Solar Eclipse: ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం..భారత్‌లో కనిపిస్తుందా?

ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత్‌లో కనిపించని ఈ గ్రహణానికి సూతకం, పరిహారాలు పాటించాలా? తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Aug 2026 5:30 AM IST
Solar Eclipse
X

Solar Eclipse

ఆగస్టు 12న ఆషాఢ అమావాస్య సందర్భంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో ఎక్కడా కనిపించదు. యూరప్, ఆసియా ఉత్తర ప్రాంతాలు, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్, అట్లాంటిక్ ప్రాంతాల్లో గ్రహణం కనిపించనుంది. స్పెయిన్, ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్‌లో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్యగా కూడా పిలుస్తారు. డెన్మార్క్, పోలాండ్, నార్వే, స్వీడన్, కెనడా, గ్రీన్‌లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ గ్రహణం కనిపిస్తుంది. జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, ఇంగ్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, అల్జీరియా తదితర దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.

భారత్‌లో గ్రహణం కనిపించదు

ఈ సూర్యగ్రహణం భారత్‌లో ఎక్కడా కనిపించకపోవడంతో సాధారణంగా గ్రహణానికి సంబంధించిన ఆచారాలు, సూతకం పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. దేవాలయాలు మూసివేయడం, ఆహార నియమాలు పాటించడం, ప్రత్యేక శాంతులు చేయడం వంటి సంప్రదాయాలను భారత్‌లో తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

అయితే గ్రహణం కనిపించే ప్రాంతాల్లో నివసించే హిందూ సంప్రదాయాలను పాటించే వారు తమ ఆచారాల ప్రకారం సూతకం, ఇతర నియమాలను పాటించవచ్చని చెబుతున్నారు.

ఏ రాశుల వారికి ఎలా ఉంటుందంటే?

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ గ్రహణం కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడనుంది. కర్కాటక, సింహ, మేష, ధనుస్సు రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. వృషభ, కుంభ, తుల, కన్య రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు. మిథున, వృశ్చిక, మీన, మకర రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండొచ్చని చెబుతున్నారు.

గ్రహణ సమయంలో పూజలు, దానాలు

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో నవగ్రహ స్తోత్రాలు, ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, మహా మృత్యుంజయ మంత్రాలను జపించవచ్చు. పితృదేవతలకు తర్పణం, పేదలకు వస్త్రదానం, అన్నదానం, గోవులకు గోగ్రాసం వంటి సేవా కార్యక్రమాలు చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు.

అయితే గ్రహణ ప్రభావాలు, పరిహారాలు వ్యక్తిగత జాతకం, గ్రహ గోచారం, దశా భుక్తులు వంటి అంశాల ఆధారంగా మారుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇవి మతపరమైన, జ్యోతిష్య విశ్వాసాలకు సంబంధించిన సూచనలు మాత్రమే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story