Arjuna Battle With Lord Shiva: భారతంలో మహాద్భుతంః మహాశివుడితో యుద్ధం చేసిన అర్జునుడు
మహాభారత ఇతిహాసంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ఎత్తైతే, ఆ యుద్ధంలో పాండవుల విజయానికి పునాది వేసిన 'కిరాతార్జునీయ ఘట్టం' మరొక ఎత్తు.
Arjuna Battle With Lord Shiva: మహాభారత ఇతిహాసంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ఎత్తైతే, ఆ యుద్ధంలో పాండవుల విజయానికి పునాది వేసిన 'కిరాతార్జునీయ ఘట్టం' మరొక ఎత్తు. తన కంటే బలవంతుడైన శత్రువును సైతం ఎదురించాలంటే కేవలం బాహుబలమే సరిపోదు, దైవబలం కూడా తోడవ్వాలని నిరూపించే అద్భుత ఘట్టమిది. కురుక్షేత్ర యుద్ధానికి ముందే అర్జునుడు ఆ భోళాశంకరుడితోనే తలపడ్డాడు. తాను పోరాడుతున్నది లయకారుడితో అని తెలియక, ఒక సామాన్య వేటగాడే కదా అని అర్జునుడు చేసిన ఆ వీరోచిత పోరాటం, ఆ తర్వాత పొందిన పాశుపతాస్త్ర రహస్యాన్ని తెలుసుకుందాం. అర్జునుడు, వేటగాడికి మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసుకుందాం.
హిమాలయాల్లో అర్జునుడి ఘోర తపస్సు
భవిష్యత్తులో జరగబోయే మహా యుద్ధంలో కౌరవులను ఓడించాలంటే అమోఘమైన దివ్యాస్త్రాలు కావాలని శ్రీకృష్ణుడు సూచించడంతో... అర్జునుడు హిమాలయాల్లోని ఇంద్రకీలాద్రి పర్వతంపై పరమశివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అర్జునుడి ఏకాగ్రతను, క్షత్రియ ధర్మాన్ని, అతని అహంకారాన్ని పరీక్షించాలని ఆ సదాశివుడు తలచాడు. దీనికోసం ఈశ్వరుడు ఒక 'కిరాతుడు' రూపం ధరించాడు. పార్వతీదేవి కూడా వేటగాడి భార్య రూపంలో స్వామిని అనుసరించింది.
ఒకే పంది.. రెండు బాణాలు!
సరిగ్గా అదే సమయంలో, మూకాసురుడు అనే రాక్షసుడు ఒక మాయా అడవిపంది రూపంలో వచ్చి అర్జునుడి తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. ప్రమాదాన్ని గమనించిన అర్జునుడు వెంటనే గాండీవాన్ని చేతబూని ఆ పందిపై ఒక బాణాన్ని సంధించాడు. అదే సమయంలో వేటగాడి రూపంలో ఉన్న శివుడు కూడా తన వింటి నుండి మరొక బాణాన్ని వదిలాడు. ఇలా రెండు బాణాలు ఒకేసారి తగలడంతో ఆ మాయా వరాహం ప్రాణాలు విడిచింది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. "నా బాణం వల్లే పంది చనిపోయింది, ఈ వేటాడిన జంతువు నాదే" అని అర్జునుడు అంటే, "లేదు, ముందే నేను బాణం వేశాను, దానిపై నాకే హక్కు ఉంది" అని వేటగాడు వాదించాడు. ఈ మాటల యుద్ధం కాస్తా ప్రళయ కాల యుద్ధంగా మారింది.
శివుడితో ముష్టియుద్ధం.. అస్త్ర సమర్పణ
అర్జునుడు తన అమ్ములపొదిలోని శరాలన్నింటినీ ఆ వేటగాడిపై ప్రయోగించాడు. కానీ, ఆశ్చర్యకరంగా ఆ బాణాలన్నీ శివుడి శరీరానికి తగిలి పూలలా కింద పడిపోసాగాయి. అమ్ములపొది ఖాళీ అవ్వడంతో, అర్జునుడు తన కత్తిని తీసి వేటగాడి తలపై బలంగా కొట్టాడు. కానీ, ఆ కత్తి కాస్తా రెండు ముక్కలై విరిగిపోయింది. కోపంతో అర్జునుడు పెద్ద పెద్ద చెట్లను, బండరాళ్లను విసిరాడు. చివరకు ఇద్దరి మధ్య ఘోరమైన ముష్టియుద్ధం జరిగింది. ఈ పోరాటంలో వేటగాడి దెబ్బలకు తాళలేక అర్జునుడు తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయాడు.
కాసేపటికి స్పృహలోకి వచ్చిన అర్జునుడు, తన శారీరక బలం పనిచేయడం లేదని గ్రహించి, మనసును దైవం వైపు మళ్లించాడు. వెంటనే అక్కడ ఉన్న మట్టితో ఒక శివలింగాన్ని చేసి, దానికి భక్తితో ఒక పూలదండను వేశాడు. ఆ మరుక్షణమే ఆ పూలదండ ఎదురుగా ఉన్న వేటగాడి మెడలో ప్రత్యక్షమైంది!
వచ్చింది ఎవరో కాదు.. ఆ కైలాసనాథుడే అని గ్రహించిన అర్జునుడు పశ్చాత్తాపంతో స్వామి కాళ్లపై పడ్డాడు. అర్జునుడి పట్టుదలకు, భక్తికి మెచ్చిన పరమశివుడు తన నిజరూపంలో దర్శనమిచ్చి, ముల్లోకాలను శాసించగల అత్యంత శక్తివంతమైన 'పాశుపతాస్త్రాన్ని' అనుగ్రహించాడు. భగవంతుని ముందు అహంకారాన్ని వీడి శరణాగతి వేడితే, విజయం మన వెంటే ఉంటుందని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. ఈ కథ మనకు చెబుతున్నది ఒక్కటే... శక్తి కంటే భక్తి ముఖ్యం. భక్తితో వేడుకుంటే భగవంతుడు మనకు కావలసినవన్నీ ప్రసాదిస్తాడు.




