Badrinath: బద్రీనాథ్‌ అఖండదీపం రహస్యం.. నెయ్యిపూతే వర్షానికి సాక్ష్యం

Badrinath: హిమాలయాల మంచు శిఖరాల మధ్య, అలకనంద నది ఒడ్డున కొలువై ఉన్న బద్రీనాథ్ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది సాక్షాత్తూ భూవైకుంఠం.

Balachander
Published on: 22 April 2026 8:29 AM IST
Badrinath
X

Badrinath: బద్రీనాథ్‌ అఖండదీపం రహస్యం.. నెయ్యిపూతే వర్షానికి సాక్ష్యం

Badrinath: హిమాలయాల మంచు శిఖరాల మధ్య, అలకనంద నది ఒడ్డున కొలువై ఉన్న బద్రీనాథ్ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది సాక్షాత్తూ భూవైకుంఠం. ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు తెరుచుకునే ఈ పుణ్యధామం వెనుక మానవ మేధస్సుకు అందని ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఆరు నెలల పాటు మూసి ఉన్న గర్భాలయంలో అఖండ దీపం ఆరిపోకుండా వెలగడం, విగ్రహానికి పూసిన నెయ్యి భవిష్యత్తును సూచించడం భక్తులను అబ్బురపరిచే అంశాలు. అబ్బురపరిచే ఈ రహస్యాలను తెలుసుకుందాం రండీ.

మూడు తాళాల రహస్యం

సాధారణంగా ఆలయం తలుపులు తెరిచేందుకు ఒకతాళం ఉంటుంది. కానీ, బద్రీనాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకోవాలంటే ఒకటికి మించి తాళాలు ఉండాలి. ఇక్కడ ఆలయం తలుపులు తెరవడమే ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఆలయం తలుపులు తెరవాలి అంటే మూడు తాళాలు ఉండాలి. ఈ మూడు తాళపు చెవులు ముగ్గురు వేర్వేరు వ్యక్తుల వద్ద ఉంటాయి. ఆలయం తలుపులు తెరుచుకునే సమయానికి ముగ్గురు వ్యక్తులు ఆలయం వద్ద ఉండాలి.

అలా ఉన్నప్పుడే ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. విచిత్రమేమంటే ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆలస్యంగా రాకపోవడం లేదా రాలేకపోవడం చేయలేదు. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఖచ్చితంగా సమయానికి చేరుకుంటారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న కట్టుదిట్టమైన సంప్రదాయం.

అఖండ దీపం - ఆరు నెలల నిరంతర జ్యోతి

హిమాలయ సానువుల్లో ఉన్న బద్రీనాథుడు భక్తులకు ఆరు నెలల సమయం మాత్రమే దర్శనం ఇస్తాడు. మిగిలిన ఆరు నెలలు మంచుకారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. దీపావళి సమయంలో ఆలయం ద్వారాలు మూతపడతాయి. అయితే, ఆలయం మూసివేసే సమయంలో ఆలయం లోపల వెండి ప్రమిదలో నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా వెలిగించిన తరువాత ఆలయం తలుపులు మూసివేస్తారు.

ఆరు నెలల వరకు ఏ వ్యక్తి కూడా ఆలయం లోపలికి ప్రవేశించలేడు. గాలి కూడా లోపలికి చొరబడదు. తిరిగి అక్షయ తృతీయ రోజున తలుపులు తెరుస్తారు. విచిత్రమేమంటే ఇలా తలుపులు తెరిచిన తరువాత కూడా ఆ అఖండదీపం వెలుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు వెలిగించిన అఖండదీపం ఆరిన సందర్బాలు లేవు. భక్తుల మాటల ప్రకారం, నారద మహర్షి రాత్రి సమయంలో ఆరు నెలల పాటు స్వామివారికి పూజలు చేస్తారని, ఆయనే అఖండదీపానికి రక్షణగా ఉంటారని చెబుతారు.

విగ్రహంపై నెయ్యి పూత: దేశ భవిష్యత్తుకు సంకేతం

ఆలయ రహస్యాల్లో మరో ముఖ్యమైన అంశం నెయ్యిపూత. ఆలయం మూసివేసే ముందు శ్రీమహావిష్ణువు సాలగ్రామ విగ్రహానికి నెయ్యిని పూతగా పూస్తారు. ఆరు నెలల తరువాత ఆ నెయ్యి స్థితిని బట్టి దేశ స్థితిగతులను అంచనా వేస్తారు. స్వామివారి విగ్రహానికి నెయ్యి అలానే దట్టంగా ఉంటే దేశం సుభిక్షంగా, పాడి పంటలతో తులతూగుతుందని అర్ధం. ఒకవేళ నెయ్యి పూత తగ్గిపోయినా, పొడిగా మారినా... ఆ ఏడాది భారీ వర్షాలు, వరదలు వస్తాయని, కరువు కాటకాలతో పాటు ఉగ్రముప్పు కూడా ఉంటుందని అర్ధం.

నర-నారాయణ తపఃఫలం

నర, నారాయణ అనే రెండు పర్వతాల మధ్య వెలసిన ఈ క్షేత్రంలో స్వామి ధ్యాన ముద్రలో ఉంటారు. 108 దివ్య దేశాలలో ఒకటైన బద్రీనాథ్‌ను దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ యాత్ర కష్టమైనా, భక్తులకు లభించే మానసిక ప్రశాంతత వెలకట్టలేనిది.

శాస్త్రం, నమ్మకం రెండూ కలిసిన ఈ దివ్య క్షేత్రం ఆధ్యాత్మికతకు నిలువుటద్దం. అయితే, అందరూ ఈ యాత్రను చేయలేరు. అలా యాత్రకు వెళ్లలేని వారు ఈ క్షేత్ర విశేషాలను చదువుకున్నా, విన్నా ఆ యాత్రా ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి యాత్ర చేయగలిగే శక్తి ఉన్నవారు తప్పనిసరిగా చార్‌ధామ్‌ యాత్రను చేయండి. చేయలేని వారు యాత్ర గురించిన విశేషాలను తెలుసుకోండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story