Achrumata Temple: కలియుగంలో అద్భుతం... స్వయంగా ఈ అమ్మవారు భక్తులతో మాట్లాడతారు

కలియుగంలో భగవంతుని దర్శనం కలుగుతుందా అంటే తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు తహసీల్‌ గ్రామ ప్రజలు. అక్కడ కొలువైన అచ్రుమాత అమ్మవారు స్వయంగా భక్తులతో మాట్లాడతారని చెబుతున్నారు.

Balachander
Published on: 20 Aug 2026 7:57 AM IST
Achrumata Temple: కలియుగంలో అద్భుతం... స్వయంగా ఈ అమ్మవారు భక్తులతో మాట్లాడతారు
X

Achrumata Temple: భారతదేశం అనాదిగా ఆధ్యాత్మికతకు, రహస్య శక్తులకు నిలయం. దేశంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నప్పటికీ, కలియుగంలో భక్తుల హృదయ విన్నపాలను స్వయంగా విని, తిరిగి మాటల ద్వారా సమాధానమిచ్చే అద్భుత క్షేత్రం మధ్యప్రదేశ్‌లో ఉంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని తహసీల్ అనే గ్రామంలో వెలసిన 'అచ్రుమాత' ఆలయం భక్తులకు ప్రత్యక్ష దైవిక అనుభూతిని కలిగిస్తోంది.

ఆలయ ప్రాశస్త్యం ... దివ్య వాక్కు రహస్యం

సాధారణంగా దైవ దర్శనానికి వెళ్లే భక్తులు నిశ్శబ్దంగా నమస్కరించుకుని వస్తారు. కానీ, అచ్రుమాత ఆలయానికి వచ్చే భక్తులకు భగవంతుడి ఉనికి ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్ర కోనేరు లేదా బావి వద్దకు వెళ్లే మెట్లు దిగిన తర్వాత భక్తులు తమ మనస్సులోని కోరికను అమ్మవారికి నివేదిస్తారు. ఆ సమయంలో ఒక అదృశ్య దివ్య స్వర రూపంలో అమ్మవారి వాక్కు భక్తుడికి స్పష్టంగా వినిపిస్తుంది. కోరిన కోరిక ఈడేరుతుందో లేదో అమ్మవారే స్వయంగా తెలియజేస్తారు. అమ్మవారు 'ఈ పని నెరవేరదు' అని చెబితే, భక్తులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ పని కాదనేది ఇక్కడి భక్తుల అనుభవపూర్వక నిజం. అంతేకాకుండా, అమ్మవారు భక్తుల భక్తిని మెచ్చి ద్రాక్ష, నిమ్మకాయలు, జిలేబీ, పెరుగు లేదా పూల రూపంలో ప్రసాదాన్ని కోనేటి నీటి నుండి ప్రత్యక్షం చేసి అందిస్తారని నమ్ముతారు.

ఎండిపోని అమృత తీర్థం

బుందేల్‌ఖండ్‌ ప్రాంతం తీవ్రమైన నీటి ఎద్దడికి, కరువు పరిస్థితులకు ప్రసిద్ధి. అయితే, చుట్టుపక్కల వందలాది గ్రామాలు నీరులేక అల్లాడుతున్నా, ఈ ఆలయంలోని పవిత్ర కోనేరు మాత్రం ఎప్పుడూ ఎండిపోకపోవడం ఒక మహత్తర దైవిక వింత. ఎంతో కాలం నుంచి నీరు ఎండిపోకుండా, ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. ఇదంతా అచ్రుమాత దయేనని, అమ్మను నమ్మినవారికి అంతా మంచే జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

స్థల పురాణం .. 'అచ్చరు' కథ

పూర్వం అచ్చరు అనే పశువుల కాపరి తన మందలో తప్పిపోయిన పశువు కోసం వెతుకుతూ అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ సమీపంలోని బావి నుండి ఒక దివ్యమైన స్వరం వినిపించి, తప్పిపోయిన పశువు ఉన్న చిరునామా చెప్పింది. అచ్చరు దాహం వేసి బావిలోని నీరు తాగబోగా అతని చేతిలోని కర్ర బావిలో పడిపోయింది. అయితే, అమ్మవారు చెప్పిన ప్రదేశానికి వెళ్లేసరికి అక్కడ పశువుతో పాటు బావిలో పడిపోయిన కర్ర కూడా లభ్యమైంది.

తనకు సాక్షాత్కరించిన దైవాన్ని అచ్చరు నిత్యం పూజించడం ప్రారంభించాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అక్కడ ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. అచ్చరు అనే భక్తుడి ద్వారా వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ అమ్మవారికి 'అచ్రుమాత' అనే పేరు స్థిరపడింది. విశ్వాసంతో వచ్చే భక్తుల కోరికలను తీర్చే పవిత్ర పుణ్యక్షేత్రంగా ఈ ఆలయం అలరారుతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story