Chowdeshwari Devi: సాక్ష్యం చెప్పేందుకు కాశీ నుంచి కదలివచ్చిన చౌడేశ్వరీదేవి... బనగానపల్లెలో శిలగా మారిన అద్భుతగాథ

బ్రాహ్మణులకు అండగా, రాజు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేందుకు సాక్ష్యంగా కాశీ నుంచి తరలివచ్చిన చౌడేశ్వరీ దేవి బనగానపల్లె నందవరంలో శిలగా మారింది.

Balachander
Published on: 25 May 2026 8:44 AM IST
Chowdeshwari Devi:  సాక్ష్యం చెప్పేందుకు కాశీ నుంచి కదలివచ్చిన చౌడేశ్వరీదేవి... బనగానపల్లెలో శిలగా మారిన అద్భుతగాథ
X

Chowdeshwari Devi: భగవంతుడి ఉనికిని చాటిచెప్పే ఎన్నో దేవాలయాలు మనదేశంలో ఉన్నాయి. భగవంతుడు మనమధ్యన ఏదో రూపంలో ఉన్నాడని చెప్పడానికి ఆయా క్షేత్రాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి బనగానపల్లెలోని చౌడేశ్వరీదేవి ఆలయం. ఈ అమ్మవారు కాశీక్షేత్రం నుంచి వచ్చారని, సాక్ష్యం చెప్పేందుకు స్వయంగా తరలివచ్చి ఈ గ్రామంలో శిలగా మారిపోయారని చెబుతారు. తాళ్లపాక అన్నమాచార్యుల వంటి భక్తశిఖామణుల పూర్వీకులైన నందవరీక బ్రాహ్మణుల తపోశక్తికి, అమ్మవారి కరుణకు సజీవ సాక్ష్యం నేటి కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని నందవరం క్షేత్రం. రాజు ఇచ్చిన మాట, 500 మంది కాశీ బ్రాహ్మణుల ఆత్మగౌరవం, జగన్మాత విధించిన షరతు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

దత్తాత్రేయుడి పాదుకలు .... రాజు రహస్యం

పూర్వం నందవరం రాజ్యాన్ని నందభూపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన దత్తాత్రేయుడికి భక్తుడు. నిత్యం దత్తాత్రేయుడిని ఆరాధిస్తుండేవాడు. ఆయన భక్తికి మెచ్చిన దత్తాత్రేయ స్వామి, కాశీ గంగానదిలో ప్రతిరోజూ స్నానం చేసేందుకు వీలుగా రెండు దివ్య పాదుకలను ప్రసాదిస్తాడు. అయితే, ఈ విషయాన్ని పరమ రహస్యంగా ఉంచాలనేది దైవిక నియమం. రాజు ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో కాశీకి వెళ్లి వస్తుండేవారు. కానీ ఈ రహస్యం ఎన్నాళ్లో దాగదు. భార్య పట్టుబట్టడంతో ఆ రాజు దివ్య పాదుకల రహస్యాన్ని వెల్లడిస్తాడు. అలా భార్యభర్తులు ఇద్దరూ కలిసి పాదుకల సహాయంతో రోజు కాశీ వెళ్లి స్నానం చేసి వస్తుండేవారు. కానీ, ఒకరోజు కాశీలో ఉండగా... రాణికి ప్రకృతి నియమమైన నెలసరి రావడం వల్ల ఆ పాదుకల దివ్యశక్తి క్షీణించింది. స్వదేశానికి ఎలా వెళ్లాలో తెలియక రాజు తల్లడిల్లాడు.

500 మంది బ్రాహ్మణుల తపోశక్తి ...రాజు ఇచ్చిన మాట

ఆ సమయంలో కాశీ ఘాట్‌లో సంధ్యావందనం చేసుకుంటున్న 500 మంది నందవరీక బ్రాహ్మణులను రాజు ఆశ్రయించాడు. వారు తమ తపోబలంతో రాజు దంపతులను క్షణకాలంలో నందవరం చేర్చారు. ఆ ఉపకారానికి ప్రతిఫలంగా, భవిష్యత్తులో వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని రాజు మాట ఇస్తాడు. కొన్నేళ్ల తర్వాత కాశీలో ఘోరమైన కరువు వచ్చింది. ఆ 500 మంది బ్రాహ్మణులు సాయం కోసం నందవరం వచ్చారు. కానీ, అధికార గర్వంతో ఉన్న రాజు..."మీరు నాకు సాయం చేసినప్పుడు సాక్ష్యం ఎవరున్నారు?" అని ప్రశ్నించాడు. బ్రాహ్మణులు నిశ్చేష్టులయ్యారు. కాశీలో ఆనాడు తమ సంభాషణకు సాక్ష్యం కేవలం కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ఉన్న చౌడేశ్వరీ దేవి మాత్రమేనని వారు చెప్పారు. "అయితే ఆ అమ్మవారినే సాక్ష్యంగా తీసుకురండి" అని రాజు కోరతాడు.

అమ్మవారి షరతు ... శిలగా మారిన వృత్తాంతం

భక్తుల రక్షణ కోసం బ్రాహ్మణులు మళ్లీ కాశీకి వెళ్లి అమ్మవారిని ప్రార్థించారు. కరుణామయి అయిన చౌడేశ్వరీ దేవి సాక్ష్యం చెప్పేందుకు అంగీకరించింది. అయితే ఒక కఠినమైన షరతు విధించింది. ముందు మీరు నడుస్తుండాలి. మీ వెనుక నేను వస్తాను. నేను వస్తున్నాను అని చెప్పేందుకు సంకేతంగా కాలి గజ్జెల చప్పుడు మీకు వినిపిస్తుంది అని చెబుతుంది. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు, అలా చూస్తే నేను అక్కడే శిలగా మారిపోతాను అని చెబుతుంది. బ్రాహ్మణులు అంగీకరించడంతో కాశీనుంచి ప్రయాణం మొదలౌతుంది. నందవరం వరకు ప్రయాణం సాఫీగా సాగుతుంది. సరిగ్గా నందవరం పొలిమేరలోకి రాగానే ఓ సొరంగమార్గం వద్ద గజ్జెల సవ్వడి వినిపించకపోవడంతో ఆ బ్రాహ్మణుల్లో ఒకరు కుతూహలంతో వెనక్కితిరిగి చూస్తాడు. అంతే ఆ జగన్మాత ఇచ్చిన మాటప్రకారం అక్కడే శిలగా మారిపోతుంది.

తన తప్పు తెలుసుకున్న రాజు అమ్మవారి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నాడు. బ్రాహ్మణుల తపోశక్తిని లోకానికి చాటడానికే తాను ఈ లీల చేసినట్లు అమ్మవారు పలికింది. నేటికీ బనగానపల్లె సమీపంలోని నందవరంలో సొరంగం లోపల అమ్మవారి ఉగ్రరూపం ఉంటే సొరంగంపైన అమ్మవారి శాంత స్వరూపం భక్తులకు దర్శనం ఇస్తుంది. ఆ తల్లిని దర్శిస్తే సమస్త భయాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల అచంచల విశ్వాసం. బనగానపల్లెకు వెళ్లినవారు నందవరం చౌడేశ్వరిదేవిని దర్శించుకోవడం మర్చిపోవద్దు. తాళ్లపాక అన్నమాచార్య వంశీయులు కాశీ నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ఈ చౌడేశ్వరీదేవినే కారణమని చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story