Dashavatara Secrets : దశావతారాల రహస్యం...ఆధ్యాత్మికంతో పాటు సమాజానికి ఉపయోగపడే రహస్యాలు ఇవి

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో దాగిన 10 జీవిత పాఠాలు ఏమిటి? మత్స్యావతారం నుంచి కల్కి అవతారం వరకు మనిషి జీవితం, బాధ్యతలు, ధర్మం, జ్ఞానానికి సంబంధించిన సందేశాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 18 Sept 2026 9:55 AM IST
Dashavatara Secrets : దశావతారాల రహస్యం...ఆధ్యాత్మికంతో పాటు సమాజానికి ఉపయోగపడే రహస్యాలు ఇవి
X

Dashavatara Secrets : శ్రీమహావిష్ణువు దశావతారాలను మనం సాధారణంగా భక్తి, పురాణ కథల కోణంలోనే చూస్తుంటాం. కానీ ఈ 10 అవతారాలను నిశితంగా పరిశీలిస్తే.. మనిషి ఎలా జీవించాలి? కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? బాధ్యతలను ఎలా మోయాలి? అహంకారాన్ని ఎలా జయించాలి? సమాజానికి ఎలా ఉపయోగపడాలి? వంటి ఎన్నో జీవిత పాఠాలు కనిపిస్తాయి. అందుకే దశావతారాలు కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించినవి మాత్రమే కాకుండా, మన జీవన విధానానికి కూడా అన్వయించుకోవచ్చని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ ముందుకు సాగాలి

దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. నీటిలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చేప తన ప్రయాణాన్ని ఆపదు. అదే విధంగా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటికి భయపడి వెనక్కి తగ్గకుండా, పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలనే సందేశాన్ని మత్స్యావతారంతో అన్వయించుకోవచ్చు. ఆ తర్వాతి అవతారం కూర్మావతారం. తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుంది. మనిషి జీవితంలోనూ ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం ఉండదు. అవసరం లేని సమయంలో ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని మనసును ప్రశాంతంగా ఉంచడం, ఆత్మపరిశీలన చేసుకోవడం ముఖ్యమనే భావన ఇందులో కనిపిస్తుంది.

బాధ్యత నుంచి తప్పించుకోకూడదు

వరాహావతారం మనకు బాధ్యతను గుర్తుచేస్తుంది. వరాహం తన శక్తికి మించిన భారాన్ని సైతం మోసే ప్రతీకగా పురాణాల్లో కనిపిస్తుంది. కుటుంబం, ఉద్యోగం, సమాజం.. ఇలా మనపై ఉన్న బాధ్యతలను భారంగా భావించకుండా వాటిని సమర్థంగా నిర్వహించాలనే జీవిత సూత్రాన్ని దీనికి అన్వయించవచ్చు. నరసింహావతారం విషయానికి వస్తే.. బయట ఉన్న శత్రువుల కంటే మనలోని అజ్ఞానం, భయం, బలహీనతలతో పోరాడటం మరింత ముఖ్యమనే సందేశాన్ని ఇందులో చూడవచ్చు. మన ఎదుగుదలకు అడ్డుగా నిలిచే లోపాలను గుర్తించి వాటిపై విజయం సాధించాలి.

అహంకారానికి చోటివ్వకూడదు

వామనావతారం మనిషి ప్రయాణంలో భౌతిక జీవితం, ఆధ్యాత్మిక ఆలోచన, అహంకార నియంత్రణ అనే మూడు దశలను గుర్తుచేస్తుంది. వామనుడు వేసిన మూడు అడుగుల కథను ప్రతీకాత్మకంగా తీసుకుంటే.. మొదటి అడుగు భౌతిక అవసరాల వైపు, రెండో అడుగు ఆధ్యాత్మికత వైపు, మూడో అడుగు మనలోని అహంకారాన్ని గుర్తించి దాన్ని త్యజించే దిశగా సాగాల్సిన అవసరాన్ని సూచిస్తుందని ఆధ్యాత్మిక వ్యాఖ్యానాల్లో చెబుతారు. పరశురామావతారం పట్టుదలకు ప్రతీకగా భావించవచ్చు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత మధ్యలో ఎదురయ్యే అడ్డంకులకు లొంగకుండా దానిని సాధించే వరకు కృషి చేయాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది.

ధర్మం, ఆనందం, జ్ఞానం

శ్రీరామావతారం మనిషి జీవితంలో ధర్మానికి ఉన్న ప్రాధాన్యాన్ని చెబుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా న్యాయబద్ధమైన మార్గాన్ని వదలకుండా జీవించాలనే ఆలోచనకు రాముడు ప్రతీకగా నిలుస్తాడు. శ్రీకృష్ణావతారం మాత్రం జీవితాన్ని మరో కోణంలో చూపిస్తుంది. సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు వాటినే జీవితంగా భావించి కుంగిపోకుండా.. పరిస్థితులను అర్థం చేసుకుని, చిరునవ్వుతో ముందుకు సాగాలనే సందేశాన్ని కృష్ణతత్వంలో చూడవచ్చు.

బుద్ధావతారం జ్ఞానం, కరుణ, ఆత్మపరిశీలనకు ప్రాధాన్యం ఇస్తుంది. మనకు తెలిసిన విషయాలను మన దగ్గరే దాచుకోకుండా, ఇతరులకు ఉపయోగపడే విధంగా జ్ఞానాన్ని పంచుకోవాలనే భావన ఇందులో కనిపిస్తుంది. చివరిది కల్కి అవతారం. పురాణ విశ్వాసాల ప్రకారం భవిష్యత్తులో అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపించే అవతారంగా కల్కిని చెబుతారు. దీనిని సామాజిక కోణంలో చూస్తే.. సమాజంలో ఉన్న అజ్ఞానం, చెడు ఆలోచనలు, అన్యాయం తొలగిపోయి మంచి విలువలు పెరగాలనే ఆకాంక్షగా అర్థం చేసుకోవచ్చు.

దశావతారాల్లో అసలు సందేశం ఇదే

మత్స్య నుంచి కల్కి వరకు ఉన్న 10 అవతారాలను కేవలం పూజలు, పురాణ కథలకే పరిమితం చేయకుండా.. వాటిలోని భావాలను మన జీవితానికి అన్వయించుకుంటే ఎన్నో విలువైన విషయాలు కనిపిస్తాయి. కష్టాల్లో నిలబడటం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, బాధ్యతలను నిర్వర్తించడం, అజ్ఞానాన్ని జయించడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, లక్ష్యంపై పట్టుదల చూపడం, ధర్మాన్ని పాటించడం, ఆనందంగా జీవించడం, జ్ఞానాన్ని పంచడం వంటి అంశాలు ప్రతి కాలానికీ ఉపయోగపడే జీవిత సూత్రాలుగానే చూడవచ్చు. అందుకే దశావతారాల గొప్పతనం కేవలం వాటి పురాణ నేపథ్యంతోనే ఆగిపోదు. వేల సంవత్సరాల క్రితం చెప్పిన కథల్లోనే నేటి మనిషి జీవితానికి అవసరమైన ఎన్నో ఆలోచనలు దాగి ఉండటం ఈ అవతారాలపై ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.