Dakshinamurthy : చదువులోనే కాదు...ఏ రంగంలో రాణించాలన్నా...దక్షిణామూర్తిని ఆరాధించాలని ఎందుకు చెబుతారో తెలుసా?

చదువులోనే కాదు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించేందుకు దక్షిణామూర్తిని ఎందుకు ఆరాధించాలి? ఆయన మౌన బోధ, 16 స్వరూపాలు, పూజా విశిష్టత తదితర అంశాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 2 Sept 2026 9:25 AM IST
Dakshinamurthy : చదువులోనే కాదు...ఏ రంగంలో రాణించాలన్నా...దక్షిణామూర్తిని ఆరాధించాలని ఎందుకు చెబుతారో తెలుసా?
X

Dakshinamurthy Worship : కేవలం అక్షర జ్ఞానమే కాదు, జీవితంలో ఏ రంగంలోనైనా పూర్ణ విజయాన్ని, ఉన్నత స్థాయిని సాధించాలన్నా దక్షిణామూర్తి ఆరాధన అత్యంత విశిష్టమైనది. పరమశివుని జ్ఞాన అవతారమైన దక్షిణామూర్తి సకల విద్యలకు, సమర్థతకు, సనాతన గురు పరంపరకు ఆద్యుడు. మౌన వ్యాఖ్యానంతోనే సనకాది మునుల సంశయాలను పటాపంచలు చేసి జ్ఞానోదయం కలిగించిన ఈ దివ్య స్వరూపం వెనుక ఉన్న నిగూఢ అంతరార్థం, మంత్రశాస్త్రం విశ్లేషించిన 16 దక్షిణామూర్తి స్వరూపాల ప్రాశస్త్యం నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకం.

మౌన వ్యాఖ్యానం... సనకాది ఋషుల బ్రహ్మజ్ఞానం

బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం కోసం ఎంతగానో తపస్సు చేశారు. తమ సందేహ నివృత్తికై పరమేశ్వరుని ఆశ్రయించగా, స్వామివారు ఒక మర్రిచెట్టు కింద యోగభంగిమలో ఆసీనులయ్యారు. ఎటువంటి శబ్దాలు, ప్రవచనాలు లేకుండా నిశ్శబ్దంగా 'మౌన వ్యాఖ్యానం' ద్వారానే ఆ నలుగురు మహర్షులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అనుభవ పూర్వకమైన ఆ దివ్య జ్ఞానానికి దక్షిణామూర్తి ప్రతీకగా నిలిచారు.

నామ ప్రాశస్త్యం ... స్వరూప ఆంతర్యం

దక్షిణామూర్తి అనగా 'దక్షిణ' అనగా సర్వ సమర్థత కలిగినవాడు అని అర్థం. దుఃఖాలకు మూలకారణమైన అజ్ఞానాన్ని నాశనం చేసే పరమ దయా దాక్షిణ్యమూర్తి ఈయన. సాంబశివుడికి ఎడమవైపు పార్వతీదేవి లేని ఏకైక జ్ఞాన స్వరూపమిది. ఒక కాలుతో అపస్మార పురుషుడిని అంటే అజ్ఞాన రాక్షసుడిని తొక్కిపట్టి, మరో కాలును మడిచి, అక్షమాల, పుస్తకం, జ్ఞానముద్ర, వీణను ధరించి దర్శనమిస్తారు. తత్వదృష్టిలో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఒక్కటే అయినప్పటికీ, ఉపాసనా, వ్యవహార దృష్టిలో విభిన్న రూపాలుగా భావిస్తారు. ఇదే 'భిన్నత్వంలో ఏకత్వం'.

మంత్రశాస్త్రం ... 16 దక్షిణామూర్తి స్వరూపాలు

మంత్రశాస్త్రం, ఆగమ ప్రమాణాల ప్రకారం దక్షిణామూర్తి స్వామివారు 16 దివ్య రూపాల్లో ఉపాసకులకు ఫలాన్ని అందిస్తారు. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి ఇలా మంత్రశాస్త్రం మొత్తం 16 దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఉపాసనా ఫలితం

వటవృక్ష మూలాన నివసించే దక్షిణామూర్తిని ఉపాసించడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, చదువులో నైపుణ్యం లభిస్తాయి. చిన్నపిల్లలకు జ్ఞాపకశక్తి, తెలివితేటలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఉన్నవారికి నిర్ణయాధికారం, సమర్థత లభిస్తాయి. వృద్ధులకు, ముముక్షువులకు మనఃశాంతి, మోక్ష మార్గం సుగమం అవుతుంది. భస్మధారి, చంద్రకళాధరుడు అయిన జగద్గురు దక్షిణామూర్తిని నిత్యం స్మరించడం వల్ల అజ్ఞానమనే అంధకారం తొలగి, జీవితంలో సమస్త సంపదలు, కీర్తిప్రతిష్టలు ప్రాప్తిస్తాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story