Apara Ekadashi 2026: అపర ఏకాదశి వ్రతంతో అపారమైన పుణ్యం...మోక్షానికి సులభమైన మార్గం
హైందవ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన అపర ఏకాదశి రోజున ఉపవాసం చేస్తూ వ్రతాన్ని చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది.
Apara Ekadashi 2026: హైందవ సంప్రదాయంలో అపర ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంటుంది. అపర అంటే అపారమైనది అని అర్థం. ఈరోజు భక్తితో ఉపవాసం చేస్తూ శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ధనం, ఐశ్వర్యంతో పాటు పుణ్యం, కీర్తి కూడా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారికి ఈ ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా చెబుతారు.
అపర ఏకాదశి - వ్రత నియమాలు
అపర ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏకాదశి ముందు రోజు అంటే దశమి రాత్రి కేవలం ఉపాహారం మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి. అయితే, ఆరోగ్యం సహకరించనివారు కనీసం పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఇక ఈరోజున విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో స్వామివారిని అర్చించాలి. ఇలా చేయడం వలన కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఏకాదశి రోజున రాత్రి స్వామివారి భజన చేస్తూ జాగరణ చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
మహిధ్వజుని మోక్ష గాథ
పూర్వం మహిధ్వజుడు అనే ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు. అతని తమ్ముడు వజ్రధ్వజుడు అసూయతో అన్నను చంపి అడవిలో పాతిపెట్టాడు. అకాల మరణం వల్ల మహిధ్వజుడు పిశాచిగా మారి అడవిలో సంచరించేవాడు. ఒక మహర్షి ఆ పిశాచిని చూసి జాలితో, తాను ఆచరించిన అపర ఏకాదశి వ్రత ఫలాన్ని ఆ ఆత్మకు ధారపోశాడు. వెనువెంటనే మహిధ్వజుడు పిశాచ రూపం నుండి విముక్తుడై మోక్షాన్ని పొందాడు. వ్రతం ఆచరించే వారు మహిధ్వజుని కథను చదువుకోవడం వలన అపర ఏకాదశి ఎంత విశిష్టమైనదో తెలుస్తుంది. వ్రత మహిమ ఎంత గొప్పదో అర్థమౌతుంది. ఇక ఏకాదశి తరువాత రోజు అంటే ద్వాదశి రోజున సూర్యోదయం సమయంలో స్నానం చేసి సాత్విక ఆహారాన్ని అతిథికి పెట్టాలి. ఇలా అతిథికి భోజనం పెట్టిన తరువాత మాత్రమే యజమాని భుజించాలి. దీనినే పారణ అంటాం. ఈ విధంగా వ్రతం ఆచరిస్తే... 21 తరాల పితృదేవతలకు పుణ్యగతులు లభిస్తాయని పెద్దల నమ్మకం.




