Arunachalam: అరుణాచలంలో అష్టగణపతుల దర్శనం...జీవితంలో తిరుగులేని ప్రయాణం
అరుణాచలం... ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. స్మరణ మాత్రమున ముక్తిని ప్రసాదించే ఆ మహాక్షేత్రంలో అడుగుపెట్టగానే మనం నేరుగా అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం పరిగెడతాం.
Arunachalam Ashta Ganapathi Darshan: అరుణాచలం... ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. స్మరణ మాత్రమున ముక్తిని ప్రసాదించే ఆ మహాక్షేత్రంలో అడుగుపెట్టగానే మనం నేరుగా అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం పరిగెడతాం. కానీ, ఆ పరమశివుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే, ఆ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న అష్టగణపతులను దర్శించుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. మనం గమనించని, మనకు తెలియని ఆ ఎనిమిది గణపతుల దివ్య రహస్యాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
అష్టగణపతులు
రాజగోపురం గుండా ఆలయంలోకి అడుగుపెట్టగానే మొట్టమొదట మనకు దర్శనమిచ్చేది సెల్వ గణపతి. ఈయనకు నమస్కరించుకున్నాకే క్షేత్ర ప్రవేశం చేయాలి. ఆయన మన యాత్రను నిర్విఘ్నంగా కొనసాగేలా దీవిస్తారు. భక్తులు తప్పనిసరిగా సెల్వ గణపతిని దర్శించుకోవాలి. మురుగన్ ఆలయం సమీపంలో సర్వసిద్ధి గణపతి కొలువై ఉన్నారు. పేరులోనే ఉన్నట్లుగా మనం తలపెట్టిన సర్వ కార్యాల్లో సిద్ధిని ప్రసాదించే దైవం ఈయన. భల్లాల గోపురం వద్ద ఉండే మంగై పిల్లయార్ అత్యంత శక్తివంతుడు. మన మనసులోని కోరికలను ఈ గణపతికి విన్నవిస్తే, ఆయన వాటిని నేరుగా అరుణాచలేశ్వరుడికి చేరవేసి, మన సంకల్పం నెరవేరేలా చేస్తాడట.
చిలుకలు ఉండే 'కిలి గోపురం' బయట ఈ యానై తిరికొండ గణపతి దర్శనమిస్తారు. ఈయనకు మొక్కి, గోపురానికి నమస్కరించడం వల్ల పితృదోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇక చాలామంది స్వామిని దర్శించుకుని వెనుతిరుగుతారు. కానీ ఆలయం వెనుక వైపు కుడి భాగాన ఉన్న వాలమురి గణపతిని తప్పక చూడాలి. జ్ఞాన వృద్ధికి ఈయన దర్శనం ఎంతో ముఖ్యం. అంతేకాదు, ప్రధాన ఆలయ మార్గంలో ఉండే సంబంధ గణపతి విశిష్టమైనవాడు. రమణ మహర్షి కూడా ఈ సంబంధ గణపతిని దర్శించుకున్నాకే లోపలికి వెళ్లేవారట. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని ఈ స్వామి గుర్తుచేస్తుంటారు. ఆలయం వెనుక ఎడమ వైపున మూలలో విజయ రాఘవ గణపతి ఉంటారు. జీవితంలో ఓటములతో కుంగిపోయేవారు, విజయాల కోసం ఈ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక అష్టగణపతులలో చివరివాడు, అత్యంత నిగూఢమైనవాడు సూక్ష్మ గణపతి. కావ్యకంఠ గణపతిముని వంటి గొప్ప సాధకుల ఆరాధన వల్లనే ఈయన ఉనికి లోకానికి తెలిసింది. స్థూలమైన శరీరంలో ప్రాణం ఎంత సూక్ష్మంగా ఉంటుందో, ఈ ఆలయంలో స్వామి అంత అంతర్లీనంగా ఉంటారు.
అరుణాచల యాత్ర అంటే కేవలం గిరి ప్రదక్షిణ మాత్రమే కాదు, ఈ అష్టగణపతుల అడుగుజాడల్లో నడవడం. ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు, ఈ ఎనిమిది మంది గణపతులను వెతికి మరీ దర్శించుకోండి. ఆ విఘ్నేశ్వరుడి కరుణ ఉంటేనే ఆ అరుణాచలేశ్వరుడి కటాక్షం మనకు దక్కుతుంది. అష్టగణపతులతో పాటు అరుణాచలం శిఖరానికి ఎనిమిది దిక్కుల్లో కొలువైన ఎనిమిది దిక్పాలకులను కూడా తప్పకుండా దర్శించుకోవాలి.




