Ahobilam Narasimha Swamy: అహోబిలం నరసింహస్వామి రహస్యం...ఈ తొమ్మిది రూపాలను తప్పక దర్శించుకోవాలి
అహోబిలం నరసింహ స్వామిని దర్శించుకుంటే నవగ్రహ దోషాలతో పాటు ఆయురారోగ్యాలు సిద్దిస్తాయి.
Ahobilam Narasimha Swamy: వైష్ణువుల 108 దివ్యధామాల్లో ఒకటి అహోబిలం. పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో ఒకటి. కృతయుగంలో ప్రహ్లాదుడిని రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు స్తంభాన్ని చీల్చుకొని ఉగ్రనరసింహుడిగా ఆవిర్భవించిన స్థలం ఇది. నల్లమల అడవుల మధ్య కొలువైన ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు 9 విశిష్టమైన రూపాల్లో కొలువై ఉంటారని, తనను దర్శించుకున్న భక్తుల కోరికెలు తీరుస్తారని నమ్మకం. ఈ అహోబిలంలో స్వామివారు 9 రూపాల్లో దర్శనం ఇస్తూ జాతకంలోని తొమ్మిది రకాలైన దోషాల నుంచి విముక్తి కల్పిస్తారని నమ్మకం.
క్షేత్ర విశిష్టత...తిరుమల అనుబంధం
దిగువ అహోబిలానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఆ శ్రీవేంకటేశ్వర స్వామి తిరుమల నుండి ఇక్కడికి విచ్చేసి, నరసింహస్వామిని ప్రతిష్టించి, చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ అపూర్వ ఘట్టానికి గుర్తుగా, ప్రతి ఏడాది స్వామివారి కల్యాణోత్సవం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అధికారికంగా పట్టువస్త్రాలు అహోబిలానికి రావడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక్కడి ఎగువ అహోబిలంలో "రక్తగుండం" అనే కొలను ఉంది. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత స్వామి తన చేతులను ఇందులో కడుక్కోవడం వల్ల ఈ నీరు ఎరుపు రంగులో కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే, ఆ నీటిని చేతిలోకి తీసుకోగానే సాధారణ నీటిలా మారిపోతుంది. ఇదంతా స్వామివారి మహిమగా భక్తులు చెబుతారు.
నవనారసింహ రూపాలు
అహోబిల యాత్ర సంపూర్ణం కావాలంటే దట్టమైన అరణ్యంలో కొలువైన ఈ 9 దివ్య స్వరూపాలను దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ తొమ్మిది క్షేత్రాలను ఒక్కరోజులో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి మోక్షం సిద్దిస్తుందని అంటారు. ఇందులో మొదటిది జ్వాలా నరసింహస్వామి. హిరణ్య కశిపుని ఉదరాన్ని చీలుస్తున్న అత్యంత ఉగ్రరూపం. రెండోది అహోబల నరసింహుడు దుష్టశిక్షణ తర్వాత ప్రశాంతంగా కూర్చున్న రూపంలో దర్శనం ఇస్తాడు. మూడో రూపం మాలోల నరసింహుడు.. లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా వస్తే ఆమెను స్వీకరించి ఎడమ తొడమీద కూర్చోబెట్టుకున్న స్వరూపము. నాలుగో రూపం కారంజ నరసింహుడు. చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉండే రూపం. ఐదోరూపం పావన నరసింహుడు. స్వామి వద్దకు వెళ్లి నమస్కరిస్తే చాలు...మన పాపాలన్నింటినీ పటాపంచలు చేస్తాడని భక్తుల నమ్మకం.
ఆరోరూపం యోగ నరసింహుడు... అయ్యప్ప మాదిరిగా యోగపట్టమును కట్టుకొని యోగముద్రలో కూర్చొని ఉంటాడు. దేవతలు స్వయంగా వచ్చి స్వామిని అర్చిస్తారని భక్తులు నమ్ముతారు. పెద్దరావి చెట్టుకింద వీరాసనము వేసుకొని కూర్చున్న స్వామిని చత్రవట నరసింహ రూపము అంటారు. శాప విమోచనం కోసం ఇద్దరు గంధర్వులు అహోబిలం వచ్చి వట వృక్షం వద్ద పాటలు పాడుతూ నృత్యం చేయగా...స్వామివారు ఉచితాసనంలో కూర్చొని తొడపై తాళము వేశారని, ఆ రూపంలోనే భక్తులకు దర్శనం ఇస్తారని అంటారు. ఎనిమదో రూపం భార్గవ నరసింహుడు... పరశురాముడు దర్శించుకున్న రూపాన్ని భార్గవ నరసింహుడుగా చెబుతారు. ఇక చివరిగా తొమ్మిదో రూపం వరాహ నరసింహ రూపం. భూమిని తన దంష్ట్రమీద పెట్టుకొని పైకి ఎత్తిన రూపం. ఈ రూపాన్ని ఆది వరాహస్వామి రూపం అంటారు.
సాధారణంగా ఈ అహోబిలం క్షేత్రంలోని నవ నరసింహులను దర్శించుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది. ఇక్కడి కొండల, గుహల మార్గంలో ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ఎంతో కష్టంతో శ్రమతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి ఆధ్యాత్మిక సాహస యాత్ర చేయడానికి భక్తులు సదా సిద్దపడి అహోబిలం వెళ్లాలి. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ అహోబిలం యాత్ర చేయాలని పండితులు చెబుతున్నారు. నల్లమల అడవుల్లో కొలువైన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే దోషాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా సిద్దిస్తాయని చెబుతారు.




