Temple Architecture : ఆలయంలో భగవంతుడిని దర్శించుకోవడమే కాదు... ఆలయ నిర్మాణ విషయాలు తెలుసుకోవాలి
మన ప్రాచీన ఆలయాల నిర్మాణంలో దాగి ఉన్న వాస్తు, గణితం, శబ్దశాస్త్రం, పంచభూతాల సమతుల్యత, ఇంజనీరింగ్ విశేషాలను తెలుసుకుందాం.
Temple Architecture : ఆలయ సందర్శనకు వెళ్లినప్పుడు కేవలం భగవంతుడి దర్శనం చేసుకోవడమే కాకుండా, మన సనాతన ఆలయ నిర్మాణాల వెనుక ఉన్న అద్భుత శాస్త్రీయ, ఇంజనీరింగ్ విజ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం. మన ప్రాచీన ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కావు. నాటి శిల్పకళ, వాస్తు, శబ్దశాస్త్రం, గణిత శాస్త్రాల కలయికతో రూపుదిద్దుకున్న అద్భుత నిర్మాణాలు. నాగరి, ద్రావిడ, వేసరి అనే మూడు ప్రధాన శైలుల్లో నిర్మితమైన ఈ దేవాలయాలు నేటి ఆధునిక ఇంజనీరింగ్‌కు సైతం సవాలు విసురుతున్నాయి.
వాస్తు ప్రాముఖ్యత, దిశల ప్రాధాన్యత
ఆలయ నిర్మాణం అనేది సాధారణ ఇళ్ల నిర్మాణాల్లా ఉండదు. పూర్తి స్థాయిలో ఆగమ శాస్త్ర నిబంధనలకు కట్టుబడి నిర్మిస్తారు. ఆలయానికి నలువైపులా నాలుగు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేసే వెసులుబాటు లేకపోతే, తప్పనిసరిగా తూర్పు ముఖంగానే ప్రధాన ద్వారాన్ని నిర్మిస్తారు. ఉదయించే సూర్యకిరణాలు నేరుగా ఆలయంలోకి ప్రవేశించి ధనాత్మక శక్తిని నింపుతాయి. ఇక, సాధారణంగా దేవతా మూర్తుల విగ్రహాలను తూర్పు ముఖంగానే ప్రతిష్ఠిస్తారు. అయితే హనుమంతుడు, దక్షిణామూర్తి, కాళీమాత విగ్రహాలను మాత్రం ప్రత్యేకంగా దక్షిణ ముఖంగా ఏర్పాటు చేయడం శాస్త్రసమ్మతం. గర్భగుడి స్థలం ఆలయ ప్రాంగణంలోని మిగతా ప్రాంతాల కంటే కొంత ఎత్తులో ఉండాలి. విగ్రహాన్ని నిలిపే పీఠం మరింత ఎత్తులో అమర్చాలి.
పంచభూతాల సమతుల్యత... ప్రాంగణ అమరిక
ఆలయ ప్రాంగణంలో ప్రతి చిన్న విభాగానికి ఒక నిర్దిష్ట దిశను కేటాయించారు. నీటి కోనేరును ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో, నీటి ట్యాంకును నైరుతి దిశలో ఏర్పాటు చేస్తారు. ప్రసాదాలు తయారుచేసే పోటుశాలను తప్పనిసరిగా ఆగ్నేయ దిశలోనే నిర్మిస్తారు. ఇక, ఆలయం యొక్క నీడ చుట్టుపక్కల ఉండే సాధారణ నివాస గృహాలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. త్రిభుజాకారం, వృత్తాకారం లేదా దీర్ఘచతురస్రాకారాల్లో కాకుండా శాస్త్రోక్తమైన ఆకృతిలోనే గర్భగుడిని డిజైన్ చేస్తారు.
శబ్దశాస్త్రం ... నాద మండపాల విచిత్రం
ప్రాచీన ఆలయాల్లో సభామండపాలు, నాదమండపాలను ప్రత్యేకంగా నిర్మించేవారు. గుడి గంటల నుంచి వెలువడే శబ్దాలు లేదా వేదమంత్రాల నాదం నాదమండపంలో ప్రతిధ్వనించి ఒక క్రమపద్ధతిలో నాలుగు దిక్కులకూ సమానంగా ప్రసారమవుతాయి. ఈ శబ్ద తరంగాలు మానసిక ఒత్తిడిని తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నేటి ఆధునిక వైద్య పరిశోధనలు కూడా స్పష్టం చేస్తున్నాయి. పక్కా వాస్తు, గణిత లెక్కింపుల ప్రకారం నిర్మించడం వల్లే వేల సంవత్సరాలు గడిచినా మన పురాతన ఆలయాలు చెక్కుచెదరకుండా, నేటికీ సజీవ ఆధ్యాత్మిక చైతన్యానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.




