Daruma Doll: ఇక్కడ పూరి జగన్నాథుడు...జపాన్‌లో దరూమా బొమ్మలు... కోరికలను ఇలా నెరవేరుస్తాయి
జపాన్ సంస్కృతిలో దరూమా అనేబడే అసంపూర్ణమైన రూపంతో ఉండే బొమ్మలను ఆరాధిస్తారు. అనుకున్న లక్ష్యాలను నెరవేరాలని కోరుకుంటూ ఈ బొమ్మలను ఆరాధించడం అక్కడ సంస్కృతిలో భాగం.
Daruma Doll: మన దేశంలో పూరి జగన్నాథుడి అసంపూర్ణ రూపం వెనుక ఒక దివ్యలీల ఉన్నట్లే, అటు జపాన్ సంస్కృతిలోనూ 'కళ్లు లేని' దివ్య రూపంతో ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక సంప్రదాయం కొనసాగుతోంది. అదే 'దరూమా' బొమ్మ. భారత్ నుంచి 5వ శతాబ్దంలో జపాన్ వెళ్ళి 'జెన్ బౌద్ధమతాన్ని' స్థాపించిన ప్రముఖ బౌద్ధ సన్యాసి బోధిధర్ముడి ధ్యాన ముద్ర ఆధారంగా ఈ బొమ్మలను తయారుచేస్తారు. సాధారణ అలంకరణ వస్తువుగా కాకుండా, మనిషి అంతరంగంలో ఉన్న లక్ష్యాన్ని, సంకల్పాన్ని నూటికి నూరు శాతం నెరవేర్చే దివ్య ప్రతీకగా ఈ బొమ్మను జపనీయులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
సంకల్ప బలానికి ప్రతీక ... దరూమా
జపాన్‌లోని షోరింజన్ దరూమా-జీ, కత్సూఓ-జీ వంటి ప్రసిద్ధ బౌద్ధ ఆలయాలలో ఈ దరూమా బొమ్మలకు విశేష పూజలు నిర్వహించి భక్తులకు అందిస్తారు. ఈ బొమ్మను కింద పడేసినా వెంటనే మళ్లీ నిటారుగా నిలబడేలా ప్రత్యేకంగా రూపొందిస్తారు. జపనీస్ భాషలో 'నానా కొరోబి యాఓకి' అనే సామెత ఉంది. అంటే ఏడుసార్లు కిందపడినా, ఎనిమిదోసారి మళ్లీ నిలబడు అని అర్థం. జీవితంలో ఎన్ని ఓటములు వచ్చినా ధైర్యంతో నిలబడాలనే సంకల్ప బలాన్ని ఈ దివ్య బొమ్మ మనకు గుర్తుచేస్తుంది.
విభిన్న రంగులు ... విశేష ఫలితాలు
దరూమా బొమ్మలు వివిధ రంగుల్లో లభిస్తాయి. ఒక్కో రంగు ఒక్కో నిర్దిష్ట కోరికకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎరుపు రంగు అడ్డంకులను దాటేందుకు, మానసిక బలాన్ని, రక్షణ ఇస్తుందని చెబుతారు. ఇక కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా తెలుపు రంగు దరూమా బొమ్మను పూజిస్తారు. ఇది పవిత్రమైన నిశ్చయత్వానికి ప్రతీకగా చెబుతారు. అంతేకాదు, సంపద, ఆర్థిక వృద్ది, అదృష్టాన్ని కోరుకునేవారు పసుపు రంగు దరూమా బొమ్మను ఆరాధిస్తారు. వ్యాపారంలో ఎదుగుదల, జీవితంలో ధనాత్మకమైన మార్పులు పొందాలనుకునేవారు నలుపురంగు బొమ్మలను పూజిస్తారు. ఉద్యోగం, విద్యారంగాల్లో నూతన అవకాశాలు, విజయాలు పొందడానికి నీలం రంగు దరూమా బొమ్మలను పూజిస్తారు.
కోరిక నెరవేర్చే పవిత్ర విధానం
దరూమా బొమ్మను పొందిన తర్వాత ముందుగా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని మనసులో అనుకోవాలి. ఆ తర్వాత ఆ బొమ్మకు ఎడమ కంటిని నల్లటి రంగుతో నింపాలి. ఆ బొమ్మను నిత్యం మనకు కనిపించే విధంగా పవిత్ర స్థలంలో ఉంచుకుని, అనుకున్న లక్ష్యం కోసం క్రమశిక్షణతో శ్రమించాలి. మనం అనుకున్న కోరిక నెరవేరిన వెంటనే, ఆ బొమ్మ కుడి కంటిని కూడా రంగుతో పూర్తి చేయాలి. అది ఒక పవిత్రమైన సంకల్ప సాధనకు ముగింపుగా భావిస్తారు. ఏడాది చివర్లో ఈ బొమ్మలను తిరిగి ఆలయాలకు తీసుకెళ్లి 'కుయో' అనే దివ్యమైన దహన సంస్కార క్రతువు ద్వారా అగ్నిదేవునికి సమర్పిస్తారు. మనిషి సంకల్పానికి దైవ అనుగ్రహం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని చాటిచెప్పే ఆధ్యాత్మిక రహస్యమే ఈ దరూమా! కాస్త వింతగా ఉన్నా అక్కడి ప్రజల జీవనంలో ఇది భాగమైంది.




