Tilak Dharana Benefits: కష్టాలు, నష్టాలకు నుదుటిపై బొట్టుతోనే పరిష్కారం...ఏరోజు ఎలాంటి తిలకధారణ చేయాలంటే
జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ తిలకధారణ చేయాలి. అయితే, గ్రహాధిపతులను అనుసరించి మన నుదుటిపై బొట్టు ఉండాలని పండితులు చెబుతున్నారు.
Tilak Dharana Benefits: మనం రోజూ పెట్టుకునే నుదుటిపై పెట్టుకునే బొట్టు లేదా తిలకధారణ కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు. అనాదిగా వస్తున్న సంప్రదాయం, సంస్కృతిలో భాగం. అంతేకాదు, నుదుటిన బొట్టు పెట్టుకోవడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక, శాస్త్రీయ రహస్యాలు దాగున్నాయి. మన శరీరంలోని ఆలోచనా శక్తిని, ఏకాగ్రతను పెంచే ఆజ్ఞా చక్రం నుదుటిభాగంలోనే ఉంటుంది. నిత్యం ఎదుర్కొనే కష్టాలు, నష్టాల నుంచి ఉపశమనం పొంది గ్రహాల అనుకూలతను సాధించాలంటే ప్రతిరోజూ నుదుటిపై తప్పనిసరిగా తిలకధారణ చేయాలి. అయితే, రోజూ ఒకే రకమైన తిలకధారణతో ప్రయోజం ఉండదని పండితులు చెబుతున్నారు. రోజును బట్టి గ్రహాల అధిపతులను బట్టి తిలకధారణ ఉండాలి. వారంలో ఏడు రోజులు ఏడు రకాలైన తిలకధారణలు చేయాలి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వారాల వారీగా తిలకధారణ నియమాలు
ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేసిన రోజు. ఆదివారం రోజున ఎరుపురంగు కుంకుమను నుదుటన ధరించాలి. దీనివల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు, శారీరక బలం, ఆరోగ్యం మెరుగుపడతాయి. సోమవారం పరమశివునికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆరోజున విభూతిని లేదా పసుపును నుదుటిన ధరించాలి. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, ఆయుష్షును పెంచుతుంది. మంగళవారం హనుమంతుడు, సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన రోజు. అంటే కుజగ్రహానికి సంబంధించినది. ఈరోజున ఎర్రచందనాన్ని నుదుటిపై ధరించాలి. ఇలా చేయడం వలన నెగటీవ్ ఎనర్జీని దూరం చేసి చేపట్టిన పనుల్లో విజయం సాధించే శక్తిని ప్రసాదిస్తుంది. బుధవారం బుద్ధి కారకుడైన బుధగ్రహానికి సంబంధించిన రోజు. ఈరోజున ఆకుపచ్చని కుంకుమ లేదా చందనాన్ని ధరించాలి. దీని వలన వ్యాపారంలో లాభాలు, చదువులో ఏకాగ్రత లభిస్తాయి.
గురువారం బృహస్పతి లేదా గురువుకు అంకితం చేసిన రోజు. జ్ఞానాన్ని ప్రసాదించే ఈరోజున పసుపు లేదా కుంకుమ కలిపిన పసుపును నుదుటిపై ధరించాలి. దీని వలన ఇంట్లో శుభాలను తీసుకొస్తుంది. సంపదను పెంచుతుంది. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేశారు. ఐశ్వర్య ప్రదాత అయిన అమ్మవారి కోసం తెల్లని చందనం లేదా పసుపు కుంకుమను కలిపి ధరించాలి. దీని వలన లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఇక అత్యంత కీలకమైన శనివారం కర్మఫలదాత శనిభగవానుడికి అంకితం చేసిన రోజు. ఈరోజున శనిదేవుని అనుగ్రహం కోసం నీలం రంగు చందనాన్ని లేదా నల్లటి తిలకాన్ని ధరించాలి. ఇలా చేయడం వలన మానసిక పట్టుదల, సహనం పెరుగుతుంది.
తిలకం ధరించేటప్పుడు ఉంగరపు వేలిని ఉపయోగించడం వల్ల శాంతి లభిస్తుందని, బొట్టు పెట్టేటప్పుడు పైకి అనడం వల్ల సత్ఫలితాలు ఇస్తాయని పెద్దలు చెబుతారు. కాలానుగుణంగా వచ్చే కష్టాలను తట్టుకుని, నవగ్రహాల అనుకూలతను పొందడానికి ఈ చిన్న నియమాన్ని పాటించి, భగవంతుని అనుగ్రహాన్ని సొంతం చేసుకోండి.




