Aadi Krittika 2026:సుబ్రహ్మణ్యుడి ఆరాధన... కుజదోషాలు తొలగడమే కాదు...సంతానమూ కలుగుతుంది

సుబ్రహ్మణ్యుడికి అత్యంత ఇష్టమైన ఆడి కృత్తిక రోజున స్వామివారిని విశేషంగా పూజించి కావడి మోస్తే కుజ దోషాలు తొలగిపోవడంతో పాటు సంతానభాగ్యం కూడా కలుగుతుంది.

Balachander
Published on: 7 Aug 2026 9:12 AM IST
Aadi Krittika 2026:సుబ్రహ్మణ్యుడి ఆరాధన... కుజదోషాలు తొలగడమే కాదు...సంతానమూ కలుగుతుంది
X

Aadi Krittika 2026: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకంలో కుజ దోషం, నాగదోషాలు ఉంటే వివాహ జాప్యం, సంతానలేమి, జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ దోషాలన్నింటినీ పటాపంచలు చేసి, అనుగ్రహించే శరవణభవుడే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. స్కంద పురాణం ప్రకారం స్వామివారి జన్మ నక్షత్రం కృత్తిక. ప్రతి మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చినప్పటికీ, ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం అత్యంత పవిత్రమైనది. ద్రవిడ సంప్రదాయంలో ఆషాఢాన్ని 'ఆడి' అంటారు. ఈ పవిత్ర దినాన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు, సంతాన ప్రాప్తి సిద్ధిస్తాయి.

ఆడికృత్తిక విశిష్టత ... ఆరుపడై వీడులు

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఆడికృత్తిక పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తమిళనాడులోని పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూర్, పాజమలై, తిరుప్పరంకుండ్రం అనే 6 దివ్య క్షేత్రాలను స్వామివారి ఆరుపడై వీడులుగా కొలుస్తారు. ఈ క్షేత్రాలలో ఆడికృత్తిక రోజున అత్యంత వైభవంగా పండుగ నిర్వహిస్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పాలు, పెరుగు, పవిత్ర జలాలను కావళ్లలో నింపుకొని ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి స్వామికి అభిషేకం చేస్తారు. ఈ సేవ వల్ల సంతానలేమి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

నియమాలు ...దివ్య పూజా విధానం

ఆడికృత్తిక రోజున ఉపవాస దీక్షతో సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం ఎంతో శ్రేయస్కరం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శుచియై పూజామందిరాన్ని అలంకరించాలి. స్వామికి ఎరుపు రంగు పూలు, ఎర్ర చందనం సమర్పించాలి. నానబెట్టిన బియ్యాన్ని పిండిగా చేసి, బెల్లం, ఆవు నెయ్యి కలిపి 5, 9 లేదా 11 ప్రమిదలను తయారు చేయాలి. వాటిలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి అక్షింతలతో పూజించాలి. సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయాలి. స్వామికి నువ్వులు-బెల్లం చిమ్మిలి, పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు నివేదించాలి.

పాటించాల్సిన పవిత్ర నియమాలు

ఆడికృత్తిక రోజున ఉల్లి, వెల్లుల్లి, మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. పండుగ ముందు రోజు, పండుగ రోజు రాత్రి బ్రహ్మచర్యం తప్పనిసరి. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం ప్రసాదం స్వీకరించి ఉపవాసం విరమించాలి. ఈ దివ్య నియమాలు పాటించడం వల్ల స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story