Chola King Love Temple: ప్రేయసి కోసం ఆ రాజు ఏకంగా ఆలయాన్నే కట్టించాడు...ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

తమిళనాడులోని తిరువారూర్‌ ఆలయం ప్రేమకు చిహ్నంగా చోళరాజు తన ప్రేయసి పరవై నంగె అనే నర్తకి కోసం కట్టించాడు.

Balachander
Published on: 20 May 2026 8:42 AM IST
Chola King Love Temple: ప్రేయసి కోసం ఆ రాజు ఏకంగా ఆలయాన్నే కట్టించాడు...ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?
X

Chola King Love Temple: ప్రేమకు చిహ్నం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఆగ్రాలోని తాజ్‌మహల్. షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృత్యర్థం నిర్మించిన ఈ కట్టడం ఒక సమాధి. కానీ, దీనికంటే దాదాపు 600 సంవత్సరాల ముందే, దక్షిణ భారతదేశంలో ఒక మహారాజు తన ప్రేయసి కోసం ఏకంగా ఒక పవిత్ర దేవాలయాన్నే నిర్మించారనే అద్భుతమైన నిజం ఎంతమందికి తెలుసు? అది కేవలం కట్టడం కాదు... నేటికీ పూజలందుకుంటున్న భక్తి, ప్రేమల సమ్మేళనం. ఆ ఆలయమే తమిళనాడులోని తిరువారూర్ త్యాగరాజస్వామి ఆలయ పరిధిలోని పరవైయార్ కోయిల్. ఈరోజు ఈ కోయిల్‌ గురించి తెలుసుకుందాం.

చోళ సామ్రాజ్యం.. చిగురించిన ప్రణయం

దక్షిణాపథాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన చోళ రాజులలో మొదటి రాజేంద్ర చోళుడు (క్రీ.శ. 1012 – 1044) అత్యంత పరాక్రమవంతుడు. గంగైకొండ చోళపురాన్ని నిర్మించిన ఈ చక్రవర్తి, తిరువారూర్‌కు చెందిన ‘పరవై నంగె’ అనే శివభక్తురాలైన నర్తకి ప్రేమలో పడ్డారు. వారి పవిత్ర అనురాగానికి ప్రతీకగా, ఆమె కోరిక మేరకు తిరువారూర్‌లో వెలిసిన ఇటుకల ఆలయాన్ని అద్భుతమైన రాతి దేవాలయంగా పునర్నిర్మించారు.

రెండేళ్ల శ్రమ.. టన్నుల కొద్దీ బంగారం!

ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ. 1028లో ప్రారంభమై, కేవలం రెండేళ్ల వ్యవధిలో అంటే క్రీ.శ. 1030 నాటికి పూర్తయింది. ఈ ఆలయ వైభవాన్ని చాటిచెప్పే చారిత్రక ఆధారాలు నేటికీ తిరువారూర్ శాసనాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఆలయం కోసం ఆ కాలంలో వాడిన సంపద వివరాలు తెలిస్తే నిజంగా నోరెళ్లబెడతారు. అంతరాలయం నుంచి వెలుపల ఉన్న కలశం వరకు బంగారు పూత పూయించారు. దీనికోసం సుమారు 111 కిలోల బంగారాన్ని వినియోగించారు. అంతేకాదు, గర్భగుడి తలుపులు, స్తంభాల కోసం 42వేల తులాల రాగిని వినియోగించారు. దీంతో పాటు నిత్య ధూప దీప నైవేద్యాల కోసం 28 దీపపు కుందులు, 36 వజ్రాలు, ముత్యాలు పొదిగిన స్వర్ణాభరణాలు, అత్యంత అమూల్యమైన కెంపులు, పచ్చలు, వెండి పాత్రలను సమర్పించినట్టుగా ఆలయ శాసనాలను బట్టి తెలుస్తోంది.

వెలుగుతున్న అఖండ దీపం

ఈ ఆలయ మహా సంప్రోక్షణ సమయంలో రాజేంద్ర చోళుడు, పరవై నంగె ఇద్దరూ కలిసి స్వామివారిని దర్శించుకుని ఒక నెయ్యి దీపాన్ని వెలిగించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆనాటి నుండి నేటి వరకు, అంటే దాదాపు 1000 సంవత్సరాలుగా ఆ అఖండ దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉందని అని చరిత్రకారులు, అక్కడి పూజారులు చెబుతారు.

మాతృమూర్తిగా గౌరవించిన రాజకుమారులు

రాజేంద్ర చోళుడి అనంతరం ఆయన కుమారులు కూడా ఈ ఆలయాన్ని ఎంతో భక్తితో చూసుకున్నారు. పరవై నంగెను కేవలం రాజు ప్రేయసిగా కాకుండా, తమ మాతృమూర్తిగా భావించి గౌరవించారు. అందుకనే, ఆ ఆలయ ప్రాంగణంలో రాజేంద్ర చోళుడు, పరవై నంగె దంపతుల విగ్రహాలను ప్రతిష్టించారు. సమాధి రూపంలో ఉండే ప్రేమ చిహ్నాల కంటే, భగవంతుని కొలువులో భక్తితో ముడిపడిన ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేమాలయాలు భారతీయ సంస్కృతికి మకుటాయమానాలు. తిరువారూర్ వెళ్లే భక్తులు ఈ చారిత్రక ఆలయాన్ని, ఆ అఖండ దీపాన్ని దర్శించుకుని పునీతులవుతుంటారు. భగవంతుడిని మనం ఓ చిన్న పుష్పం లేదా పండును భక్తితో సమర్పించి ఆపదల నుంచి గట్టెక్కించమంటాం. అలాంటిది ఆ భగవంతుడి కోసం అంత సంపద వెచ్చింది అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన చోళరాజును మెచ్చుకోకుండా ఉండిపోతే ఎలా. ఇప్పుడు చోళరాజ్యం లేకున్నా...వారు కట్టించిన ఆలయాలు, వారు చేసిన సేవను ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story