Agastyeswara Temple Mystery: అగస్త్యేశ్వరాలయంలో శివకేశవుల రహస్యం...తిరుమల శ్రీనివాసుడే దీనికి సాక్ష్యం
తిరుపతి సమీపంలోని తొండవాడ అగస్త్యేశ్వర ఆలయంలో ఒకే మూర్తిలో శివకేశవుల దర్శనం, శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదముద్ర ఉండటం విశేషం. ఈ ఆలయం స్థలపురాణం ఏంటి, దర్శించుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Agastyeswara Temple Mystery: "శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే... శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః"... ఈ సనాతన సత్యాన్ని చాటిచెబుతూ, ఒకే మూర్తిలో ఒకవైపు పరమశివుడు, మరొకవైపు శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న అద్భుత క్షేత్రం మన తిరుపతికి కూతవేటు దూరంలోనే ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడ వద్ద, పవిత్ర స్వర్ణముఖీ నదీతీరాన వెలిసిన 'అగస్త్యేశ్వర స్వామి' ఆలయం హరిహర అద్వైతానికి ప్రతీక. ఈ క్షేత్రంలో స్వామివారి విగ్రహం పక్కనే ఉన్న శిలపై కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదముద్ర ఉండటం ఇక్కడి పరమ రహస్యం.
అగస్త్యుని ఆశ్రమం ... తిరుమలనాథుని ఆరు నెలల విడిది
త్రేతాయుగంలో అగస్త్య మహాముని ఈ స్వర్ణముఖీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని, ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్టించి నిత్యం అర్చించేవారు. శతాబ్దాల అనంతరం, కలియుగంలో శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తెయైన పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని, పసుపు బట్టలతో తిరుమల కొండకు పయనమయ్యాడు. ఆ సమయంలో మార్గమధ్యంలో ఉన్న అగస్త్యుని ఆశ్రమాన్ని దర్శించారు నూతన వధూవరులు. నూతన దంపతులు పసుపు బట్టలతో వెంటనే కొండ ఎక్కడం శాస్త్రసమ్మతం కాదని భావించిన అగస్త్య మహాముని, వారిని కొంతకాలం తన ఆశ్రమంలోనే ఉండిపొమ్మని ప్రార్థించాడు. మహర్షి కోరికను మన్నించిన స్వామివారు, అమ్మవారితో కలిసి 6 నెలల పాటు అక్కడే విడిది చేశారు. ఆ సమయంలోనే ఆకాశరాజు మరణానంతరం చెలరేగిన రాజ్యసమరానికి శ్రీనివాసుడు స్వయంగా పరిష్కారం చూపారు. కృతజ్ఞతగా తొండమాన చక్రవర్తి తిరుమలలో ఆనంద నిలయాన్ని నిర్మించగా, స్వామివారు కొండకు బయలుదేరే ముందు, తన దివ్య స్మృత్యర్థం ఒక బండరాయిపై తన కుడి పాదముద్రను వదిలి వెళ్లారు. అదే నేటికీ భక్తులకు సాక్షాత్కరిస్తోంది.
హరిహర దర్శనం ... సర్వపాప హరణం
ఒకే గర్భాలయంలో శివకేశవులను, పక్కనే వేంకటేశ్వరుని పాదాలను దర్శించుకోవడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇద్దరూ వేరు కాదనే పరమార్థాన్ని ఈ క్షేత్రం తెలియజేస్తోంది. అందుకే నేటికీ తిరుమలకు వెళ్లే భక్తులు లేదా తిరుగు ప్రయాణంలో ఉన్నవారు ఈ అగస్త్యేశ్వరాలయాన్ని దర్శించుకుని, ఆ హరిహరుల అనుగ్రహాన్ని పొందుతున్నారు. తిరుపతి నుండి చంద్రగిరి వెళ్లే మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎంతో సులభంగా అందుబాటులో ఉన్నాయి.




