Alangudi Guru Temple: గురువారం ఈ ఆలయంలో 24 ప్రదక్షిణలు...24 దీపాలు ఎందుకు వెలిగించమంటారో తెలుసా?

జీవితంలో గురువు అనుగ్రహం లేకుంటే ఎంతటి గొప్ప కార్యాలైనా ముందుకు సాగవన్నది వాస్తవం. గురువు అనుగ్రహం కోసం ఈ ఆలయంలో 24 ప్రదక్షిణలు చేసి 24 దీపాలు వెలిగిస్తారు.

Balachander
Published on: 30 July 2026 8:31 AM IST
Alangudi Guru Temple: గురువారం ఈ ఆలయంలో 24 ప్రదక్షిణలు...24 దీపాలు ఎందుకు వెలిగించమంటారో తెలుసా?
X

Alangudi Guru Temple: జీవితంలో ఎంతటి ఘోరమైన గురు దోషాలు ఉన్నా, ఉద్యోగం లేదా చదువులో తీవ్రమైన అడ్డంకులు ఎదురవుతున్నా.. గురువారం నాడు ఈ క్షేత్రంలో 24 ప్రదక్షిణలు చేసి, 24 నేతి దీపాలు వెలిగిస్తే చాలు! సకల దోషాలు తొలగిపోయి అపారమైన విజయం లభిస్తుందని నమ్మకం. భారతదేశంలో నవగ్రహాల్లో ఒకరైన దేవగురు బృహస్పతికి ప్రత్యేకించి వెలసిన ఏకైక దివ్య క్షేత్రం తమిళనాడులోని ‘ఆలంగుడి ఆపత్సహాయేశ్వరర్ ఆలయం’. కుంభకోణం పరిధిలోని 9 నవగ్రహ క్షేత్రాలలో ఈ దేవాలయం అత్యంత పవిత్రమైన గురుస్థానంగా విరాజిల్లుతోంది.

స్థల పురాణం ... ఆపత్సహాయేశ్వరర్ నామధేయం

క్షీరసాగర మథనం సమయంలో ముల్లోకాలను దహించివేసే హాలాహలం ఉద్భవించినప్పుడు, పరమేశ్వరుడు ఆ గరళాన్ని మింగి లోకాన్ని రక్షించిన పవిత్ర ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఆపదలో ఉన్న దేవతలను కాపాడినందుకు సదాశివునికి 'ఆపత్సహాయేశ్వరర్' అనే నామం స్థిరపడింది. ఆ తర్వాత శివభగవానుడు ఇక్కడే దేవదానవులకు జ్ఞానబోధ చేసి 'గురు దక్షిణామూర్తి'గా వెలిశారు. ఈ పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించినవారి జన్మధన్యం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇక్కడ స్వామిని ఆరాధించినవారికి గురుగ్రహబలం పెరుగుతుంది.

24 ప్రదక్షిణలు.. 24 దీపాల దివ్య రహస్యం

గురు దోషాలు, జాతకంలో గురు గ్రహ అనుగ్రహం లేనివారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఆచరిస్తారు. గురువారం నాడు స్వామివారి ఆలయం చుట్టూ 24 ప్రదక్షిణాలు చేసి, 24 నేతి దీపాలు వెలిగించి, నానబెట్టిన శనగల మాల సమర్పిస్తే గురుగ్రహ ప్రసన్నత లభిస్తుంది. ఇక, చదువులో వెనుకబడిన పిల్లలు శనగల మాల వేసి పూజిస్తే జ్ఞానాభివృద్ధి కలిగి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అంతేకాదు, భక్తులు పసుపు రంగు వస్త్రాలు, శనగలు, కందులు స్వామికి సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటారు.

ఆలయ విశేషాలు

స్వామివారి విగ్రహమే ఇక్కడ అద్భుతం అనే చెప్పాలి. చోళరాజు సుందరమూర్తి విగ్రహాన్ని తీసుకెళ్లకుండా రక్షించేందుకు అర్చకుడు విగ్రహానికి మశూచి సోకినట్లు మారువేషం వేశాడు. ఇప్పటికీ స్వామి విగ్రహంపై మశూచి మచ్చలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే ముందుగా వాస్తుకళ గురించి తెలుసుకోవాలి. చోళుల కాలం నాటి 5 అంచెల రాజగోపురం, ఆలయం చుట్టూ ఉన్న 15 పవిత్ర తీర్థాలు ఈ క్షేత్ర మహిమను చాటుతాయి. తమిళనాడులోనే దక్షిణామూర్తికి ప్రత్యేకంగా రథోత్సవం నిర్వహించే ఏకైక ఆలయం ఆలంగుడి కావడం విశేషం. ఏటా చిత్తిరై మాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. తమిళనాడులోని కుంభకోణం పట్టణం నుంచి దక్షిణ దిశగా 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంగుడికి బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఎవరికైనా జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే గురువారం రోజున ఈ ఆలయంలో 24 ప్రదక్షిణలు చేసి 24 దీపాలు వెలిగించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story