Anantha Padmanabha Temple Miracle: అనంత పద్మనాభ ఆలయంలో అద్భుతం - దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం

నీరు, నిప్పు, గాలిని అదుపు చేయడం కష్టం. ఒక్కసారి దావానంలా వ్యాపించడం మొదలుపెడితే ఇళ్లు, ఊళ్లు అన్నింటినీ తుడిచిపెట్టేస్తాయి. మనుషులు కట్టిన ఇళ్లను నేలమట్టం చేయవచ్చేమోగాని, భగవంతుడు నిర్మించుకున్న గుడిని ధ్వంసం చేయగలదా?

Balachander
Published on: 11 May 2026 7:48 AM IST
Anantha Padmanabha Temple Miracle: అనంత పద్మనాభ ఆలయంలో అద్భుతం - దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం
X

Anantha Padmanabha Temple Miracle: నీరు, నిప్పు, గాలిని అదుపు చేయడం కష్టం. ఒక్కసారి దావానంలా వ్యాపించడం మొదలుపెడితే ఇళ్లు, ఊళ్లు అన్నింటినీ తుడిచిపెట్టేస్తాయి. మనుషులు కట్టిన ఇళ్లను నేలమట్టం చేయవచ్చేమోగాని, భగవంతుడు నిర్మించుకున్న గుడిని ధ్వంసం చేయగలదా? అసాధ్యమే. భగవంతుడు తాను ఉన్నాడు అని చెప్పడానికి ఇలాంటివే నిదర్శనంగా ఉంటాయి. ఈ కలియుగంలోనూ అలాంటి అద్భుతాలను మనముందు జరుగుతూనే ఉన్నాయి. వాటిని మనం నమ్మి తీరాలి. దీనికో ఉదాహరణ తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

ఆలయ శాసనం - ప్రళయ సూచన

ఈ ఆలయానికి సంబంధించి ఒక పురాతన శాసనం ఉంది. అరేబియా సముద్ర తీరానికి చేరువలో ఉన్న ఈ క్షేత్రంలోని గర్భాలయంలోకి వరద నీరు ప్రవేశించి, శేషతల్పంపై ఉన్న స్వామివారి విగ్రహాన్ని తాకితే.. అది ప్రళయానికి సంకేతమని ఆ శాసనం చెబుతోంది. కొంతకాలం క్రితం కేరళలో కురిసిన కుంభవృష్టి వల్ల తిరువనంతపురం నగరం జలమయమైంది. ఆలయ ప్రాకారం చుట్టూ మనుషులు అడుగుపెట్టలేనంత స్థాయిలో నీరు చేరింది.

మూడు రోజుల ఏకాంతం.. గర్భాలయంలో అద్భుతం!

భారీ వరదల వల్ల వరుసగా 3 రోజుల పాటు ఆలయ తలుపులు తీయడం సాధ్యపడలేదు. నిత్య కైంకర్యాలు ఆగిపోయాయని, గర్భగుడిలోకి నీరు చేరిందేమోనని అర్చకులు ఆందోళన చెందారు. కానీ, నాలుగో రోజు వరద కాస్త తగ్గగానే గర్భాలయం తలుపులు తెరిచిన అర్చకులకు నోట మాట రాలేదు. ఆలయం బయట అంతా బురద, నీటితో నిండిపోయి ఉన్నా... గర్భాలయం లోపల చుక్క నీరు కూడా లేదు. కనీసం తేమ ఉన్నట్టుగా కూడా ఆనవాలు కనిపించలేదు. గర్భాలయాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టినట్టుగా ఉంది. అంతేకాదు, గాలివాన భీభత్సంలో కూడా స్వామివారి సన్నిధిలో వెలిగించిన అఖండదీపం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. గాలి కూడా జొరబడేందుకు వీలులేని గదిలో మూడు రోజుల క్రితం స్వామివారికి వేసిన పూలమాలలు వాడిపోకుండా అప్పుడే వేసిన తాజా పువ్వుల మాదిరిగా ఉండటం విస్మయానికి గురిచేసింది. అంతేకాదు, గర్భాలయం సుగంధభరితంగా ఉండటం కూడా విశేషం.

సైన్స్‌కు అందని సత్యం

సాధారణంగా తలుపులు వేసి ఉంటే తేమ వల్ల పువ్వులు కుళ్లిపోతాయి, దీపాలు ఆరిపోతాయి. కానీ ఇక్కడ మాత్రం నిత్యం దేవతలే వచ్చి స్వామిని అర్చిస్తారు అనే నమ్మకానికి ఈ సంఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఒకవైపు ఉపాలయాలన్నీ నీట మునిగినా, గర్భగుడికి మాత్రం ఏమీ కాకపోవడం ఆ అనంత పద్మనాభుడి లీల కాక ఇంకేమిటి? దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నించే నాస్తికులకు సైతం ఈ సంఘటన గట్టి సమాధానం. ఆ శేషశయనుడి కరుణా కటాక్షాలు ఉన్నంత కాలం లోకానికి ఏ భయం లేదు. అద్భుతం జరగకముందు ఎవరైనా, ఎన్నైనా ప్రశ్నించవచ్చు. అద్భుతం జరిగిన తరువాత దాని గురించి చెప్పుకోవడమే తప్పా ప్రశ్నించకూడదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story