Chaurasi Temple: యముడు ఇక్కడి నుంచే శిక్షలు విధిస్తారట... ఈ చిత్రగుప్త ఆలయమే సాక్ష్యం
ఎవరూ చూడటం లేదు అని చెప్పి తప్పులు చేసేవారికి శిక్షించేందుకు భూమిమీదనే ఓ ఆలయం ఉంది. అదీ హిమాచల్ ప్రదేశ్‌లోని చౌరాసి ఆలయం. ఈ ఆలయం గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Chaurasi Temple: మానవుడు భూమిపై తెలిసో తెలియకో నిత్యం ఎన్నో తప్పులు చేస్తుంటాడు. "నన్ను ఎవరూ చూడటం లేదు కదా" అనే ధీమాతో చేసే ప్రతి చిన్న తప్పునూ నిశితంగా గమనించే దివ్య శక్తి ఒకటుంది. ఆయనే యమధర్మరాజు ఆస్థానంలో పాపపుణ్యాల చిట్టాను రాసే చిత్రగుప్తుడు. సాధారణంగా మరణానంతరం ఆత్మలు యమలోకానికి వెళ్తాయని గరుడ పురాణం చెబుతుంది. కానీ, భూలోకంలోనే జీవుల పాపపుణ్యాలను లెక్కించే చిత్రగుప్తుడి గది, యమధర్మరాజు న్యాయపీఠం ఒకే చోట ఉన్నాయనే ఆధ్యాత్మిక రహస్యం చాలామందికి తెలియదు.
చౌరాసి ఆలయం ... పాపపుణ్యాల విచారణ కేంద్రం
హిమాచల్ ప్రదేశ్ లోని పవిత్రమైన భర్మార్ ప్రాంతంలో కొలువైన చౌరాసి ఆలయ ప్రాంగణం అత్యంత భయానకమైన, దైవికమైన విశ్వాసాలకు నిలయం. ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయంతో పాటు చిత్రగుప్తుడు, యమధర్మరాజులకు ప్రత్యేకమైన ఆస్థానాలు ఉన్నాయి. జీవుడు శరీరాన్ని వదిలిన తర్వాత ఆత్మ ప్రయాణం మొదట ఈ ఆలయంలోని చిత్రగుప్తుడి రహస్య గది నుంచే ప్రారంభమవుతుందని చెబుతారు. అక్కడ చిత్రగుప్తుడు ఆ మనిషి జీవించి ఉన్నప్పుడు చేసిన సత్కారాలు, చేసిన అన్యాయాల పట్టికను నిష్పాక్షికంగా విశ్లేషిస్తాడు.
నాలుగు దివ్య ద్వారాలు ... యమ ధర్మరాజు తీర్పు
చిత్రగుప్తుడి విచారణ పూర్తయిన వెంటనే ఆత్మ ఎదురుగా ఉన్న ధర్మరాజు ఆస్థానానికి చేరుకుంటుంది. ఈ ఆస్థానంలో నాలుగు విభిన్న లోహాలతో రూపుదిద్దుకున్న తలుపులు ఉంటాయి. ఒకటి స్వర్గద్వారం. అత్యుత్తమ పుణ్యకార్యాలు చేసిన ఆత్మల కోసం ఈ ద్వారం ఏర్పాటు చేసి ఉంటుంది. ఇక రెండోది రజతద్వారం. ఇక్కడ ధర్మబద్ధంగా జీవించిన సజ్జనుల కోసం ఏర్పాటు చేసి ఉంటుంది. ఇక మూడోది తామ్రద్వారం. సాధారణ జీవనం గడిపి మానవుల కోసం ఏర్పాటు చేసి ఉంటుంది. ఇక చివరిగా నాలుగో ద్వారం లోహద్వారం. ఇది ఘోరమైన పాపాలు, అధర్మానికి పాల్పడిన పాపాత్ముల కోసం ఏర్పాటు చేయబడి ఉంటుంది.
ఆత్మ చేసిన పాపభారాన్ని బట్టి యమధర్మరాజు ఆత్మ ఏ ద్వారం గుండా వెళ్లాలో, స్వర్గ సుఖాలు పొందాలో లేదా నరకయాతన అనుభవించాలో ఇక్కడే ఆఖరి తీర్పునిస్తారు. అందుకే ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టడానికి కూడా భక్తులు తీవ్ర భయకంపితులవుతారు. తప్పు చేస్తే శిక్ష తప్పదనే భయం ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది.
నరక భయాన్ని పోగొట్టే యమద్వితీయ
ఈ క్షేత్రంలో నిత్యం భయానక వాతావరణం కనిపించినప్పటికీ, అన్నాచెల్లెళ్ల పండుగ దీనినే భగినీ హస్త భోజనం లేదా యమద్వితీయ అని కూడా పిలుస్తారు. ఆరోజున మాత్రం వేలాదిగా భక్తులు తరలివస్తారు. పూర్వం పాపులకు శిక్షలు వేయడంలో నిరంతరం అలసిపోయిన యమధర్మరాజు, తన సోదరి యమునాదేవి పిలుపుమేరకు ఆమె ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించాడు. ఆనందపడిన యముడు "ఈ రోజున ఏ సోదరుడైనా తన సోదరి చేతి వంట తిని, ఆశీస్సులు పొందుతాడో అతనికి నరక బాధలు ఉండవు" అని వరమిచ్చాడు. అందుకే ఆ పవిత్ర దినాన ఈ ఆలయాన్ని దర్శిస్తే యమపాశాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల దృఢమైన నమ్మకం.




