Jyeshta Masam 2026 Muhurtham Dates: అధిక, నిజ జ్యేష్టమాసంలో శుభ సమయాలు...ముహూర్తాలు ఇవే

అధిక, నిజ జ్యేష్టమాసంలో శుభకార్యాలు, వివాహాలు, వ్యాపార, గృహ ప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఏమిటో తెలుసుకుందాం.

Balachander
Published on: 29 May 2026 2:26 PM IST
Jyeshta Masam 2026 Muhurtham Dates: అధిక, నిజ జ్యేష్టమాసంలో శుభ సమయాలు...ముహూర్తాలు ఇవే
X

Jyeshta Masam 2026 Muhurtham Dates: ప్రతి మూడేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఈ ఏడాది అధికమాసం ఉండటంతో జూన్‌ నెలలో అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టమాసాలు కలిసి ఉంటాయి. అధికమాసంలో దైవకార్యాలు, వ్రతాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. కానీ, శకున ముహూర్తాలు, వివాహాది శుభకార్యాలు ఈ అధికమాసంలో నిషిద్ధం. అధికజ్యేష్టమాసం తరువాత అంటే జూన్‌ 16 నుంచి ప్రారంభమయ్యే నిజ జ్యేష్టమాసం శుభకార్యాల నిర్వహణకు ఎంతో అనుకూలంగా ఉంటుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన, శుభకరమైన ముహూర్తాలు ఉన్నాయి.

నిజ జ్యేష్ట మాసంలో వివాహ మహోత్సవ ముహూర్తాలు

ఈ మాసంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే నక్షత్ర, తిథి బలాలు సంపూర్ణంగా కుదిరాయి. మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు నిశ్చయమై ముహూర్తాల కోసం ఎదురుచూస్తుంటే, పంచాంగం ప్రకారం మూడు రోజులు వివాహాలకు అనుకూలంగా ఉన్నాయి. జూన్‌ 21 ఆదివారం ఉదయం 9.31 గంటల నుంచి 11.21 వరకు, జూన్‌ 22వ తేది సోమవారం ఉదయం 10.31 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5.24 గంటల వరకు, జూన్‌ 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1.59 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5.25 గంటల వరకు శుభకరమైన ముహూర్తాలు ఉన్నాయి.

గృహప్రవేశం... నూతన వ్యాపార ప్రారంభాలకు మంచి రోజులు

సొంతింటి కల నెరవేర్చుకుని గృహప్రవేశం చేయాలన్నా లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం, దుకాణం ప్రారంభించాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఈ రెండు రోజులు శుభకరమైనవి. జూన్‌ 17వ తేదీ బుధవారం నూతన గృహ ప్రవేశాలకు, వ్యాపార ఒప్పందాలకు అనుకూలం. అదేవిధంగా జూన్‌ 25 గురువారం రోజున నూతన శంకుస్థాపనలు, స్థిరాస్తి కొనుగోళ్లకు అనుకూలమైన రోజుగా చెబుతారు.

జ్యేష్ట మాసంలో ముఖ్యమైన వ్రతాలు... పండుగలు

ఈ మాసంలో దైవచింతనతో గడపడానికి, గ్రహదోషాల నివారణకు ఉపవాసాలు ఉండటానికి కొన్ని ముఖ్యమైన తిథులు ఉన్నాయి. ఈ రోజుల్లో చేసే పూజలు మనశ్శాంతిని చేకూరుస్తాయి. జూన్‌ 8 సోమవారం కృష్ణాష్టమి. ఈరోజున శ్రీకృష్ణుని ఆరాధన, సత్సంగాలకు అనుకూలమైన రోజు. అదేవిధంగా జూన్‌ 13 శనివారం శనిప్రుదోషం. ఈరోజున శివాలయంలో ప్రదోషకాల పూజలు చేయడం వలన శనిదోషాలు తొలగిపోతాయి. ఇక జూన్‌ 15వ తేదీ సోమవారం అమావాస్య పితృదేవతల తర్పణాలకు, దానాలకు అనుకూలమైన రోజు. అదేవిధంగా జూన్‌ 20 శనివారం షష్టి వ్రతం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. జూన్‌ 27 శనివారం రోజున శని ప్రదోషం. మహాశివుడిని అరాధించేందుకు అత్యంత అనుకూలమైన రోజు. ఇక జూన్‌ 29 సోమవారం జ్యేష్ట పౌర్ణమి. ఈరోజున లక్ష్మీనారాయణ వ్రతాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story