Daily Lamp Lighting at Home: నిత్యం ఇంట్లో దీపం వెలుగుతుందా... మీకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు

దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్ధనః.. దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే.. అంటారు. భారతీయ సనాతన ధర్మంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

Balachander
Published on: 9 May 2026 9:44 AM IST
Daily Lamp Lighting at Home: నిత్యం ఇంట్లో దీపం వెలుగుతుందా... మీకన్నా అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు
X

Daily Lamp Lighting at Home: దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్ధనః.. దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే.. అంటారు. భారతీయ సనాతన ధర్మంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అసలు మన సంస్కృతిలో రోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఎవరి ఇంట్లో అయితే నిత్యం దీపం వెలుగుతుందో, అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని, ఆ ఇల్లు సకల శుభాలకు నిలయమని మన పెద్దలు చెబుతుంటారు. ప్రతిరోజూ రెండు పూటల లేదా అఖండ దీపారాధన చేస్తున్నవారి ఇల్లు సకల సౌభాగ్యాలకు నిలయంగా మారుతుంది. ఎందరో దీనిని నిరూపించారు.

చీకటిపై వెలుగు సాధించిన విజయం

దీపం వెలిగించడం అంటే కేవలం వత్తిని అంటించడం కాదు. అది మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం. ఆధ్యాత్మికంగా చూస్తే, దీప జ్వాల ఎప్పుడూ పైకే చూస్తుంది. ఇది మనిషి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలని, ఎప్పుడూ అభివృద్ధి పథంలో సాగాలని మనకు గుర్తుచేస్తుంది. నిత్యం దీపం వెలిగే ఇళ్ళలో ప్రతికూల శక్తులు దరిచేరవు. ఎలాంటి చిన్న పొరపాట్లు జరిగినా దీపారాధనతో అవన్నీ సమసిపోతాయి. దీపాన్ని ఆకర్షించే పురుగుల మాదిరిగా...మనుషులు కూడా భగవంతుడు వెలిగించే జ్ఞానజ్యోతికి ఆకర్షితులు కావాలి. దీనికి భక్తిమార్గం ఒక్కటే పరిష్కారం.

అగ్ని తత్వం - గ్రహ దోష నివారణ

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దీపంలో వెలిగే జ్వాల 'అగ్ని తత్వానికి' ప్రతీక. మన జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా, నిత్య దీపారాధన వల్ల అవి శాంతిస్తాయి. ముఖ్యంగా ఉదయాన్నే దీపం వెలిగించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు, సాయంత్రం వేళ నువ్వుల నూనెతో భగవంతుని ముందు దీపం వెలిగిస్తే శనిదోషాలు తొలగిపోతాయి. జీవితంలో క్రమశిక్షణ, స్థిరత్వం సిద్ధిస్తుంది. ఏ పని చేసినా కొండంత నమ్మకం ఏర్పడుతుంది.

దీపారాధనలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

దీపారాధన విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తరువాత మాత్రమే దీపం వెలిగించాలి. సూర్యోదయం తరువాత లేదా సూర్యుడు నెత్తిమీదకు వచ్చిన తరువాత దీపం వెలిగించడం మంచిది కాదు. అంతేకాదు, ఆవునెయ్యితో దీపం వెలిగిస్తే సాత్విక శక్తి లేదా అనుకూల శక్తుల ప్రవాహం జరుగుతుంది. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే గ్రహశాంతి లభిస్తుంది. దీపం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు దిశలు సంపద, జ్ఞానానికి ప్రతిరూపాలు.

సంకల్పమే ప్రాధాన్యం

దీపం వెలిగించేటప్పుడు మనసులో ఒక మంచి ఆలోచన ఉండాలి. "లోకా సమస్తా సుఖినోభవంతు" అని కానీ, లేదా మన కుటుంబ సౌఖ్యం గురించి కానీ ప్రార్థిస్తూ దీపం వెలిగిస్తే ఆ వెలుగు మన జీవితాల్లోకి ప్రసరిస్తుంది. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే నిత్యం దీపం వెలిగే ఇల్లు ఒక దేవాలయంతో సమానం. ఆ వెలుగు ఇచ్చే ప్రశాంతత ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే, ఇంట్లో దీపం వెలిగేలా చూసుకోండి.. ఆ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి! ఎన్ని అడ్డంకులు వచ్చినా దీపం వెలిగించడం మర్చిపోకండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story