Arunachala Girivalam: అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఇలా నందీశ్వరుడు కనిపించాడా... మీకన్నా అదృష్టవంతులు ఎవరుండరు

అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో తప్పని సరిగా ఇక్కడ ఈ ప్రదేశంలో నిలబడి నందీశ్వరుడిని దర్శించుకోవాలి. అప్పుడే యాత్ర సంపూర్ణమౌతుంది.

Balachander
Published on: 1 July 2026 7:52 AM IST
Arunachala Girivalam: అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఇలా నందీశ్వరుడు కనిపించాడా... మీకన్నా అదృష్టవంతులు ఎవరుండరు
X

Arunachala Girivalam: అరుణాచల క్షేత్ర మహత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. "స్మరణాత్ అరుణాచలం" అన్నారు పెద్దలు, అంటే కేవలం తలుచుకుంటేనే ముక్తిని ప్రసాదించే పరమ పవిత్రమైన క్షేత్రం ఇది. అయితే, అరుణాచలేశ్వరుడి అనుమతి లేనిదే ఆ కొండ వైపు కనీసం అడుగు కూడా వేయలేము అనేది జగమెరిగిన సత్యం. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళిన ప్రతి భక్తుడు 14 కిలోమీటర్ల పొడవున్న గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. గిరి ప్రదక్షిణ చేయకుండా వస్తే ఆ యాత్రే అసంపూర్ణంగా భావిస్తారు. అయితే, ఈ సుదీర్ఘ ప్రదక్షిణ మార్గంలో భక్తులకు లభించే అత్యంత అద్భుతమైన, ఆధ్యాత్మిక రహస్యం ఒకటుంది. ఆ పరమశివుని వాహనమైన నందీశ్వరుడు ఇక్కడ భక్తులకు పర్వత రూపంలో దర్శనమిస్తాడు. గిరి చుట్టూ తిరిగే ప్రతి ఒక్కరికీ ఈ రూపం కనిపించదు; దానికి ఒక నిర్దిష్టమైన స్థానం, సమయం ఉన్నాయి.

నందీశ్వరుడు ఎక్కడ, ఎలా కనిపిస్తాడు?

గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలు ఉంటాయి. అందులో నాలుగో లింగమైన యమలింగాన్ని దర్శించుకుని ముందుకు సాగుతున్నప్పుడు, ఆ తర్వాతిదైన ఐదవ లింగం నైరుతి లింగం వైపు వెళ్లే దారిలో ఒక ప్రత్యేకమైన చోటు వస్తుంది. సరిగ్గా యమ లింగానికి, నైరుతి లింగానికి మధ్యలో నిలబడి, అరుణాచల పర్వతం వైపు తీక్షణంగా చూడాలి. అక్కడ పర్వత శిఖర భాగాలు ఒక అద్భుతమైన ఆకృతిని సంతరించుకుని, నందీశ్వరుడి ముఖభాగాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తాయి. ఆ స్థానంలో కాకుండా, కొద్దిగా ముందుకు లేదా వెనుకకు జరిగినా ఆ రూపం సామాన్య మానవుడి కంటికి చిక్కదు. అందుకే అంటారు, అక్కడ ఆగి నిలబడి చూస్తేనే ఆ నందీశ్వరుడి కటాక్షం లభిస్తుందని!

ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

ఈ 14 కిలోమీటర్ల దివ్య ప్రయాణంలో కేవలం నడక ముఖ్యం కాదు, మన అంతరంగ శుద్ధి కూడా అంతే ముఖ్యం. ప్రదక్షిణ చేసే సమయంలో పక్కవారితో అనవసరమైన లౌకిక విషయాలు మాట్లాడకూడదు. మనసులో నిరంతరం "ఓం నమః శివాయ" లేదా "అరుణాచల శివ" అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మన కాళ్ల పాదాల శబ్దం భూదేవికి కూడా వినిపించనంత నెమ్మదిగా, ప్రశాంతంగా అడుగులు వేయాలని పండితులు చెబుతారు.

అరుణాచల కొండ కేవలం రాళ్లు, రప్పలతో కూడిన గుట్ట కాదు, అది నడయాడే శివస్వరూపం. ఆ పర్వతంలో నంది ముఖచిత్రం కనిపించడం అనేది ప్రకృతి చేసిన వింత కాదు, ఈశ్వరుడి లీల. మీ తదుపరి అరుణాచల యాత్రలో యమ లింగం దాటిన తర్వాత ఆ నందీశ్వరుడిని దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆ రూపం మీకు కనిపిస్తే... మీకన్నా అదృష్టవంతులు ఎవరుండరు. అర్ధమైంది కదా... నందీశ్వరుడి దర్శనం చేసుకుంటే ఈ జన్మలో చేసిన పాపాలు పటాపంచలైపోతాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story