Best Days to Buy New Vehicle: కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారా... ఈ రోజుల్లో కొంటే తిరుగుండదు

నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజుల్లోనే కొనుగోలు చేయడం వలన ఎన్నో లాభాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Balachander
Published on: 11 Jun 2026 9:44 AM IST
Best Days to Buy New Vehicle: కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నారా... ఈ రోజుల్లో కొంటే తిరుగుండదు
X

Best Days to Buy New Vehicle: సనాతన ధర్మంలో ప్రతి శుభకార్యానికి ముహూర్తం ఎంత ముఖ్యమో, నిత్య జీవితంలో మనం వాడే వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తిథి, వార, నక్షత్రాలు మరియు లగ్న బలాలను చూసుకొని వాహనాన్ని కొనుగోలు చేస్తే.. అది మనకు ఐశ్వర్యాన్ని, రక్షణను ఇస్తుంది. అలా కాకుండా గ్రహస్థితి అనుకూలంగా లేని శూన్య సమయాల్లో కొంటే, ఆ వాహనం తరచూ రిపేర్లకు రావడం లేదా ప్రమాదాలకు గురికావడం వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా కొత్త వాహనం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

వాహన కొనుగోలుకు అమృత ఘడియలు

శాస్త్రం ప్రకారం అన్ని రోజులూ వాహనాలు కొనడానికి పనికిరావు. లక్ష్మీ కటాక్షం కోసం నిర్దేశించిన కొన్ని రోజులు ఉంటాయి. సోమవారం రోజున వాహనం కొనుగోలు చేయడం వలన చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. ప్రయాణంలో సౌఖ్యం, మనశ్శాంతి లభిస్తుంది. ఇక బుధవారం బుద్ధికారకుడికి ప్రత్యేకమైన రోజు. బుధవారం రోజున వాహనాలు కొనుగోలు చేస్తే వ్యాపారాభివృద్ధికి దోహదపడుతుంది. ఇక గురుబలం అధికంగా లభించే గురువారం రోజున వాహనాలు కొనుగోలు చేయడం అత్యుత్తమం. శుక్రవారం శుక్రుడికి సంబంధించిన రోజు. ఈరోజుల్లో వాహనాలు కొనుగోలు చేయడం వలన ధన, కనక, వాహన యోగాలు తిరుగు ఉండదని పండితులు చెబుతున్నారు. అయితే, మంగళ, శనివారాల్లో నూతన వాహనాలు కొనుగోలు చేయడంగాని, ఇంటికి తీసుకురావడంగాని చేయకూడదు.

శుభ నక్షత్రాలు ... తిథుల లెక్కలు

మీరు వాహనం కొనుగోలు చేసిన తరువాత ఇంటికి తీసుకురావడానికి 9 నక్షత్రాలు శుభప్రదమైనవిగా చెబుతారు. రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ, శ్రవణ, ఉత్తరాషాడ, రేవతి నక్షత్రాలు శుభప్రదమైనవి. అలాగే తిథుల విషయానికి వస్తే... ద్వితీయ, తృతీయ, పంచమి, షష్టి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు చాలా మంచివి. కానీ అమావాస్య, అష్టమి, చతుర్దశి తిథులలో పొరపాటున కూడా వాహనాలు కొనరాదు.

లగ్నం ... చంద్రబలం ప్రాధాన్యత

రోజు మొత్తంలో అన్ని గంటలూ ఒకేలా ఉండవు. ఒకవేళ రోజు బాగున్నా సమయం కుదరకపోతే, మధ్యాహ్నం వేళ వచ్చే 'అభిజిత్ ముహూర్తం' లో వాహనం తీసుకోవచ్చు. లగ్నాల విషయానికి వస్తే.. మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర లగ్నాలు వాహన యోగానికి అత్యంత అనుకూలమైనవి. అయితే, జాతక చక్రంలో చంద్రుడు 4, 7, 8, 12 వ స్థానాలలో సంచరించే రోజుల్లో మాత్రం కొనుగోళ్లు పూర్తిగా నిలిపివేయాలి. శాస్త్ర నియమాలు పాటించి కొనే వాహనం, మీ జీవిత గమనాన్ని మార్చడమే కాకుండా మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను, అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story