Sathya Girinatha Swamy Temple Story: దొంగలను తరిమికొట్టిన ఆదిశేషుడు... సంతానాన్ని ప్రసాదించే సత్యగిరినాథుడు
Sathya Girinatha Swamy Temple Story: తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన క్షేత్రాల్లో తిరుమయం ఒకటి. ఇక్కడ స్వామివారు సత్యగిరినాథుడిగా దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారి ఆభరణాలను రక్షించడానికి ఆదిశేషుడు అవతరించిన తీరు భక్తులను అబ్బురపరుస్తుంది.
Sathya Girinatha Swamy Temple Story
Sathya Girinatha Swamy Temple Story: తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన క్షేత్రాల్లో తిరుమయం ఒకటి. ఇక్కడ స్వామివారు సత్యగిరినాథుడిగా దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారి ఆభరణాలను రక్షించడానికి ఆదిశేషుడు అవతరించిన తీరు భక్తులను అబ్బురపరుస్తుంది. గర్భాలయంలోని విగ్రహాన్ని దోచుకునేందుకు ప్రయత్నించిన దొంగలను తన విష జ్వాలలతో తరిమికొట్టిన శేషుని కథ వింటే దైవశక్తి ఎంత గొప్పదో ఇట్టే అర్థమౌతుంది.
నిశీధి రాత్రి.. పొంచి ఉన్న ముప్పు!
స్వామివారి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేసే అరుదైన ఘట్టం తిరుమయంలోని సత్యగిరినాథుని ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయంలోని అమూల్యమైన సంపద, విగ్రహాలపై కన్నేసిన దొంగలు ఎలాగైనా దోచుకోవాలని పథకం వేశారు. ఊరంతా గాఢమైన నిద్రలో ఉండగా ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆలయం ప్రహరీగోడను చాకచక్యంగా దూకారు. ఇక్కడి నుంచి ఆలయం లోపలకి ప్రవేశించే సమయంలో ఓ అద్భుతం చోటు చేసుకుంది.
ఆదిశేషుని ఉగ్రరూపం
ఈ ఆలయంలో స్వామివారికి ఓ పుష్కరిణి ఉంది. దానిని సత్యతీర్థం అని పిలుస్తారు. దొంగలు ఈ సత్యతీర్థం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా ఆకాశం ఎత్తులో, అత్యంత భయానకమైన సర్పం వారిముందు ప్రత్యక్షమైంది. ఆ సర్పం ఉగ్రరూపాన్ని చూసి దొంగలు భయంతో వణికిపోయారు. బుసలు కొడుతూ దొంగలపైకి దూకింది. నోటి నుంచి విషాన్ని చిమ్మింది. అంతే, ఆ దృశ్యాన్ని చూసి దొంగల ప్రాణాలు పోయినంత పనైంది. ఇంకా ముందుకు వెళ్తే ప్రాణాలు పోతాయని, అపరాధం చేశామని గ్రహించి దొంగలు తమ వద్ద ఉన్న ఆయుధాలను అక్కడే పడేసి వచ్చిన దారినే వెనక్కి పారిపోయారు. ఆదిశేషుడి గురించిన కథ నేటికీ తిరుమయం గ్రామంలో వింతగా చెప్పుకుంటారు. స్వామివారి మహిమను వేనోళ్ల కొనియాడతారు.
సంతాన ప్రదాత.. సత్యగిరినాథుడు
ఈ అపురూపమైన, అద్భుతమైన ఘటన తరువాత ఈ తిరుమయం క్షేత్రం మరింత ప్రాచూర్యంలోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో కొలువైన సత్యగిరినాథుడిని దర్శించుకుంటే రక్షణతో పాటు, అపారమైన ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు, సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మకం. శతృభయాలు, ఆర్థిక సమస్యలు తీరాలంటే ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని పూజించాలని, తద్వారా ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.




