Color Changing Shiva Lingam: రంగులు మార్చుకునే శివలింగం...రోజులో ఐదుసార్లు ఇలా దర్శనం
నల్లూరులో కొలువైన కళ్యాణ సుందరేశ్వర స్వామివారి ఆలయంలోని శివలింగం రోజుకు ఐదుసార్లు రంగులు మారుతుంది.
Color Changing Shiva Lingam: ఈ సృష్టిలో భగవంతుడి లీలలు అనంతం. ఇలాంటి లీలల అద్భుతాలు సైన్స్‌కి కూడా అందకుండా ఉంటాయి. అలాంటి ఒక పరమాద్భుత క్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం నల్లూరులో కొలువై ఉన్న "కళ్యాణ సుందరేశ్వర స్వామి" ఆలయం. ఈ ఆలయంలోని ప్రధాన శివలింగం రోజుకు ఐదుసార్లు ఐదు వేర్వేరు రంగుల్లోకి మారడం ఇక్కడి ప్రాధాన్యత. కేవలం భక్తిభావంతోనే కాకుండా, కంటితో చూసి తరించాల్సిన ఈ మహిమాన్విత శివలింగ విశేషాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రంగులు మారుతున్న శివలింగం
ఈ ఆలయంలోని స్వయంభూ శివలింగం సూర్యుని గమనాన్ని బట్టి, రోజులోని వివిధ పూజా సమయాల్లో రంగులు మారుతూ భక్తులను అబ్బురపరుస్తుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉదయకాల పూజ సమయంలో శివలింగం నలుపు రంగులో దర్శనమిస్తుంది. ఈ సమయంలో స్వామిని భక్తులు 'వైద్యనాథుడిగా' కొలుస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు మధ్యాహ్న అభిషేక సమయానికి శివలింగం ఒక్కసారిగా పవిత్రమైన తెలుపు రంగులోకి మారిపోతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రదోష సమయంలో స్వామివారి రూపం కాంతులీనే ఎరుపు రంగులోకి మారుతుంది. ఇక రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రాత్రి పూజల సమయంలో ఈ శివలింగం ప్రశాంతతను పంచే లేత నీలం రంగును సంతరించుకుంటుంది. అర్థరాత్రి సమయంలో ఈ శివలింగం ఎంతో ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో మెరిసిపోతుంది.
సైన్స్‌కు అందని రహస్యం.. వెయ్యేళ్ల చరిత్ర
ఉత్తరాదిన కాశీ విశ్వనాథునికి ఎంతటి పవిత్రత ఉందో, దక్షిణాదిన ఈ కళ్యాణ సుందరేశ్వరునికి అంతటి ప్రాశస్త్యం ఉంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం, మొదటి చోళ రాజు ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు. చరిత్రలో ఎందరో దురాక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ పురాతన క్షేత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఇక్కడి అమ్మవారు ‘గిరి సుందరి’గా భక్తుల పూజలందుకుంటున్నారు.
శాస్త్రవేత్తలు సైతం ఈ శివలింగం రంగులు మారడం వెనుక ఉన్న భౌతిక, రసాయన కారణాలను కనుగొనడానికి ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఇది ఏ రకమైన శివలింగం అనే విషయాన్ని గానీ, రంగులు మారే రహస్యాన్ని గానీ ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు. అందుకే సామాన్య భక్తుల నుండి పండితుల వరకు అందరూ దీనిని ఆ పరమశివుని సాక్షాత్కార లీలగానే నమ్ముతారు. మనస్ఫూర్తిగా కాసిన్ని నీళ్లు పోసి నమస్కరిస్తే చాలు, కోరిన కోర్కెలు తీర్చే ఈ భోళాశంకరుని రంగుల రూపాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరాల్సిందే.




