Ashada Masam: పెద్దలు చెప్పినట్లు ఆషాఢంలో ఇలా పూజలు చేయండి...ఊహించని పుణ్యం మూటకట్టుకోండి

ఆషాఢాన్ని శూన్యమాసంగా కాకుండా దేవతలను ఆరాధిస్తూ కొన్ని రకాలైన దానాలు చేయడం వలన ఆపారమైన పుణ్యం లభిస్తుంది. పితృదేవతలు సంతోషిస్తారు.

Balachander
Published on: 2 July 2026 8:25 AM IST
Ashada Masam: పెద్దలు చెప్పినట్లు ఆషాఢంలో ఇలా పూజలు చేయండి...ఊహించని పుణ్యం మూటకట్టుకోండి
X

Ashada Masam: ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది శుభకార్యాలు లేని శూన్య మాసం అని. కానీ, ఆధ్యాత్మికంగా ఈ మాసానికి ఒక ప్రత్యేకమైన శక్తి, విశిష్టత ఉన్నాయి. లౌకిక కార్యాలకు దూరంగా ఉన్నా, దైవిక చింతనకు అత్యంత అనుకూలమైన కాలం ఈ ఆషాఢం. ఈ మాసంలో చేసే చిన్న పూజ లేదా దానం అయినా సరే, ఊహించని రీతిలో పుణ్యఫలాన్ని ఇస్తుందని మన పెద్దలు, పండితులు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ఏ విధమైన దానాలు విశేష ఫలితాలను ఇస్తాయో తెలుసుకుందాం.

రాహుకాల దీపారాధన....గ్రహదోషాల నివారణకు అద్భుత మార్గం

ఈ మాసంలో దుర్గాదేవి, కాళికాదేవి, మహిషాసురమర్ధిని, కాళభైరవుడి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు, మానసిక ప్రశాంతత కోరుకునేవారు కొన్ని నియమాలు పాటించాలి. ఆషాఢంలో మంగళ లేదా శుక్రవారాల్లో దీపాలు వెలిగించాలి. రాహుకాలం సమయంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయల బద్దలతో దీపాలు వెలిగించాలి. దీని వలన కుటుంబంలో ఎలాంటి కలహాలు ఉన్నా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేయడం వలన సకల శుభాలు చేకూరుతాయి.

గ్రామదేవతల ఆరాధన ...గ్రామానికి, ఇంటికి రక్ష

ఆషాఢంలో పల్లెల్లో గ్రామదేవతల పండుగలు ఘనంగా జరుగుతాయి. అమ్మవారికి పసుపు కలిపిన నీటితో అభిషేకం చేసి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించాలి. చేదు నిమ్మకాయ దండను సమర్పించి చలవ చేసే పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీనివలన వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి బయటపడతారు.

ఆషాఢ దానాలు... దారిద్య్ర బాధల నుంచి విముక్తి

ఈ మాసంలో చేసే దానాలకు 10 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడువస్తువులను దానం చేయడం విశిష్టమైనది. ఇందులో మొదటిది గొడుగు. ఎండ, వానల నుంచి రక్షణ కల్పించే గొడుగును దానం చేయడం వలన పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు, పాదరక్షలు దానం చేయడం వలన నడకలో వచ్చే కష్టాల నుంచి తొలగిస్తాయి. ఇక విష్ణు స్వరూపంగా భావించే ఉసిరికాయలను దానం చేయడం వలన అకాల మృత్యుభయాలు తొలగిపోతాయి. ఒకవేళ ఇవన్నీ దానం చేసే స్తోమత లేకపోతే, కనీసం గుప్పెడు ఉప్పునైనా దానం చేయాలి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి, ఇది మీ ఇంట్లోని దారిద్య్రాన్ని దూరం చేస్తుంది. అంతేకాదు, భక్తి శ్రద్ధలతో పాటు ఈ మాసంలో గుప్త నవరాత్రుల వేళ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రు బాధలు నశిస్తాయి. కాబట్టి, ఈ ఆషాఢాన్ని కేవలం శూన్య మాసంగా భావించకుండా, దైవచింతనతో గడిపి అపారమైన పుణ్యఫలాన్ని మీ సొంతం చేసుకోండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story