Aparajita Devi: గండాల నుంచి గట్టెక్కించే అపరాజితా దేవి..శుక్రవారం మధ్యాహ్నం ఇలా చేసి చూడండి

Aparajita Devi: జీవితంలో విజయం సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసుంటాం. కానీ, వందల ప్రయత్నాలు చేస్తే ఒక్క విజయం మాత్రమే దక్కితే.. మనసు విసిగిపోతుంది.

Balachander
Published on: 24 April 2026 8:38 AM IST
Aparajita Devi
X

Aparajita Devi: గండాల నుంచి గట్టెక్కించే అపరాజితా దేవి..శుక్రవారం మధ్యాహ్నం ఇలా చేసి చూడండి

Aparajita Devi: జీవితంలో విజయం సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసుంటాం. కానీ, వందల ప్రయత్నాలు చేస్తే ఒక్క విజయం మాత్రమే దక్కితే...మనసు విసిగిపోతుంది. ఏం చేయాల్రా దేవుడా అని తల పట్టుకుంటాం. అలాంటి క్లిష్ట సమయంలో భక్తితో ప్రార్థిస్తే వెంటనే స్పందించే దేవత అపరాజితా దేవి. అపరాజిత అంటే ఎప్పుడూ ఓడిపోని శక్తి అని, అమ్మవారి కరుణ ఉంటే గండాలు తొలగి విజయమార్గం సులభం అవుతుందని అంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన ఈ తల్లిని శుక్రవారం నాడు విశేషంగా పూజిస్తే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయి.

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన రహస్య శక్తి

మనం విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లి దుర్గాదేవిని దర్శించుకుంటాం. ఆ వెంటనే గర్భాలయానికి వెనుక భాగంలో కొలువైన క్షేత్రపాలకుడు ఆంజనేయుడిని దర్శించుకొని వస్తుంటాం. కానీ, దుర్గాదేవి, ఆంజనేయుడితో పాటు మరో అపరాజితా దేవిని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. ఈ అమ్మవారు క్షేత్రపాలకుడైన ఆంజనేయుడికి వెనుక వైపున ఉంటుంది. ఇక్కడి అమ్మవారి విగ్రహాన్ని సామాన్యంగా గమనించరు. కానీ, ఈ చిన్న విగ్రహం మనలో కొండంత ధైర్యాన్ని నింపుతుంది. అంతులేని గండాల నుంచి రక్షిస్తుంది. కష్టాల సుడిగుండాల నుంచి గట్టెక్కిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లినవారు పసుపు, కుంకుమ ప్యాకెట్లను అమ్మవారిపైకి విసిరేస్తుంటారు. ఇలా చేయడం ముమ్మాటికి తప్పు. వీటిని విసరకుండా జాగ్రత్తగా అక్కడ పెట్టాలి. నిశ్శబ్ధంగా నిలబడి అమ్మరూపాన్ని మనసంతా నింపుకోవాలి.

ఆవిర్భావం - విజయ సంకేతం

అమ్మవారి ఆవిర్భావం గురించి దేవీ భాగవతంలోని చండీ సప్తశతిలో వస్తుంది. పూర్వం దేవాసుర యుద్ధంలో దేవతలు దిక్కుతోచని స్థితిలో ఉండగా... వారికి విజయాన్ని ప్రసాదించేందుకు అమ్మవారు అపరాజిత రూపంలో ఆవిర్భవించారు. శతృవుల నుంచి రక్షణ పొందేందుకు, మన లోపల ఉన్న భయం, బద్దకం అనే శతృవులను ఓడించేందుకు అమ్మవారు సహకరిస్తారు.

శుక్రవారం నాడు ఇలా చేయండి

ప్రతి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో పూజగదిలో అమ్మవారి పటం ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించాలి. అనంతరం అపరాజిత స్తోత్రాన్ని భక్తితో పఠించాలి. ఇలా భక్తి శ్రద్దలతో చేయడం వలన అమ్మవారు ప్రసన్నురాలౌతారు. మన చుట్టూ ఓ అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఏలకలు వేసిన పాలు, పటిక బెల్లం సమర్పించాలి. భక్తితో ఎవరైతే అమ్మను ప్రార్థిస్తారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు రావని దేవీభాగవతం చెబుతోంది.

ఎవరికి ఈ పూజ అవసరం?

ఎంత చదివినా పరీక్షల సమయం వచ్చేసరికి భయంతో చదివింది మర్చిపోతుంటారు విద్యార్థులు. అలాంటివారు అమ్మను ఆరాధిస్తే వారికి బుద్దిప్రచోదనం కలుగుతుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. కార్యాలయంలో రాజకీయాల వలన లేదా మరేదైనా కారణం వలన రావలసిన ప్రమోషన్లు అందకుంటే అలాంటివారు కూడా అమ్మను ఆరాధించాలి. కోర్టు కేసులు, అప్పుల బాధలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా అమ్మవారిని ప్రార్థిస్తే 40 రోజుల్లో తప్పకుండా మార్పులు కనిపిస్తాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story