Chaturmasya Vratam: యోగనిద్ర అంటే ఏమిటి... మనిషిని మహనీయుడిగా మార్చే చాతుర్మాస్య వ్రతం
శయన ఏకాదశి అంటే జులై 25 నుంచి శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు. ఈ నాలుగు పాటు చాతుర్మాస్య వ్రతాన్ని దీక్షగా చేయాలని, కఠినమైన నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
Chaturmasya Vratam: మానవుని అంతర్గత చైతన్యాన్ని, ఆత్మనిగ్రహాన్ని పెంపొందించే అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియల్లో 'చాతుర్మాస్య వ్రతం' ప్రాథమికమైనది. ఆషాఢ శుద్ధ ఏకాదశి దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ శయన ఏకాదశి నుండి ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి వరకు దాదాపు 120 రోజుల పాటు సాగే ఈ దీక్షా కాలం, మనిషిని సాధారణ స్థాయి నుంచి మహనీయుడిగా తీర్చిదిద్దే ఒక సమగ్ర సాధనగా నిలుస్తుంది.
యోగనిద్ర అంటే ఏమిటి?
బాహ్య ప్రపంచాన్ని ఏలుతున్న శ్రీ మహావిష్ణువు, తన దృష్టిని అంతర్ముఖం చేసి విశ్వ సంక్షేమం కోసం జరిపే దివ్య ధ్యాన స్థితినే యోగనిద్ర అంటారు. ఇది మనం రోజూ పోయే సాధారణ నిద్ర కాదు. సృష్టి చక్రం నిరంతరం తిరుగుతుండగానే, తన అఖండ చైతన్యంతో జగత్తును కాపాడుతూ పరమాత్మ పొందే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి ఇది. శ్రీహరి యోగ నిద్రలో ఉన్న సమయంలో ప్రారంభమయ్యే ఈ చాతుర్మాస్యం... భగవంతుని ధ్యానంలో లీనమై తమను తాము సన్మార్గంలో మలచుకోవడానికి భక్తులకు లభించే ఓ గొప్ప అవకాశంగా భావిస్తారు. అయితే, ఈరోజుల్లో చాతుర్మాస్యం చేయాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఎక్కడ ఉన్నా నిరంతరం ఆ స్వామివారి నామాన్ని జపిస్తూ శుద్దిగా ఉండేందుకు ప్రయత్నించడం కూడా దీక్షే అవుతుంది.
చాతుర్మాస్య వ్రతం ...నాలుగు నెలల ఆధ్యాత్మిక సాధన
సాధారణంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మొదలై, కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 120 రోజుల పాటు ఈ వ్రతం సాగుతుంది. కొందరు దీనిని రెండు నెలల వ్యవధిలో 'అర్థచాతుర్మాస్యం'గా కూడా ఆచరిస్తారు. ఈ కాలంలో మునులు, యతులు ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉంటూ జపతపాలు చేస్తారు. స్త్రీలు, పురుషులు, వితంతువులు అనే తేడా లేకుండా సకల జనులు ఈ నియమాలను పాటించవచ్చు. అయితే, ఈ వ్రతం ఆచరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక్కపూటే భోజనం చేయాలి. తద్వారా ఆహారంపై నిగ్రహం పెరుగుతంది. అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఆత్మపరిశీలన చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి. నిరంతరం దైవాన్ని ప్రార్థిస్తూ, ఆయన నామాన్ని జపిస్తూ, దానధర్మాలు చేయడాలి. పురాణాలను పఠించాలి.
మానవ జీవితంలో వచ్చే మార్పులు
చాతుర్మాస్య వ్రతాచరణ కేవలం ఒక నియమం కాదు. మనిషిలోని అహంకారాన్ని నశింపజేసి శాంతిని నింపే దివ్యౌషధం కూడా. భౌతిక విషయాల వెంట పరిగెత్తే మనస్సును అదుపులోకి తెచ్చి, ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందిస్తుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో సాగే ఈ నిష్ఠాభరిత జీవితం సాధారణ మానవుడిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి మహనీయుడిగా తీర్చిదిద్దుతుంది. భగవంతుని యోగనిద్ర మనలోని ఆత్మజ్ఞానాన్ని మేల్కొలిపే సాధనంగా మారుతుంది. ఎవరికి వీలైనంత వరకు వారు ఈ చాతుర్మాస్య కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందడమే కాకుండా చేసిన పాపాలు కూడా చాలా వరకు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.




