Anant Chaturdashi : అనంత చతుర్థశి విశిష్టత...అనంత సూత్రం ఎందుకు కట్టుకుంటారో తెలుసా?
అనంత చతుర్దశి 2026 సెప్టెంబర్ 25న జరుపుకుంటారు. అనంత సూత్రం ప్రాధాన్యత, 14 ముడుల విశిష్టత, పూజా ముహూర్తం, గణపతి నిమజ్జనం గురించి తెలుసుకుందాం.
Anant Chaturdashi : సెప్టెంబర్ 25, 2026 శుక్రవారం అనంత చతుర్దశి. శ్రీమహావిష్ణువును అనంత రూపంలో పూజించే ఈ పవిత్రమైన రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగే 10 రోజుల గణేశ్ ఉత్సవాలకు అనంత చతుర్దశితో ముగింపు పలుకుతారు. ఒకవైపు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు, మరోవైపు గణపతి నిమజ్జనాలు.. దీంతో ఈ పర్వదినం భక్తి, సంప్రదాయం, సందడి కలిసిన ప్రత్యేక రోజుగా నిలుస్తుంది. భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి తిథిని అనంత చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణుమూర్తిని ‘అనంతుడు’ అనే రూపంలో ఆరాధించడం సంప్రదాయం. కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, కష్టాల నుంచి ఉపశమనం కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. ముఖ్యంగా అనంత సూత్రం కట్టుకోవడం ఈ పూజలో ప్రధానమైన ఆచారంగా కొనసాగుతోంది.
2026లో అనంత చతుర్దశి ఎప్పుడు?
2026లో అనంత చతుర్దశి సెప్టెంబర్ 25న శుక్రవారం వస్తోంది. చతుర్దశి తిథి సెప్టెంబర్ 24 రాత్రి 11:18 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 25 రాత్రి 11:06 గంటలకు ముగుస్తుంది. అనంత చతుర్దశి పూజకు ఉదయం 06:11 గంటల నుంచి రాత్రి 11:06 గంటల వరకు ముహూర్తం ఉన్నట్లు పంచాంగ వివరాలు సూచిస్తున్నాయి. మొత్తం పూజా సమయం సుమారు 16 గంటల 55 నిమిషాలు ఉంటుంది.
అనంత సూత్రం ఎందుకు కట్టుకుంటారు?
అనంత చతుర్దశి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అనంత సూత్రమే. సాధారణంగా ఈ పవిత్ర దారానికి 14 ముడులు వేస్తారు. ఈ 14 ముడులు హిందూ సంప్రదాయంలో చెప్పుకునే 14 లోకాలకు ప్రతీకగా భావిస్తారు. విష్ణుమూర్తిని అనంతుడిగా పూజించిన అనంతరం ఈ సూత్రాన్ని చేతికి కట్టుకుంటారు. ఈ దారంలో శ్రీమహావిష్ణువు నివసిస్తాడనే విశ్వాసం భక్తుల్లో ఉంది. అందుకే దీనిని కేవలం ఒక దారంగా కాకుండా దైవంపై విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా చూస్తారు. అనంత సూత్రాన్ని ధరించడం వెనుక ఉన్న భావన కూడా ఆసక్తికరమే. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిపై నమ్మకంతో ముందుకు సాగాలనే సంకల్పానికి ఇది గుర్తుగా భావిస్తారు.
అనంత చతుర్దశి పూజ ఎలా చేయాలి?
అనంత చతుర్దశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లో పూజా స్థలాన్ని శుభ్రం చేసి, శ్రీమహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీపం వెలిగించి పూలు, పండ్లు, నైవేద్యం సమర్పించి విష్ణుమూర్తిని భక్తితో పూజించాలి. అనంత సూత్రాన్ని కూడా పూజలో ఉంచి, అనంతుడైన శ్రీమహావిష్ణువును స్మరించాలి. పూజ పూర్తయిన తర్వాత కుటుంబ సంప్రదాయం ప్రకారం సూత్రాన్ని చేతికి ధరించవచ్చు.
గణపతి నిమజ్జనంతో మరింత ప్రత్యేకత
అనంత చతుర్దశికి మరో ముఖ్యమైన ప్రత్యేకత గణపతి నిమజ్జనం. వినాయక చవితి రోజున ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలకు సాధారణంగా 10 రోజుల పాటు పూజలు నిర్వహించి, అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. ఇళ్లలోనే కాకుండా పెద్ద పెద్ద మండపాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను కూడా ఈ రోజున ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. డప్పులు, భజనలు, నృత్యాలు, రంగురంగుల అలంకరణలతో జరిగే ఈ వేడుకలు నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది త్వరగా రా’ అంటూ భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలుకుతారు. భక్తి, భావోద్వేగం, ఉత్సాహం కలగలిసిన ఈ దృశ్యాలు గణేశ్ ఉత్సవాలకు ముగింపు పలికే ప్రధాన ఘట్టంగా నిలుస్తాయి. అందుకే సెప్టెంబర్ 25న వచ్చే అనంత చతుర్దశి ఒకే సమయంలో శ్రీమహావిష్ణువు అనంత రూపానికి పూజ, అనంత సూత్రం ధరించే సంప్రదాయం, గణపతి నిమజ్జనం వంటి మూడు ముఖ్యమైన ఆధ్యాత్మిక అంశాలను కలిపే విశిష్టమైన పర్వదినంగా నిలుస్తుంది.




