Bhima Pride: అంతా తెలుసని గర్వపడితే...భీముడిలా ఓడిపోక తప్పదు
భీముడి అపార బలగర్వాన్ని శ్రీకృష్ణుడు ఎలా తొలగించాడు? మహాభారతంలోని ఈ ఆసక్తికరమైన ఘట్టం అహంకారం, వినయం, భగవంతుడిపై విశ్వాసం గురించి చాలా గొప్పగా చెబుతుంది.
Bhima Pride: మన జీవితంలో ఎంతటి విద్య, ధనం లేదా శక్తి ఉన్నప్పటికీ గర్వం తలకెక్కితే నాశనం తప్పదు. సనాతన ధర్మం, ఇతిహాసాలు మనకు నిరంతరం ఈ సత్యాన్నే బోధిస్తాయి. మహాభారతంలో పదివేల ఏనుగుల బలం కలిగిన భీమసేనుడు తన బలానికి తానే సాటి అని, తన ముందు ఎవరూ నిలబడలేరనే గర్వంతో ఉండేవాడు. కానీ, అటువంటి అపార బలాఢ్యుడికి కూడా ఒకానొక సమయంలో ఓటమి ఎదురైంది. తనలోని బలగర్వాన్ని అణచుకుని, పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి చరణాలను ఆశ్రయించాల్సి వచ్చింది. భీముడి జీవితంలో జరిగిన ఈ ఆసక్తికరమైన ఘట్టం ప్రతీ ఒక్కరికీ అహంకారాన్ని వీడాలని నేర్పించే గొప్ప ఆధ్యాత్మిక పాఠం.
గుండంలో మల్లయుద్ధం .. భీముడి భంగపాటు
ఒకరోజు భీముడు తన శరీరంలోని అపరిమితమైన శక్తిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో, పెద్ద పెద్ద రాళ్లతో మూసి ఉన్న ఒక లోతైన గుండాన్ని చూశాడు. తన పిడికిలి దెబ్బతో ఒక్క గుద్దు గుద్ది ఆ గుండం చుట్టూ ఉన్న రాళ్లన్నింటినీ తునాతునకలు చేస్తూ పక్కకు పడేశాడు. అయితే, ఆ గుండం లోపల 'మహిషుడు' అనే మల్లయోధుడు సుదీర్ఘ కాలంగా తీవ్రమైన ధ్యానంలో, ఏకాంతంలో ఉన్నాడు. భీముడు చేసిన ఉధృతమైన శబ్దానికి అతని ఏకాంతానికి భంగం వాటిల్లింది. తీవ్ర ఆగ్రహంతో బయటకు వచ్చిన మహిషుడు భీముడిని మల్లయుద్ధానికి ఆహ్వానించాడు. తన బలంపై ఉన్న అతివిశ్వాసంతో భీముడు యుద్ధానికి దిగాడు. కానీ, ఆశ్చర్యకరంగా ఆ మల్లయుద్ధంలో మహిషుడి విచిత్రమైన యుక్తుల ముందు భీముడు నిలబడలేక ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.
శ్రీకృష్ణుడి దివ్యోపదేశం ... గర్వభంగం
ఓడిపోయిన భీముడు ఏమి చేయాలో తోచక, తీవ్రమైన మానసిక వేదనతో శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్లాడు. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో భీముడికి ధైర్యం చెప్పి, మహిషుడిని ఎదుర్కొనే వ్యూహాన్ని, అతని బలహీనతను వివరించాడు. శ్రీకృష్ణుడు చెప్పిన దివ్యోపదేశాన్ని గ్రహించిన భీముడు, తిరిగి వెళ్లి మహిషుడిపై విజయం సాధించాడు. ఈ ఘటనతో భీముడికి జ్ఞానోదయం అయింది. కేవలం శారీరక బలం మాత్రమే ఉంటే సరిపోదని, భగవంతుని కృప, అహంకారం లేని మనస్సు ఉన్నప్పుడే పరిపూర్ణత లభిస్తుందని గ్రహించాడు. ఇకపై ఏనాడూ నేనే బలవంతుడిని అనే గర్వంతో ఉండనని వాసుదేవుడి పాదాల వద్ద ప్రమాణం చేశాడు.
సుమతీ శతకం చెప్పే అమూల్య సందేశం
ఈ ఘట్టం మనకు సుమతీ శతకంలోని ప్రసిద్ధ నీతి పద్యాన్ని గుర్తుచేస్తుంది. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా...బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! పాము ఎంత శక్తివంతమైనదైనా, వేలాది చీమలు ఒక్కటైతే దాన్ని అంతమొందించగలవు. అలాగే ఎంతటి స్థానంలో ఉన్నవారైనా నాకేంటి, నన్ను ఎవరు ఏం చేయగలరు? అనే గర్వంతో ఉంటే, ఆ గర్వమే వారిని దహించివేస్తుంది. భగవంతుడి ముందు అందరూ సమానులేనని గ్రహించి, వినయంతో జీవించడమే మానవ జన్మకు సార్థకత.




