Ganapathi Temple: కర్ణాటకలో పాండవులు ప్రతిష్టించిన గణపతి... కరువు కాటకాల నుంచి ఇలా విముక్తి
కర్ణాటకలోని ఆనెగుడ్డె వరసిద్ధి వినాయక ఆలయ విశేషాలు, పాండవుల ప్రతిష్ఠ, కుంభాసురుడి కథ, కరువు నుంచి విముక్తి పొందిన స్థలపురాణం, ఆలయ పూజల గురించి తెలుసుకుందాం.
Ganapathi Temple: ఒకప్పుడు కరువుతో అల్లాడిన ప్రాంతం.. వర్షాలు కురవాలని యాగం.. ఆ యాగాన్ని అడ్డుకునేందుకు వచ్చిన రాక్షసుడి సంహారం.. ఆ తర్వాత సుభిక్షమైన నేల. ఈ కథంతా వినగానే ఏదో పురాణగాథలా అనిపిస్తుంది. కానీ కర్ణాటకలోని ఆనెగుడ్డె క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణంలో ఇవే ప్రధాన ఘట్టాలు. పాండవులు ప్రతిష్టించినట్లు విశ్వసించే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర తాలూకాలో ఉన్న ఆనెగుడ్డె చిన్న కొండపై ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి.. కొండ వాతావరణం.. ఆధ్యాత్మిక ప్రశాంతత.. వీటి మధ్య వెలసిన ఈ వినాయక క్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తులునాడులోని ప్రసిద్ధ సప్త ముక్తి క్షేత్రాల్లో ఐదవ క్షేత్రంగా ఆనెగుడ్డెకు ప్రత్యేక స్థానం ఉందని భక్తుల విశ్వాసం.
కుంభాసురుడి కథతో ముడిపడిన క్షేత్రం
ఆనెగుడ్డె ప్రాంతాన్ని పూర్వం కుంభాసి అని కూడా పిలిచేవారని స్థలపురాణం చెబుతుంది. ఈ పేరుకు సంబంధించిన కథ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. కుంభాసురుడు అనే రాక్షసుడి కారణంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అతడిని భీమసేనుడు సంహరించాడని పురాణ కథనం. మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినట్లు స్థానిక స్థలపురాణాలు చెబుతున్నాయి. అప్పట్లో తీవ్ర కరువు కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసిన పాండవులు వారికి ఉపశమనం కలగాలని ప్రార్థించారట. అనంతరం గౌతమ మహర్షి వరుణ దేవుడిని ప్రసన్నం చేసేందుకు యాగాన్ని ప్రారంభించారని కథనం. ఆ యాగానికి కుంభాసురుడు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించగా, భీముడు అతడిని ఎదుర్కొని సంహరించాడని చెబుతారు. రాక్షసుడి సంహారం తర్వాత యాగం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగి, వర్షాలు కురిసి ప్రాంతం మళ్లీ సుభిక్షంగా మారిందనే విశ్వాసం ఉంది.
యాగానికి ముందు గణపతి ప్రతిష్ఠ
ఏ శుభకార్యమైనా విఘ్నాలు లేకుండా సాగాలని ముందుగా గణపతిని పూజించడం సంప్రదాయం. ఇదే భావన ఈ క్షేత్ర స్థలపురాణంలోనూ కనిపిస్తుంది. యాగం ప్రారంభానికి ముందు పాండవులు మహాగణపతిని ప్రతిష్ఠించారని భక్తులు విశ్వసిస్తారు. అదే స్వామి ప్రస్తుతం శ్రీ వరసిద్ధి వినాయకుడిగా పూజలు అందుకుంటున్నారని చెబుతారు.
వెండి కవచంలో గణనాథుడి దర్శనం
ఆలయ గర్భగుడిలో స్వామివారు ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తారు. పెద్ద శిరస్సు, విశాలమైన చెవులు, నాలుగు చేతులతో కూడిన గణపతి విగ్రహం వెండి కవచంతో అలంకరించి కనిపిస్తుంది. నిలుచున్న భంగిమలో ఉన్న స్వామివారి రూపం భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. కోరిన కోరికలను నెరవేర్చే వరసిద్ధి వినాయకుడిగా ఇక్కడి గణపతిని భక్తులు కొలుస్తారు. మొక్కులు చెల్లించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అంతేకాదు, ‘ఆనెగుడ్డె’ అనే పేరుకు కన్నడ భాషలోనే అర్థం దాగి ఉంది. ‘ఆనె’ అంటే ఏనుగు, ‘గుడ్డె’ అంటే కొండ. అంటే ఏనుగు కొండ అనే అర్థం వస్తుంది. గణపతి ఏనుగు ముఖంతో ఉన్న దేవుడు కావడంతో ఈ పేరు కూడా క్షేత్ర ప్రాశస్త్యానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తుంది.
ఎప్పుడూ నీరు వచ్చే బిలం
ఆలయ పరిసరాల్లో కనిపించే మరో విశేషం నీటికి సంబంధించినది. ఒక చిన్న బిలం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుందని స్థానికుల నమ్మకం. ఈ నీరు పవిత్ర గంగా నది అంతర్వాహినిగా ప్రవహించడం వల్ల వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ సమీపంలో సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి ఉండటంతో పాటు సూర్యచంద్రులకు ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి.
తులాభారం నుంచి గణపతి నవరాత్రుల వరకు
ఆనెగుడ్డె ఆలయంలో తులాభారం సేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భక్తులు తమ మొక్కుబడులను స్వామివారికి సమర్పించి ఆశీస్సులు కోరుకుంటారు. ప్రతిరోజూ పూజలు నిర్వహించడంతో పాటు సంకటహర చతుర్థి, గణపతి నవరాత్రులు వంటి పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు.
ఉడిపి నుంచి 30 కి.మీ.
ఆనెగుడ్డె ఆలయం ఉడిపి నుంచి సుమారు 30 కిలోమీటర్లు, కుందాపుర నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు. పురాణ కథలు, ప్రకృతి అందాలు, ప్రశాంతమైన కొండ వాతావరణం, విశిష్టమైన గణపతి రూపం.. ఇవన్నీ కలిపి ఆనెగుడ్డెను ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలబెట్టాయి. కరువు నుంచి ప్రజలకు విముక్తి కలిగించిన క్షేత్రంగా స్థానిక స్థలపురాణాల్లో చెప్పుకునే ఈ వరసిద్ధి వినాయకుడి ఆలయం నేటికీ భక్తుల విశ్వాసానికి కేంద్రంగా కొనసాగుతోంది.




