Ashada Varahi Navaratri: ఆషాఢం వారాహి నవరాత్రుల్లో ఇలా చేయండి...మీరు ఏమనుకున్నా నెరవేరుతుంది

ఆషాఢ వారాహి నవరాత్రుల్లో పాటించాల్సిన ముఖ్య నియమాలు, చేయకూడని తప్పులు, వారాహి దేవి ఆరాధన విశిష్టత, ఉపవాసం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 24 Jun 2026 8:33 AM IST
Ashada Varahi Navaratri: ఆషాఢం వారాహి నవరాత్రుల్లో ఇలా చేయండి...మీరు ఏమనుకున్నా నెరవేరుతుంది
X

Ashada Varahi Navaratri: హైందవ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. రుతు మార్పుల సమయంలో వచ్చే ఈ పవిత్ర ఆషాఢ మాసంలో, మొదటి రోజు పాడ్యమి నుండి తొమ్మిదో రోజు నవమి వరకు జరుపుకునే ‘వారాహి నవరాత్రులు’ అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఆదిశక్తి రూపమైన వారాహి అమ్మవారు అగ్ని స్వరూపిణి. వరాహ ముఖంతో, ఇంద్రగోప వర్ణపు నీలమేఘ ఛాయతో దర్శనమిచ్చే ఈ తల్లిని లలితా పరాభట్టారిక దేవి సైన్యాధిపతిగా కొలుస్తారు. ఈ 9 రోజులు ఎవరైతే భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఉపాసిస్తారో, వారి కష్టాలన్నీ తీరిపోయి ఆర్థిక వృద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. అయితే ఈ పూజల్లో కొన్ని కఠినమైన నియమాలు పాటించడం తప్పనిసరి. మరి ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందామా.

నవరాత్రుల్లో చేయకూడని తప్పులు

వారాహి దేవి ఉగ్ర, ప్రసన్న రూపిణి. అందువల్ల ఈ నవరాత్రుల కాలంలో పూజా విధానంలో ఎలాంటి అపచారాలు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా నవరాత్రుల్లో ఏడు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అమ్మవారిని ఆరాధించేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. పూజా మందిరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అపవిత్రమైన లేదా ఉతకని దుస్తులతో అమ్మవారిని తాకరాదు. ఈ తొమ్మిది రోజులు ఇళ్లలో మాంసాహారం వండటం కానీ, మద్యం సేవించడం కానీ ముమ్మాటికీ చేయకూడదు. పూజ సమయంలో గట్టిగా కేకలు వేయడం, పెద్ద పెట్టున పాటలు పాడటం చేయరాదు. అమ్మవారి మంత్రాలను మనసులోనే నిశ్శబ్దంగా లేదా ఉచ్చారణ దోషాలు లేకుండా ప్రశాంతంగా పఠించాలి. నేటి కాలంలో చాలామంది పూజా విధులను ఫోన్లలో రికార్డ్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం చేస్తుంటారు. వారాహి పూజకు ఏకాగ్రత ముఖ్యం, కాబట్టి ఫోన్లకు దూరంగా ఉండాలి. రహస్య మంత్రాలను అనర్హులకు బహిరంగంగా చెప్పకూడదు.

వారాహి దేవి స్వరూపం ... సాధన

వారాహి దేవిని లలితా దేవి సర్వసైన్య అధ్యక్షురాలిగా అభివర్ణిస్తారు. అష్టమాతృకలలో ఒకరైన ఈ తల్లి భక్తుల శత్రు పీడలను, ఆర్థిక ఇబ్బందులను క్షణాల్లో తొలగిస్తుంది. ఈ ఆషాఢ వారాహి నవరాత్రుల్లో లౌకికమైన ఆడంబరాల కంటే అంతర్గత శుద్ధి చాలా ముఖ్యం. భక్తితో పాటు క్రమశిక్షణను జోడించి, నియమాలను ఉల్లంఘించకుండా ఆ తల్లిని స్మరిస్తే, సామాన్య మానవుల ఇళ్లలో కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. అమ్మవారిని ఎవరు ఎంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి అపజయం అంటూ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story