Ashta Siddhis: మన పూర్వీకులు చెప్పిన అష్టసిద్దుల రహస్యం..ఒక్కటి సాధించినా జీవితమే మారిపోతుంది

అష్టసిద్ధులు అంటే ఏమిటి? అణిమ, మహిమ, గరిమ, లఘిమ సహా ఎనిమిది దివ్యశక్తుల ప్రత్యేకతలు, హనుమంతుడితో వాటికున్న సంబంధం, యోగసాధనలో వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 30 Oct 2026 11:13 AM IST
Ashta Siddhis: మన పూర్వీకులు చెప్పిన అష్టసిద్దుల రహస్యం..ఒక్కటి సాధించినా జీవితమే మారిపోతుంది
X

Ashta Siddhis: మనిషి తనలోని శక్తిని పూర్తిస్థాయిలో గుర్తించగలిగితే సాధించలేనిది ఏదీ లేదని భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతోంది. సాధారణంగా మనకు కనిపించేది శరీర బలం, తెలివితేటలు మాత్రమే. కానీ మన పురాణాలు, యోగశాస్త్రాలు మనిషిలో అంతర్లీనంగా ఉండే మరెన్నో శక్తుల గురించి వివరించాయి. వాటిలో అత్యంత విశేషమైనవి అష్టసిద్ధులు. వేల సంవత్సరాలుగా ఋషులు, యోగులు ప్రస్తావించిన ఈ ఎనిమిది సిద్ధులకు హనుమంతుడి జీవితంలో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇంతకీ అష్టసిద్ధులు అంటే ఏమిటి? ఒక్కో సిద్ధి ద్వారా ఎలాంటి శక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి?

అష్టసిద్ధులు.. ఎనిమిది అసాధారణ శక్తులు

సిద్ధి అంటే నిరంతర సాధన ద్వారా పొందే విశేషమైన సామర్థ్యం. యోగశాస్త్ర సంప్రదాయంలో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనే ఎనిమిది సిద్ధులను అష్టసిద్ధులుగా పేర్కొన్నారు. వీటిలో ఒక్కో సిద్ధికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంది. ఇందులో మొదటి అణిమ. శరీరాన్ని అతి సూక్ష్మమైన రూపంలోకి మార్చుకోగల శక్తిని అణిమ అంటారు. హనుమంతుడు సీతమ్మ జాడ కోసం లంకలోకి వెళ్లినప్పుడు తన రూపాన్ని చిన్నదిగా మార్చుకున్న ఘట్టం ఈ సిద్ధికి ఉదాహరణగా చెబుతారు. రెండోది మహిమ. శరీరాన్ని అపారంగా విస్తరించి భారీ రూపాన్ని ధరించగల సామర్థ్యమే మహిమ. హనుమంతుడు సముద్రాన్ని దాటే సమయంలో తన శరీరాన్ని విస్తరించుకున్న వృత్తాంతం దీనిని గుర్తుచేస్తుంది.

ఇక మూడోది గరిమ. శరీరాన్ని అత్యంత భారంగా మార్చుకునే శక్తిని గరిమ అంటారు. ఎంతటి బలవంతుడైనా కదిలించలేనంత బరువుగా మారగలగడం దీని ప్రత్యేకతగా వర్ణించబడింది. నాలుగోది లఘిమ. శరీరాన్ని తేలికగా మార్చుకుని గాలిలో ప్రయాణించగల సామర్థ్యమే లఘిమ. గరిమకు పూర్తి విరుద్ధమైన శక్తి ఇది. ఇక ఐదోది ప్రాప్తి. కోరుకున్న వస్తువును లేదా లక్ష్యాన్ని చేరుకోగల అసాధారణ సామర్థ్యాన్ని ప్రాప్తి అంటారు. దూరంలో ఉన్న వాటిని సైతం పొందగల శక్తిగా దీనిని పురాణాలు వివరిస్తాయి. ఇకపోతే ఆరోది ప్రాకామ్యం. మనసులో సంకల్పించిన విషయాన్ని సాధించగల సామర్థ్యమే ప్రాకామ్యం. ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడం, కోరుకున్న అనుభవాలను పొందడం వంటి లక్షణాలను దీనితో అనుసంధానిస్తారు. ఏడోది ఈశత్వం. ప్రకృతిలోని శక్తులపై ఆధిపత్యం కలిగి ఉండటాన్ని ఈశత్వంగా పేర్కొంటారు. సృష్టి సంబంధమైన శక్తులను ప్రభావితం చేయగల స్థాయిగా దీనిని అభివర్ణిస్తారు. ఇకపోతే తొమ్మదిదోది వశిత్వం. మనస్సు, ఇంద్రియాలు, కోరికలతో పాటు ఇతర శక్తులను నియంత్రించగల సామర్థ్యమే వశిత్వం. ఆత్మనిగ్రహానికి, సంపూర్ణ నియంత్రణకు ఇది ప్రతీకగా భావిస్తారు.

హనుమంతుడికి అష్టసిద్ధులు ఎలా లభించాయి?

ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అష్టసిద్ధులకు సంబంధించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని పురాణ గాథల్లో విశ్వకర్మ, సూర్యభగవానుడు, హనుమంతుడి ప్రస్తావనతో ఈ శక్తుల పరంపరను వివరిస్తారు. హనుమంతుడు సూర్యభగవానుడి వద్ద విద్యాభ్యాసం చేసిన విషయం రామాయణ సంప్రదాయంలో ప్రసిద్ధి చెందింది. ఆయన అపారమైన బలం, వివేకం, కార్యసాధన శక్తి భక్తులకు స్ఫూర్తినిస్తాయి.

అష్టాంగ యోగంతో సంబంధం ఏమిటి?

పతంజలి యోగశాస్త్రం ప్రకారం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది దశలు అష్టాంగ యోగంలో భాగాలు. నిరంతర సాధన ద్వారా మనస్సును నియంత్రించడం, ఏకాగ్రతను పెంపొందించుకోవడం, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం దీని ప్రధాన ఉద్దేశం. కొన్ని యోగ సంప్రదాయాలు కుండలినీ శక్తి జాగరణను కూడా ప్రత్యేకంగా వివరిస్తాయి. ఈ సాధనలను అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శకత్వంలోనే చేపట్టాలని సంప్రదాయం సూచిస్తుంది.

అష్టసిద్ధుల గురించి తెలుసుకోవడం అంటే కేవలం అద్భుత శక్తుల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు. మనిషి తన మనస్సుపై ఎంతటి నియంత్రణ సాధించగలడో అర్థం చేసుకోవడం కూడా. శక్తిని పొందడం కంటే దానిని ధర్మమార్గంలో వినియోగించడం గొప్పదని భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం బోధిస్తోంది. అందుకే హనుమంతుడి అష్టసిద్ధుల ప్రస్తావన నేటికీ భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.