Brahmapureeswarar Temple: బ్రహ్మ ఈశ్వరుడు కలిసున్న అరుదైన ఆలయం... దర్శించినవారి తలరాత మారడం ఖాయం
జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడేందుకు, రాతను మార్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బ్రహ్మపురీశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
Brahmapureeswarar Temple: మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, జాతక దోషాలకు ముగింపు పలికి, రాసిన తలరాతను సైతం మార్చగలిగే పరమ పవిత్ర క్షేత్రం తమిళనాడులోని "బ్రహ్మపురీశ్వరర్ ఆలయం". సాధారణంగా బ్రహ్మదేవుడికి ప్రత్యేక ఆలయాలు, పూజలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, తిరుచిరాపల్లి సమీపంలోని తిరుపత్తూరులో వెలసిన ఈ ప్రాచీన దివ్యధామంలో పరమశివుడితో పాటు బ్రహ్మదేవుడు కూడా పసుపు వర్ణంలో, ధ్యానముద్రలో కమలాసనుడై భక్తులకు అభయమిస్తున్నాడు.
బ్రహ్మ తపస్సు చేసిన క్షేత్రం
సృష్టికర్తననే గర్వంతో ఉన్న బ్రహ్మదేవుడి ఐదో తలను పరమశివుడు ఖండించి, ఆయన శక్తులన్నింటినీ హరిస్తాడు. తన శాపవిమోచనం కోసం బ్రహ్మదేవుడు భూలోకంలో సంచరిస్తూ, ఈ తిరుపత్తూరు క్షేత్రానికి చేరుకుని 12 శివలింగాలను ప్రతిష్టించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ నిష్టకు మెచ్చిన ఈశ్వరుడు ఆయనకు శాపవిమోచనం కలిగించడమే కాకుండా, తనతో సమానమైన స్థానాన్ని ప్రసాదించాడు. అంతేకాకుండా, ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకునే భక్తుల దురదృష్టాన్ని తొలగించి, వారి తలరాతలను తిరిగి రాసే శక్త్యనుగ్రహాలను బ్రహ్మకు శివుడు ఇక్కడే ప్రసాదించాడని స్థల పురాణం చెబుతోంది.
క్షేత్రం విశేషాలు
చోళ రాజు 'కోచెంగనన్' నిర్మించిన దాదాపు 1,000 సంవత్సరాల నాటి పురాతన ఆలయంగా చెబుతారు. ఇక ఆలయ ప్రాంగణంలో బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్టించిన 12 శివలింగాలు ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ యోగసూత్రాల పితామహుడైన పతంజలి మహర్షి జీవసమాధి పొందిన పవిత్ర స్థలంగా కూడా ఇది ప్రసిద్ది. ఆ మహర్షి జీవ సమాధిని ఇక్కడ భక్తులు దర్శించుకోవచ్చు. అంతేకాదు, ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో 3 రోజుల పాటు ఉదయ భానుడి సూర్యకిరణాలు నేరుగా స్వయంభూ శివలింగాన్ని తాకుతాయి. ఈ అద్భుతాన్ని కన్నులార వీక్షించేందుకు భక్తులు ఆ మూడు రోజులు ఆలయానికి పోటెత్తుతారు.
ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులు పసుపు రంగు దుస్తులు ధరించి బ్రహ్మదేవుడికి పసుపుతో ప్రత్యేక అభిషేకం చేయిస్తారు. తమ కోరికలు నెరవేరి, సమస్యలు తొలిగిపోయాక తిరిగి వచ్చి పసుపు వస్త్రాలను మొక్కుబడిగా సమర్పించడం ఇక్కడి ఆచారం. అమ్మవారు 'సంపత్ గౌరి' రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. జీవితంలో తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంటున్న వారు, జాతక దోషాలతో బాధపడుతున్న వారు ఒక్కసారైనా దర్శించాల్సిన మహిమాన్విత దివ్యక్షేత్రం బ్రహ్మపురీశ్వర్ దేవాలయం.




