Banana Offering Ritual: స్వామి సన్నిధిలో అరటిగెల కడితే...ఎలాంటి కోరికైనా రెండే రోజుల్లో తీరుతుంది

చెట్లతాండ్ర గ్రామంలోని స్వామివారికి అరటిగెలలు ముడుపుగా కడితే రెండే రోజుల్లో కోరిక తీరుతుంది.

Balachander
Published on: 22 May 2026 8:29 AM IST
Banana Offering Ritual: స్వామి సన్నిధిలో అరటిగెల కడితే...ఎలాంటి కోరికైనా రెండే రోజుల్లో తీరుతుంది
X

Banana Offering Ritual: లోకంలో కోరికలు లేని మనిషంటూ ఎవరూ ఉండరు. గుడికి వెళ్లే భక్తులలో దాదాపు 99 శాతం మంది తమ మనసులోని ఏదో ఒక కోరికతోనే స్వామివారిని దర్శించుకుంటారు. కొందరు ఉద్యోగం కోసం, మరికొందరు వివాహం కోసం, ఇంకొందరు పిల్లల చదువుల కోసం దేవుడికి ముడుపులు కడుతుంటారు. సాధారణంగా పసుపు గుడ్డలో కొబ్బరికాయ, బియ్యం లేదా పసుపు కొమ్ములు పెట్టి ముడుపు కట్టడం మనం చూస్తుంటాం. కానీ, ఒక ప్రముఖ క్షేత్రంలో మాత్రం భక్తులు అరటిగెలను ముడుపుగా కడతారు. అలా కడితే ఎలాంటి కోరికైనా కేవలం రెండే రోజుల్లోనే తీరుతుందని భక్తుల బలమైన నమ్మకం.

80 ఏళ్ల నాటి అరుదైన సాంప్రదాయం

ఈ వింత ఆచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలంలో గల 'చెట్లతాండ్ర' గ్రామంలో వెలిసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉంది. ఇక్కడ స్వామివారికి ముడుపుగా అరటిగెలను సమర్పించడం ప్రత్యేకత. గత 80 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు ఈ విశిష్ట సాంప్రదాయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తున్నారు. భక్తులు తమ కోరిక మనసులో అనుకుని, ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన రావిచెట్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిళ్లకు అరటిగెలను కడతారు. కొందరు కోరిక కోరుకునే ముందు కడితే, మరికొందరు కోరిక తీరిన తర్వాత కృతజ్ఞతగా సమర్పిస్తారు.

ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి పర్వదినం రోజున భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారు. ఆ ఒక్కరోజే సుమారు 10వలేకు పైగా అరటిగెలలను మొక్కుల రూపంలో స్వామివారికి సమర్పిస్తారు. భీష్మ ఏకాదశిని స్థానికంగా అరటిగెలల పండుగ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. ఇలా తరలివచ్చిన భక్తులు తమ కోరికలను మనసులో తలచుకొని అరటిగెలలను స్వామివారికి తరలివస్తారు. వేలసంఖ్యలో ముడుపులుగా అరటిగెలలు కడతారు.

ఆ తర్వాత ఆ అరటిపండ్లు ఏమవుతాయి?

ఇక్కడి ఆచారం ప్రకారం, ముడుపుగా కట్టిన అరటిగెలలను రెండుమూడు రోజుల తర్వాత భక్తులు తమ ఇంటికి తీసుకువెళతారు. ఆ పండ్లను కుటుంబ సభ్యులందరూ స్వామివారి ప్రసాదంగా స్వీకరిస్తారు. అయితే, దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులు మాత్రం ఆ గెలలను ఆలయంలోనే వదిలివేస్తారు. వాటిని ఆలయ నిర్వాహకులు ఇతర భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. మన దేశంలో ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ, ఇలా అరటిగెలను ముడుపుగా కట్టే సంప్రదాయం కేవలం చెట్లతాండ్ర గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మాత్రమే కనిపిస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఇక్కడి స్వామిని దర్శించుకుని ఒక్క అరటిగెల ముడుపు కడితే చాలు.. ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. మీరెప్పుడైనా శ్రీకాకుళం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారా..?

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story