Chandrakup Well Mystery: చావును ముందుగా తెలియజేసే బావి రహస్యం...నీడ కనిపించలేదా?

వారణాసిలోని చంద్రకూప్‌ బావిలో నీడ కనిపించకుంటే మరణం సంభవించినట్టే. మరణం గురించి ముందుగా అంచనావేసే ఈ బావి గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 26 May 2026 11:23 AM IST
Chandrakup Well Mystery: చావును ముందుగా తెలియజేసే బావి రహస్యం...నీడ కనిపించలేదా?
X

Chandrakup Well Mystery: మరణం ఎప్పుడు సంభవిస్తుందో ముందుగా తెలిస్తే... ఆ భయం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మనిషి దేని గురించైనా తెలుసుకోవాలని అనుకుంటాడేమోగాని చావు గురించి తెలుసుకోవాలని మాత్రం అస్సలు అనుకోడు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు ఎలా తెలుస్తుంది అంటే... దానికి సమాధానం వారణాసిలోని ఓ బావి చెబుతుంది. అత్యంత పురాతనమైన ఈ బావిలో ఎవరైనా సరే తొంగి చూస్తే... వారి నీడ కనిపించాలి. అలా కనిపించలేదంటే..రాబోయే ఆరు నెలల కాలంలో మరణిస్తారని అర్ధం. ఎందరో జీవితాల్లో ఇది నిజమైంది. ఇది ఎలా నిజమౌతుంది అంటే దానికి సమాధానం ఉండదు. ఇదంతా ఆ పరమేశ్వరుని లీలగా చెబుతారు.

కాశీలోని సిద్ధేశ్వరి దేవి ఆలయం...చంద్రకూప్ బావి

కాశీ విశ్వేశ్వరాలయానికి సమీపంలో అత్యంత పురాతనమైన ‘మాతా సిద్ధేశ్వరి దేవి’ ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ‘చంద్రకూప్’ అని పిలిచే ఒక ప్రత్యేకమైన బావి ఉంది. ‘చంద్ర’ అంటే చంద్రుడు, ‘కూప్’ అంటే బావి అని అర్థం. సాధారణంగా ఏ బావిలోనైనా మన ముఖం లేదా నీడ కనిపించాలంటే కాంతి కిరణాలు పరావర్తనం చెందాలి. కానీ, ఈ చంద్రకూప్ బావి ప్రత్యేకత వేరు. ఇక్కడ ఎండ ఉన్నా లేకపోయినా, పగలైనా, రాత్రైనా బావిలోకి తొంగిచూస్తే ప్రతి ఒక్కరి నీడ తప్పకుండా కనిపిస్తుంది. కాంతి కిరణాల పరావర్తనంతో సంబంధం లేకుండా నీడ కనిపించడం ఇక్కడి విశేషం.

ఆయుష్షును తెలిపే పరీక్ష

కాశీకి వచ్చే భక్తులు తమకు ఇంకా భూమిపై నూకలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ బావిలోకి తొంగిచూస్తారు. బావిలో నీరు అద్దంలా మారి వారి నీడను చూపిస్తే, ఆయుష్షు గట్టిగా ఉందని సంతోషిస్తారు. ఒకవేళ నీడ కనిపించకపోతే మాత్రం, రాబోయే 180 రోజుల్లో మృత్యువు సంభవిస్తుందని అర్థం. గతంలో ఒక మహిళకు ఇలాగే నీడ కనిపించకపోవడంతో నెలన్నర సమయంలోనే అనుకోకుండా హటాత్తుగా మరణించింది. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగినట్టుగా చెబుతారు.

పురాణాల కథనం – చంద్రుడి తపస్సు

స్కందపురాణంలోని కాశీఖండం ప్రకారం, ఈ బావిని స్వయంగా చంద్రుడే తన చేతులతో తవ్వినట్లు ఆధారాలు ఉన్నాయి. దక్ష ప్రజాపతి శాపం నుండి విముక్తి పొందడం కోసం చంద్రుడు దేశంలో పలుచోట్ల శివలింగాలను ప్రతిష్టించాడు. అందులో మొదటిది గుజరాత్‌లోని సోమనాథ్ జ్యోతిర్లింగం కాగా, రెండవది ఈ బావి సమీపంలో ప్రతిష్టించిన ‘చంద్రేశ్వర శివలింగం’. ఇక్కడ చంద్రుడు తపస్సుచేసి మహాశివుడి అనుగ్రహాన్ని పొందాడు. ఈ బావిలోని నీటిని తాకినా లేదా తాగినా అజ్ఞానం నశించి మనసు, శరీరం, ఆత్మ పవిత్రమౌతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే బావిలోకి చూస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

మోక్షం కోసం కాశీవాసం

హిందూ ధర్మంలో కాశీలో మరణిస్తే నేరుగా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే చరమదశకు చేరుకున్న వృద్ధులు, సాధువులు ఈ సిద్ధేశ్వరి దేవి ఆలయానికి వచ్చి బావిని దర్శించుకుంటారు. ఒకవేళ తమ నీడ కనిపించకపోతే, తమ మరణం ఆసన్నమైందని గ్రహించి, వారు ఇల్లు విడిచి కాశీలోనే ఉండిపోతారు. శివనామ స్మరణ చేస్తూ మోక్షాన్ని పొందేందుకు సిద్ధమవుతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, విశ్వాసానికి, ఆధ్యాత్మికతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది ఈ చంద్రకూప్ బావి. ఎవరైనా కాశీ వెళ్తే తప్పకుండా ఈ చంద్రకూప్‌ బావిని సందర్శించడం మర్చిపోకండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story