Adhika Masa Shivaratri: మూడేళ్లకోసారి వచ్చే అద్భుతం.. ఈ అమావాస్య, శివరాత్రి రోజు ఇలా చేస్తే కష్టాలన్నీ మాయం!

మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాస మాసశివరాత్రి, అమావాస్య రోజుల్లో పాటించాల్సిన నియమాలు, శివారాధన, పితృతర్పణం, దోష నివారణకు చేయాల్సిన పూజలు, దానాల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 9 Jun 2026 3:45 PM IST
Adhika Masa Shivaratri: మూడేళ్లకోసారి వచ్చే అద్భుతం.. ఈ అమావాస్య, శివరాత్రి రోజు ఇలా చేస్తే కష్టాలన్నీ మాయం!
X

Adhika Masa Shivaratri: సాధారణంగా ప్రతి నెలలోనూ మాస శివరాత్రి, అమావాస్య తిథులు వస్తుంటాయి. కానీ, మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో ఇవి రావడం అత్యంత అరుదైన, పవిత్రమైన ఘట్టం. ఈ ఏడాది జూన్ 13వ తేదీన అధిక మాస శివరాత్రి, జూన్ 14, 15 తేదీల మధ్యన అధిక అమావాస్య వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రెండు రోజులలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే.. జీవితాన్ని పట్టిపీడిస్తున్న జాతక దోషాలు, పితృ దోషాలు, కరడుగట్టిన కర్మలన్నీ క్షణాల్లో మటుమాయమవుతాయని పండితులు చెబుతున్నారు. మరి అధిక మాస శివరాత్రి, అమావాస్య రోజున పాటించవలసిన నియమాలు, పూజలు ఏంటో తెలుసుకుందాం.

మాస శివరాత్రి రోజున ఏం చేయాలి?

అధికమాసంలో వచ్చే శివరాత్రి శివపూజకు అత్యంత శ్రేష్ఠమైనది. ఈ రోజున చేసే చిన్న పూజ అయినా సరే, వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. జూన్ 13 శనివారం రోజున శివాలయానికి వెళ్లి శివుడికి మారేడు దళాలు సమర్పించి, పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. అంతేకాదు, అదేరోజు రాత్రి శివపంచాక్షరీ మంత్రాన్ని లేదా మహా మృత్యుంజయ మంత్రాన్ని 108సార్లు జపించడం వలన అకాల మృత్యుభయాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇక మాస శివరాత్రి రోజున లక్ష్మీదేవి, మహాశివుడి అనుగ్రహం కోసం సాయంత్రం వేళ ఇంటిగుమ్మంలో, శివాలయంలో నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వలన శనిభగవానుడు శాంతించి జీవితంలో ఉన్నతికి మార్గం చూపుతాడు.

అధిక అమావాస్య విశిష్టత ... పితృ దోషాలకు చెక్

అధికమాసంలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలోనైనా శని దోషం, రాహు-కేతు దోషాలు లేదా పితృ దోషాల వల్ల వివాహం కాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, సంతాన లేమి వంటి సమస్యలు ఉంటే.. ఈ అమావాస్య ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఈ అమావాస్య రోజున నదులలో లేదా పుణ్యతీర్థాలలో స్నానం చేసి, మీ పితృదేవతలకు తర్పణాలు లేదా పిండ ప్రదానం చేయాలి. ఇలా చేయడం వల్ల నరక బాధల నుండి పూర్వీకులకు విముక్తి లభించి, వారి ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయి. పితృదేవతలు సంతోషిస్తే కుటుంబం సుఖసంతోషాలతో తులతూగుతుంది. కరడుగట్టిన రాహుకేతు దోషాలు నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

దాన గుణం ... పుణ్య ఫలం

ఈ అద్భుతమైన రోజులలో అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా నల్ల నువ్వులు, గొడుగు, లేదా పండ్లను దానం చేయడం వల్ల శని దేవుని ఆగ్రహం చల్లారుతుంది. సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే, ఈ మూడేళ్ల కోసారి వచ్చే అధికమాస తిథులలో చేసే సాధన మిమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది. కాబట్టి ఈ జూన్ 13, 14 తేదీలను అస్సలు వదులుకోవద్దు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story