BAPS Monks: బీఏపీఎస్ సాధువుల కఠిన నియమాలు... మహిళలకు ఎందుకు దూరంగా ఉంటారో తెలుసా?
బీఏపీఎస్ సాధువులు మహిళలకు ఎందుకు దూరంగా ఉంటారు? సంపూర్ణ బ్రహ్మచర్యం, నిర్లోభ, నిస్నేహ, నిర్మాణ్, నిస్వాద్ అనే 5 కఠిన నియమాల గురించి తెలుసుకుందాం.
BAPS Monks: పారిస్‌లోని ఐకానిక్ ప్యారిస్ ఈఫిల్ టవర్ సిబ్బంది సమ్మెకు దిగడంతో ఇటీవల ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బి.ఎ.పి.ఎస్ స్వామినారాయణ సంస్థకు చెందిన 100 మందితో కూడిన ప్రతినిధి బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించిన సందర్భంలో, మహిళా ఉద్యోగులను కొంతసేపు పక్కన పెట్టారని వచ్చిన ఆరోపణలే ఈ వివాదానికి కారణం. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమవ్వడంతో బి.ఎ.పి.ఎస్ సాధువులు పాటించే కఠినమైన నియమాలు, వారి జీవన విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బి.ఎ.పి.ఎస్ సాధువుల సన్యాస నియమావళి, దాని వెనుక ఉన్న 5 ప్రధాన సూత్రాల గురించి తెలుసుకుందాం.
సంపూర్ణ బ్రహ్మచర్యం
పారిస్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన ప్రధాన నియమం 'నిష్కామ'. సాధువులు అష్టాంగ బ్రహ్మచర్యాన్ని జీవితాంతం పాటిస్తారు. సాధువులు మహిళలను నేరుగా చూడటం, మాట్లాడటం, స్పర్శించడం లేదా వారితో ఒంటరిగా మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం. అంతేకాదు, మహిళా భక్తులకు ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉంటే, వారు తమ ప్రశ్నలను రాతపూర్వకంగా మాత్రమే సాధువులకు పంపాల్సి ఉంటుంది. ఇది మహిళలను తక్కువ చేసి చూడటం కాదని, కేవలం సాధువుల వ్యక్తిగత ఆధ్యాత్మిక నియమనిష్టల్లో భాగమని సంస్థ స్పష్టం చేస్తోంది.
నిర్లోభ (ఆశారాహిత్యం)
సాధువులు ఎలాంటి భౌతిక సంపద లేదా ఆస్తులపై వ్యామోహం కలిగి ఉండరు. ధన సంపాదనకు, విలాసాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. బీఏపీఎస్‌లో చేరిన ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు.
నిస్నేహ (బంధాల త్యాగం)
దీక్ష స్వీకరించిన క్షణం నుంచే సాధువులు తమ సొంత కుటుంబ సభ్యులు, బంధువులతో ఉన్న అన్ని రకాల సంబంధాలను పూర్తిగా తెంచుకుంటారు. సాధారణంగా సన్యాస దీక్షను తీసుకునే సమయంలో ఇలాంటి బంధాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
నిర్మాణ్ (అహంకార రాహిత్యం)
తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోరుకోకుండా, తీవ్రమైన వినయం, నిరహంకారంతో సేవ చేయడమే ఈ నియమం యొక్క అంతరార్థం. ఈ కారణంగానే బీఎపీఎస్ సాధువులు ప్రత్యేక గురింపు పొందారు.
నిస్వాద్ (రుచులకు దూరం)
జిహ్వ చాపల్యానికి దూరంగా ఉండటం ఇందులో భాగం. ఆహారం విషయంలో కఠినమైన నియమాలను పాటిస్తూ, కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తారు. భగవాన్ స్వామినారాయణ బోధించిన 'శిక్షాపత్రి' ఆధారంగా ఈ నియమాలు రూపొందించబడ్డాయి. అయితే, ఈఫిల్ టవర్ సిబ్బంది వ్యక్తం చేసిన ఆందోళనలను సీరియస్‌గా పరిగణించిన బి.ఎ.పి.ఎస్ సంస్థ, తమ సాధువుల ఆధ్యాత్మిక నియమాల వల్ల ఏర్పడిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కూడా చెప్పడం గమనార్హం.




