Deepa Aradhana: దీపారాధన ఈ సమయంలోనే చేయాలి... పండితులు చెబుతున్న రహస్యం ఇదే
ప్రతిరోజూ ఇంట్లో దీపాన్ని వెలిగించినా... ఆ దీపం వెలిగించడానికి ఓ సమయం ఉంటుంది. ఆ సమయంలోపే దీపారాధన చేయాలి. ఇలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
Deepa Aradhana: దీపం జ్యోతి పరబ్రహ్మం... దీపేన సాధ్యతే సర్వం అనే శ్లోకం చదువుతూ దీపారాధన చేయాలి. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. దీపాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుని స్వరూపంగా భావిస్తారు. దీపం ఇంట్లో వెలిగించేటప్పుడు చాలా మంది సమయం, ఒత్తుల విషయంలోనూ పొరపాట్లు చేస్తుంటారు. శాస్త్రాల ప్రకారం గృహస్తులు సూర్యోదయం కంటే ముందే అంటే బ్రాహ్మి ముహూర్తంలో లేదా ఉదయం 6 గంటలలోపు దీపారాధన చేయాలి. ఈ సమయంలో దీపారాధన చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. భగవంతుడు ఆ ఇంటికి కాచి రక్షిస్తాడు. ఒకవేళ ఉదయం ఆరులోపు దీపారాధన చేయడం కుదరకుంటే కనీసం ఉదయం 7 గంటలలోపు పూర్తిచేయాలని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఇక సాయంత్రం వేళ ప్రదోష సమయంలో దీపం వెలిగించాలి. నిత్యం ఇంట్లో దీపం వెలుగుతూ ఉండటం వలన నకారాత్మక శక్తుల నుంచి ఇల్లు రక్షించబడుతుంది. ఐశ్వర్యం సిద్దిస్తుంది.
దీపారాధన నియమాలు
దీపం వెలిగించే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అందులో ముఖ్యమైనవి నూనె, ఒత్తుల సంఖ్య. దీపారాధనకు ఆవునెయ్యి సర్వశ్రేష్ఠం. ఒకవేళ ఆవునెయ్యి దొరక్కపోతే నువ్వుల నూనె లేదా ఐదు రకాలైన నూనెలు కలిపిన పంచదీప తైలాన్ని ఉపయోగించాలి. సాధారణంగా ఇంట్లో చేసుకునే పూజకు రెండు ఒత్తులను కలిపి ఒకటిగా చేసి దీపారాధన చేయాలి. ఇది గృహస్థులకు మంచిది. విశేషపూజల్లో మూడు, ఐదు లేదా ఏడు ఒత్తులను ఉపయోగిస్తారు. ఏక ఒత్తి దీపం శ్రేష్టం కాదని పండితులు చెబుతున్నారు.
పాటించవలసిన జాగ్రత్తలు
మంగళ, శుక్రవారాలు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మంగళవారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే అరిష్టాలు, బాలగ్రహ దోషాలు, దృష్టిదోషాలు తొలగిపోతాయి. ఇక శుక్రవారం సాయంత్రం దీపం వెలిగిస్తే దారిద్య్రం తొలగిపోతుంది. సకారాత్మక శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అయితే, రాత్రి 9 గంటల తరువాత ఇంట్లో దీపాన్ని ఉద్దేశపూర్వకంగా కొండెక్కించడం అశుభం. తలకు నూనెను రాసుకున్న వెంటనే మైల ఉన్నప్పుడు, మద్యపానం అలవాటు ఉన్నవారు దీపాన్ని ముట్టుకోకూడదు. దీపారాధన చేసిన తరువాత కనీసం దేవుని గదిలో 30 నిమిషాలపు అఖండంగా వెలిగేలా చూసుకోవాలి. తద్వారా ఇల్లు నిత్యకళ్యాణంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. ఈ నియమాలను ఎవరైతే పాటిస్తూ దీపారాధన చేస్తారో వారికి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.




