August 2026 Festival List : ఆగస్టు ఆధ్యాత్మిక క్యాలెండర్.. ఒక్క నెలలో ఇన్ని పండుగలా.!
August 2026 Festival List : ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న శ్రావణ మాసంలో రాబోతున్న ఆగస్టు నెల భక్తులకు, పండుగల ప్రేమికులకు ఒక పెద్ద పండగే పండగ..
August 2026 Hindu Festivals
August 2026 Festival List : ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న శ్రావణ మాసంలో రాబోతున్న ఆగస్టు నెల భక్తులకు, పండుగల ప్రేమికులకు ఒక పెద్ద పండగే పండగ అని చెప్పాలి. రోజూ ఏదో ఒక ప్రత్యేకత, వ్రతం, పూజ లేదా వేడుకలతో ఈ నెల ఎంతో ఉత్సాహంగా సాగనుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం ఆచరించే ఏకాదశి వ్రతాలు, శివపార్వతుల అనుగ్రహాన్ని ఇచ్చే తీజ్ పండుగలు, తోబుట్టువుల అనుబంధాన్ని చాటే రాఖీ పౌర్ణమి, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే వరలక్ష్మీ వ్రతం.. ఇలా ఎన్నో వేడుకలు ఈ ఒక్క నెలలోనే కొలువుదీరాయి. వీటితో పాటు ఇదే నెలలో రెండు ప్రధాన గ్రహణాలు కూడా సంభవిస్తుండటంతో ఆధ్యాత్మికంగా ఈ నెల ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆగస్టు నాటి విశేషాలు, పండుగల సమగ్ర వివరాలు మీకోసం.
ఆగస్టు ప్రారంభంలో ఏకాదశి , సూర్య గ్రహణం
నెల ప్రారంభంలోనే ఆగస్టు 9న శ్రావణ మాసపు కృష్ణ పక్షంలో 'కామికా ఏకాదశి' వస్తోంది. విష్ణుమూర్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించే వారికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని స్మరిస్తే గతంలో చేసిన పాపాలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. ఆ వెంటనే ఆగస్టు 12న శ్రావణ అమావాస్య నాడు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. మన సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయంలో ఇంట్లో వంటలు చేయడం గానీ, ఆహారం తీసుకోవడం గానీ చేయరు. దేవాలయాల తలుపులు కూడా మూసివేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని, పవిత్ర స్నానాలు ఆచరించి దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.
హరియాళి తీజ్, నాగపంచమి , పుత్రదా ఏకాదశి
ఆగస్టు 15న నార్త్ ఇండియాతో పాటు పలు ప్రాంతాల్లో మహిళలు ఎంతో కోలాహలంగా జరుపుకునే 'హరియాళి తీజ్' పండుగ ఉంది. శివపార్వతుల దివ్య కల్యాణాన్ని పురస్కరించుకుని ముత్తైదువులు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం, పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త లభించాలని కోరుకుంటూ ఈ రోజున ఉపవాసాలు ఉంటారు. ఆ తర్వాత ఆగస్టు 17న పవిత్రమైన 'నాగపంచమి'తో పాటు 'సింహ సంక్రాంతి' రానుంది. నాగదేవతలను శాంతింపజేసేందుకు భక్తులు పుట్టల్లో పాలు పోసి, పసుపు కుంకుమలతో పూజలు చేసి ఆశీస్సులు పొందుతారు. ఇక ఆగస్టు 23న సంతాన ప్రాప్తి కోసం, పిల్లల క్షేమం కోసం దంపతులు ఆచరించే 'శ్రావణ పుత్రదా ఏకాదశి' రానుంది.
కేరళ ఓణం వేడుకలు.. పౌర్ణమి ఘనత
ఆగస్టు 26న కేరళీయుల అతిపెద్ద సంప్రదాయ పంటల పండుగ 'ఓణం' రానుంది. రాక్షస రాజైన మహాబలి చక్రవర్తి తమ ప్రజలను చూడటానికి వస్తారనే నమ్మకంతో ఇళ్ల ముందు రంగురంగుల పూల రంగవల్లులు వేసి, నోరూరించే ఓణసద్య విందులు, ఉత్సాహభరితమైన పడవల పోటీలతో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇక ఆగస్టు 28వ తేదీ ఈ నెలలోనే అత్యంత పవిత్రమైన రోజుగా నిలవనుంది. శ్రావణ పౌర్ణమి నాడే శ్రీమహాలక్ష్మి దేవి దివ్య అనుగ్రహం కోసం మహిళలు ఎంతో భక్తితో ఆచరించే 'వరలక్ష్మీ వ్రతం' వచ్చింది. అదే రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుకుంటూ ప్రేమానురాగాలతో రాఖీలు కట్టే 'రక్షాబంధన్' వేడుక కూడా ఉంది. వీటితో పాటు గాయత్రీ జయంతి కూడా ఇదే రోజు రావడం విశేషం.
పాక్షిక చంద్ర గ్రహణం , కజారీ తీజ్
ఆగస్టు 28న పౌర్ణమి పండుగల కోలాహలం ఒకవైపు ఉంటే, అదే రోజు రాత్రి పాక్షిక చంద్ర గ్రహణం కూడా సంభవించనుంది. ఈ గ్రహణ సమయంలో జపాలు, మంత్ర పఠనం, ధ్యానం చేయడం వల్ల ఎంతో ఆధ్యాత్మిక శక్తి లభిస్తుందని నమ్ముతారు. గ్రహణం పూర్తయ్యాక పవిత్ర స్నానాలు చేసి దీపారాధనలు చేస్తారు. చివరగా ఆగస్టు 31న భద్రపద మాసపు కృష్ణ పక్షంలో వచ్చే 'కజారీ తీజ్' వేడుకలతో ఈ ఆగస్టు నెల పండుగల శ్రేణి ఎంతో మధురంగా ముగుస్తుంది. ఈ విధంగా పూజలు, ఉపవాసాలు, పండుగల వేడుకలు , గ్రహణ నియమాల కలయికతో ఆగస్టు నెల భక్తులందరికీ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.




