Devidham Temple Ghost Festival: జార్ఖండ్‌లో దెయ్యాల ఉత్సవం... ఆలయంలోకి అడుగుపెట్టాగానే మాయం
Devidham Temple Ghost Festival: ఈ ప్రపంచంలో సైన్స్‌కు కూడా అందని కొన్ని రహస్యాలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దాగి ఉంటాయి.
Devidham Temple Ghost Festival
Devidham Temple Ghost Festival: ఈ ప్రపంచంలో సైన్స్‌కు కూడా అందని కొన్ని రహస్యాలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దాగి ఉంటాయి. అలాంటి వాటిలో జార్ఖండ్ రాష్ట్రం, పలమావు జిల్లాలోని హైదర్‌నగర్‌లో వెలసిన 'దేవీధామ్' ఒకటి. గత 100 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న ఒక వింత ఉత్సవం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిని స్థానికులు 'దెయ్యాల ఉత్సవం' అని పిలుస్తారు. ఈ దెయ్యాల ఉత్సవం వెనుక నిగూఢ రహస్యం దాగుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అగ్నిగుండం వద్ద వింత చేష్టలు
దెయ్యాల ఉత్సవం పేరు వినగానే చాలా మంది భయపడిపోతారు. అయితే, ఇక్కడ దెయ్యాలు ఉండవు. కానీ, దెయ్యం చేత పీడించబడుతున్నవారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా ప్రతిఏటా నిర్వహించే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా మానసిక స్థితి సరిగా లేని వారు, చేతబడి లేదా దుష్టశక్తుల ప్రభావం ఉందని నమ్మేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో వెలిగించే భారీ అగ్నిగుండం వద్దకు రాగానే, బాధితులు వింతగా కేకలు వేయడం, జుట్టు విరబోసుకుని ఊగిపోవడం వంటివి చేస్తారు. చూసేవారికి ఇది భయం గొల్పినా, ఆ తర్వాత జరిగే మలుపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికీ మనం గ్రామాల్లో ఇలాంటి దృశ్యాలు చూడొచ్చు. గాణగాపూర్ దత్తాత్రేయుని దేవాలయంలో ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి.
అమ్మవారి దర్శనంతో మాయం!
అగ్నిగుండం వద్దకు రాగానే ఊగిపోతూ కనిపించే వారు ఆలయంలోని అమ్మవారి గర్భాలయంలోకి అడుగుపెట్టానే ఒక్కసారిగా నిశ్శబ్ధంగా మారిపోతారు. అమ్మవారి దివ్యదర్శనం కలగగానే వారిలోని ప్రతికూల శక్తులు మాయమౌతాయి. సాధారణ మనుషుల్లా మారిపోతారు. ఇక్కడికి కేవలం హిందువులే కాదు, ముస్లింలు కూడా అధిక సంఖ్యలో వస్తారు. ఆలయానికి సమీపంలోనే 'జిన్ బాబా' సమాధి ఉండటం వల్ల ఇక్కడ మత సామరస్యం వెల్లివిరుస్తోంది.
నమ్మకం.. నిరూపణ
భక్తులు అమ్మవారికి సింధూరం, కొబ్బరికాయలు, ప్రత్యేకమైన తీపి నైవేద్యాలను సమర్పిస్తారు. "వైద్యులకు అందని సమస్యలు కూడా ఈ తల్లి పాదాల చెంత పరిష్కారం అవుతాయి" అనేది ఇక్కడికి వచ్చే వారి ప్రగాఢ విశ్వాసం. చుట్టుపక్కల ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు.
దేవీధామ్ క్షేత్రం అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. నమ్మకానికి.. దైవ శక్తికి ఒక ప్రతీక. ఈ ఆధునిక కాలంలో ఇవన్నీ నమ్మశక్యంగా లేకపోయినా, అక్కడ జరిగే ప్రత్యక్ష పరిణామాలను చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చెడుపై దైవశక్తి సాధించే విజయమే ఈ దేవీధామ్ వైభవం. జార్ఖండ్ వెళ్లినవారు తప్పకుండా దర్శించవలసిన ఆలయాల్లో ఈ దేవీధామ్ కూడా ఒకటి.




