Dev Uthani Ekadashi 2026: శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు ఇదే...ఆ రోజు ఏం చేయాలంటే

2026 దేవుత్థాన ఏకాదశి నవంబర్ 20, 21 తేదీల్లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే ఈ పవిత్ర రోజున పూజా విధానం, శుభ ముహూర్తం, ఉపవాస నియమాలు, తులసి వివాహం విశిష్టత తెలుసుకుందాం.

Rudrachander
Published on: 11 Nov 2026 11:52 AM IST
Dev Uthani Ekadashi 2026: శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు ఇదే...ఆ రోజు ఏం చేయాలంటే
X

Dev Uthani Ekadashi 2026: హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే దేవుత్థాన ఏకాదశిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ రోజున మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశిని దేవుత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినం తర్వాత హిందూ సంప్రదాయంలో శుభకార్యాల నిర్వహణకు మళ్లీ ప్రాధాన్యత పెరుగుతుంది. మరి 2026లో దేవుత్థాన ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి? ఏ పనులకు దూరంగా ఉండాలి?

దేవుత్థాన ఏకాదశి 2026 తేదీ ఎప్పుడు?

2026 నవంబర్‌లో రెండో ఏకాదశిగా దేవుత్థాన ఏకాదశి రానుంది. అయితే ఆచార సంప్రదాయాలను బట్టి ఉపవాస తేదీలో స్వల్ప తేడా ఉంటుంది. స్మార్త సంప్రదాయం ప్రకారం నవంబర్‌ 20 శుక్రవారం, వైష్ణవ సంప్రదాయం ప్రకారం తీసుకుంటే నవంబర్‌ 21 శనివారం వస్తుంది. ఇక ఏకాదశి తిథి నవంబర్‌ 20 ఉదయం 7.15 గంటలకు ప్రారంభమై నవంబర్‌ 21 ఉదయం 6.31 వరకు ఉంటుంది. స్మార్త సంప్రదాయం ప్రకారం నవంబర్ 20న ఉపవాసం ఉండేవారు నవంబర్ 21 మధ్యాహ్నం 1:11 నుంచి 3:18 గంటల మధ్య పారణ చేయాలి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం నవంబర్ 21న ఉపవాసం ఉండేవారు నవంబర్ 22 ఉదయం 6:49 నుంచి 8:56 గంటల మధ్య పారణ చేయాల్సి ఉంటుంది.

దేవుత్థాన ఏకాదశి రోజున ఎందుకు శుభకార్యాలు ప్రారంభిస్తారు?

పురాణ విశ్వాసాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి కొన్ని శుభకార్యాలను నిర్వహించకుండా ఉంటారు. కార్తీక శుక్ల ఏకాదశి రోజున స్వామివారు యోగనిద్ర నుంచి మేల్కొంటారని నమ్ముతారు. అందుకే ఈ పర్వదినం నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి.

ఆ రోజు చేయాల్సిన పూజలు, దానధర్మాలు

దేవుత్థాన ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి శ్రీమహావిష్ణువును భక్తితో పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం, హరినామ స్మరణ చేయడం మంచిదని భక్తులు విశ్వసిస్తారు. ఈ కాలంలో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తారు. తులసి మొక్కను పూజించి, వస్త్రాలు, నైవేద్యం సమర్పించాలి. శ్రీమహావిష్ణువుకు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్ల శనగలను దానం చేయాలి. ఆవులకు లేదా ఇతర మూగజీవాలకు ఆహారం అందించాలి. రోజంతా భగవంతుడిని స్మరిస్తూ ఉపవాస నియమాలను పాటించాలి.

ఏకాదశి రోజున వీటికి దూరంగా ఉండాలి

ఈ పవిత్రమైన రోజున అన్నం తినకుండా ఉండటం ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన నియమంగా భావిస్తారు. అలాగే మసూర్ పప్పు (ఎర్ర కందిపప్పు) తీసుకోకూడదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి. ఉపవాసం చేసేవారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహార నియమాలను పాటించాలి.

మరుసటి రోజు తులసి వివాహం

దేవుత్థాన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజున తులసి వివాహం నిర్వహించడం ఆనవాయితీ. తులసి మాతను శ్రీమహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణుడు లేదా శాలిగ్రామంతో కల్యాణం చేస్తారు. దీనిని తులసి వివాహం అంటారు. ఈ వేడుకతో వివాహాది శుభకార్యాల ప్రారంభానికి మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది.

Rudrachander

Rudrachander

రుద్ర చందర్‌ తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు