Krishna Temple : ఆ గుడిలోని పాయసం అంటే కృష్ణపరమాత్మకు చాలా ఇష్టం...రోజూ ఇలా వచ్చి తీసుకుంటాడట

కేరళలోని అంబళప్పుళ శ్రీకృష్ణస్వామి ఆలయ క్షీరపాయసం వెనుక ఉన్న పురాణగాథ ఏమిటి? చదరంగం పందెం, కృష్ణుడి లీల, ప్రసాద మహత్యం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 31 Aug 2026 9:44 AM IST
Krishna Temple : ఆ గుడిలోని పాయసం అంటే కృష్ణపరమాత్మకు చాలా ఇష్టం...రోజూ ఇలా వచ్చి తీసుకుంటాడట
X

Krishna Temple : దక్షిణ ద్వారకగా విరాజిల్లుతున్న కేరళలోని అంబళప్పుళ శ్రీకృష్ణస్వామి దేవాలయం ప్రసాద మహత్యానికి, భగవంతుని లీలా విశేషాలకు ప్రసిద్ధి చెందింది. చదరంగం ఆటలో ఓడిపోయిన ఒక రాజు శ్రీకృష్ణుడికి బాకీ పడ్డ ధాన్యాన్ని తీర్చుకోవడానికి నిత్యం సమర్పించే దివ్యమైన పాలపాయసమే ఈ క్షేత్ర ప్రధాన ఆకర్షణ. ప్రతిరోజు మధ్యాహ్నం గురువాయూర్ నుండి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణపరమాత్మ స్వయంగా వచ్చి ఇక్కడి పాయసాన్ని స్వీకరిస్తాడని భక్తుల నమ్మకం. ఈ దివ్య క్షేత్ర స్థల పురాణం, ఉత్సవ విశేషాలను తెలుసుకుందాం.

చదరంగం పోటీ ... కృష్ణుని అప్పు

పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన 'చెంబకచ్చేరి దేవనారాయణన్ తంపురాన్' అనే రాజుకు చదరంగంలో విపరీతమైన గర్వం ఉండేది. స్వామివారు వృద్ధుని రూపంలో వచ్చి రాజుతో చదరంగం ఆడి ఓడించారు. పందెం ప్రకారం, చదరంగంలోని 64 గళ్లకు మొదటి గడిలో బియ్యపు గింజ, రెండో గడిలో రెండు, మూడోదానిలో నాలుగు... ఇలా ప్రతి గడికీ రెట్టింపు చేస్తూ బియ్యం ఇవ్వాలి. లెక్క ప్రకారము అది కోట్లాది టన్నుల బియ్యమవుతుంది. రాజు అంత బియ్యం ఇవ్వలేక శరణు వేడగా, స్వామి ప్రత్యక్షమై ఆ అప్పును నిత్యం ఆలయంలో 'పాలపాయసం' రూపంలో భక్తులకు పంచిపెట్టమని ఆజ్ఞాపించారు.

ఏడు గంటల శ్రమ ... పవిత్ర పాలపాయసం తయారీ

ఈ క్షేత్రంలో తయారుచేసే పాలపాయసం అత్యంత ప్రత్యేకమైనది. ఇందుకోసం నెయ్యి లేదా జీడిపప్పు, ద్రాక్ష వంటివి ఉపయోగించరు. ఆలయ గోశాలలోని పవిత్ర ఆవు పాలు, పంచదార, కేరళ ప్రత్యేక మట్ట బియ్యం మాత్రమే వాడతారు. ప్రతీ రోజూ ఉదయం 06:00 గంటలకు ప్రారంభించి సన్నని మంటపై పాలు సగం అయ్యే వరకు మరిగించి, బియ్యం, పంచదార వేసి దాదాపు ఆరు నుంచి ఏడు గంటల పాటు నిరంతరాయంగా వండుతారు. మధ్యాహ్నం పూజానంతరం ఈ లేత గులాబీ రంగు పాయసాన్ని స్వామికి నివేదించి భక్తులకు అందజేస్తారు.

ఆరట్టు ఉత్సవాలు ... కృష్ణుని లీల

ఇక్కడ ఏటా 10 రోజుల పాటు 'ఆరట్టు' ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో జరిగే సమారాధన విందులో బాలకృష్ణుడు స్వయంగా చిన్న బాలుడి రూపంలో వచ్చి భక్తుల విస్తళ్లలో నెయ్యి వడ్డిస్తాడని ఇక్కడి అర్చకులు, భక్తులు విశ్వసిస్తారు. పార్థసారథి రూపంలో అలరించే ఈ కృష్ణయ్యను దర్శించుకుంటే కష్టాలు తొలిగి విజయాలు సిద్ధాయి. అంబళప్పుళ రైల్వే స్టేషన్ నుండి ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి 85 కిలోమీటర్ల ప్రయాణంతో ప్రైవేటు వాహనాలు లేదా బస్సుల ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు. అహంకారాన్ని వీడి భక్తితో శరణుజొచ్చిన భక్తులను శ్రీకృష్ణుడు ఎలా అనుగ్రహిస్తాడో చెప్పడానికి అంబళప్పుళ క్షీరపాయస లీల నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story