Arunachalam: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు...ఒక్కసారైనా ఈ అరుగుపై కూర్చోవాలి... ఎందుకంటే

అరుణాచల గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగా ఉన్న పవిత్ర అరుగుకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటి? కావ్యకంఠ గణపతి ముని జీవితాన్ని మార్చిన ఈ అద్భుత సంఘటన గురించి తెలుసుకోండి.

Balachander
Published on: 5 Jun 2026 11:24 AM IST
Arunachalam: అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారు...ఒక్కసారైనా ఈ అరుగుపై కూర్చోవాలి... ఎందుకంటే
X

Arunachalam: అరుణాచలం పేరు వినగానే మనకు ఇద్దరు గుర్తుకు వస్తారు. అందులో ఒకరు రమణ మహర్షి కాగా, రెండోవ్యక్తి కావ్యకంఠ గణపతి. రమణ మహర్షి గురించి తెలిసినంతగా కావ్యకంఠ గణపతి ముని గురించి చాలా మందికి తెలియదు. ఇక అరుణాచలంలో అడుగుపెట్టాలంటే ఖచ్చితంగా ఆ అరుణాచలేశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే. ఆయన ఆనుమతి లేకుండా ఈ క్షత్రంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. ఈ విషయాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారే స్వయంగా పలుమార్లు తన ప్రసంగాల్లో పేర్కొన్నారు. అరుణాచలంలోకి అడుగుపెట్టిన తరువాత వెంటనే అందరూ గిరిప్రదక్షిణ చేసి వెళ్లిపోతుంటారు. కానీ, గిరి ప్రదక్షిణలో మనం తప్పకుండా ఓ అరుగుపై కూర్చోవాలని చెబుతుంటారు. ఆ అరుగు ఏమిటి? ఎందుకు కూర్చోవాలో తెలుసుకుందాం.

అరుణగిరి ప్రదక్షిణ... అరుగు ప్రాముఖ్యత

అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎటువంటి బాధలైనా తొలగిపోతాయని, ప్రదక్షిణ చేసినవారి అరచేతిలో ఎర్రని ఓ అడ్డగీత గీస్తారని చెబుతారు. ఇక గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆ ఆశ్రమానికి ఎదురుగా ఓ అరుగు ఉంటుంది. ఈ అరుగు గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఈ అరుగుకి కావ్యకంఠ గణపతి మునికి అవినాభ సంబంధం ఉంది. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కావ్యకంఠ గణపతిముని తన సోదరుడితో కలిసి అరుణాచలం వెళ్లగా...ఆరోజు ఏకాదశి కావడంతో అరుణాచలంలో ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉన్నారు. ఏ ఇంట్లో కూడా పోయి వెలిగించకపోవడంతో వారికి ఆహారం లభించలేదు. దీంతో గణపతి మహాముని సోదరుడు ఆకలితో అలమటించి...అలసిపోయి ఓ ఇంటిముందున్న అరుగుపై పడుకున్నారు. ఈ అరుగే కావ్యకంఠ గణపతి మహాముని జీవితాన్ని మలుపుతిప్పింది.

ఆదిదంపతులు...ఏకాదశి భోజనం

అలసిపోయి అరుగుపై పడుకున్న కావ్యకంఠ గణపతి మహాముని, ఆయన సోదరుడిని ఇంటి యజమానురాలు నిద్రలేపి... తాము ఏకాదశి రోజున ఆహారం తీసుకునేవారి కోసమే ఎదురు చూస్తున్నామని, మిమ్మల్ని చూస్తుంటే ఆకలితో అలమటించిపోతున్నారని అర్థమౌతుందని, ఆహారం తీసుకోవాడానికి రావాలని కోరుతుంది. ఆ అమ్మ ఆ మాట చెప్పగానే వారికి ప్రాణాలు లేచొస్తాయి. వెంటనే ఇంట్లోకి వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని షడ్రుచులతో కూడిన భోజనం చేస్తారు. భోజనం చేసిన తరువాత తాంబూలం ఇచ్చి... అరుగుపై పడుకోమని చెబుతుంది. కావ్యకంఠ గణపతి, ఆయన సోదరుడు అరుగుపై పడుకొని నిద్రపోతారు. ఎన్నడూ లేని విధంగా వారికి నిద్రపడుతుంది. తెల్లవారి లేచి చూసేసరికి అక్కడ ఎలాంటి ఇల్లు కనిపించదు. గణపతి ఆలయం మాత్రమే ఉంటుంది. కావ్యకంఠ గణపతి మహాముని ఆశ్చర్యపోతాడు. రాత్రి తమకు ఆహారం పెట్టింది సాక్షాత్తు ఆ అపితకుచమాంబనేని తెలుసుకొని భక్తితో నమస్కరిస్తాడు. నేటికీ ఆ అరుగు మనకు రమణ మహర్షి ఆశ్రమానికి ముందు వస్తుంది. ఆ అరుగుపై కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా మారుతుందని భక్తులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story