హనుమంతుడు
మాతృమూర్తి అంజనాదేవి ఒడిలో చిన్నారిగా ముద్దులొలికే రూపమిది. కుటుంబ అనుబంధాలకు, నిష్కల్మషమైన ప్రేమకు ఇది సూచిక. ఈ రూపాన్ని ఆరాధిస్తే ఇంట్లో కలహాలు తగ్గి, పిల్లలు ఆరోగ్యంగా, సన్మార్గంలో ఎదుగుతారు.
రామభక్త హనుమాన్
తన రొమ్మును చీల్చి, హృదయంలో కొలువై ఉన్న సీతారాముల దర్శనాన్ని భాగ్యంగా చూపే పరమ పవిత్ర రూపమిది. ఇది అంతరాత్మ శుద్ధికి మార్గం. ఈ రూపాన్ని గుండెల్లో నిలుపుకుంటే చాలు, ఆంజనేయస్వామి ఎల్లప్పుడూ మనకు తోడుగా, నీడగా మన పక్కనే ఉంటాడు. ఎవరైతే ఈ ఏడు రూపాల వైభవాన్ని అర్ధం చేసుకుని, నిష్కల్మషమైన ప్రేమతో హనుమంతుడిని పిలుస్తారో, వారి జీవితంలో భయానికి తావుండదు. భక్త సులభుడు, కరుణాసింధువు అయిన ఆ వాయుపుత్రుని అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిద్దాం.




